మీరు తాగే నీటిలో లక్షల ప్లాస్టిక్ కణాలు, మతిపోగోట్టే నిజాలు!

ప్లాస్టిక్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య. ప్లాస్టిక్ అటు పర్యావరణంతో పాటు మనుషుల ఆరోగ్యాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని నిపుణులు ఎంతగా హెచ్చరిస్తున్నా… జనాల్లో చైతన్యం రావడం లేదు. తాత్కాలికమైన సౌకర్యానికి అలవాటు పడిన ఈ జనరేషన్… ఒకప్పటి సాంప్రదాయ పద్ధతులకు మారలేకున్నారు.

తాజాగా మరింత దిగ్భ్రాంతి కలిగించే అధ్యయనాలు వెలుగులోకి వచ్చాయి. మనం రోజూ తాగే నీటిలో ప్రమాదకర స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో 1 లీటర్ నీటిలో ఏకంగా 2.4 లక్షల ప్లాస్టిక్ పార్టికల్స్(కణాలు) ఉన్నట్లు నిర్ధారించారు. వీటిలో 90% నానో పార్టికల్స్ కాగా, 10% మైక్రో పార్టికల్స్ గా గుర్తించారు.

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తో పాటు మన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న నీటిని తాగడం సైతం శ్రేయస్కరం కాదని ఈ పరిశోధన తెలియజేస్తుంది. మనిషి చర్మం నుండి ప్రతిరోజు సూక్ష్మ రూపంలో చర్మ కణాలు ఎలా రాలిపోతుంటాయో… అదే విధంగా ప్లాస్టిక్ వస్తువుల నుండి కణాలు రాలుతూ ఆహారం, నీటిలో కలుస్తాయని అధ్యయనాల సారాంశం. మనకు తెలియకుండానే ప్రతిరోజూ లక్షల కణాలను శరీరంలోకి పంపిస్తున్నాం.

ప్లాస్టిక్ రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశించే విధానం 

ప్లాస్టిక్ దైనందిన జీవితంలో భాగమైపోయింది. మన నోట్లోకి మొదటగా వెళ్లే బ్రష్ నుండి సాయంత్రం తినే డిన్నర్ ప్లేట్ వరకు… అనేక అవసరాలకు ప్లాస్టిక్ ని వాడుతున్నాం. ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఆహారం, పానీయాలు ప్లాస్టిక్ బ్యాగ్స్ లో సరఫరా చేస్తున్నారు. వేడి వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాక్ చేసి అందిస్తున్నారు. దీంతో అనేక రూపాల్లో మన శరీరంలోకి ప్లాస్టిక్ రసాయనాలు చేరుకుంటున్నాయి.

ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయనాలు శరీరంలోకి చేరి కాలేయం, మూత్ర పిండాలు వంటి ప్రధాన అవయవాలను దెబ్బతీస్తాయి. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ కణాలు తీసుకోవడం లేదా పీల్చడం వలన… అవి నేరుగా పిండం లోని ముఖ్య అవయవాల్లోకి చేరుతున్నాయి. అలాగే మనుషుల మలం, రక్తంలో కూడా మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు కనుగొన్నట్లు సమాచారం.

మానవ శరీరానికి ప్లాస్టిక్ కలిగించే నష్టాలు 

రసాయన ప్రభావం: ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే థాలెట్స్, బిస్పినాల్ A వంటి రసాయనాలు హార్మోన్ల అసమతుల్యత కు కారణం అవుతాయి. పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే శారీరక ఎదుగుదలకు సంబంధించిన లోపాలు తలెత్తే అవకాశం ఉంది.

దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు: కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ రసాయనాలు కాలక్రమేణా పెద్ద మొత్తంలో శరీరంలో పేరుకుపోతాయి. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు.

నానో  ప్లాస్టిక్ కణాలు: అత్యంత సూక్ష్మంగా ఉండే నానో ప్లాసిక్ కణాలు గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారంలో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి కణజాలాల్లోకి కూడా సులభంగా చొచ్చుకొని వెళ్లగలవు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు కారణం అవుతాయి.

హార్మోన్స్ అసమతుల్యత: ప్లాసిక్ కణాలు శరీరంలోని హార్మోన్స్ వ్యవస్థ మీద దుష్ప్రభావం చూపుతాయి. హార్మోన్స్ సమతుల్యతను దెబ్బ తీయడం వలన సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది.

జెనెటిక్ నష్టం: ప్లాస్టిక్ పాలిమర్స్ జన్యు పదార్థాన్ని(DNA) సైతం ప్రభావితం చేస్తాయి.  ఇది క్యాన్సర్ కి కారణం అవుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కోల్పోయేలా చేస్తాయి. ప్లాస్టిక్ వినియోగం మెడిసిన్ పనితీరును కూడా మార్చేసే ఆస్కారం లేకపోలేదు.

పర్యావరణం ప్రభావం: ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా ప్లాస్టిక్ మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. గాలి, నేల, నీరు, ఆహార కాలుష్యం ద్వారా… ఆహార గొలుసులో ఈ ప్లాసిక్ కణాలు చేరి… పరోక్షంగా మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

జాగ్రత్తలు

నీటిని ఇలా తాగండి: ప్లాస్టిక్ రసాయనాల బారిన పడకుండా ఉండాలంటే… ఒకటే మార్గం, ప్లాస్టిక్ వినియోగాన్ని వదిలేయడమే. నీటిని ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేయవద్దు. నీటిని తాగేందుకు గాజు గ్లాస్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ మాత్రమే వాడండి.

నానో ప్లాస్టిక్ ని గుర్తించండి: అందుబాటులో ఉన్న సాంకేతికత నేపథ్యంలో నీటిలో ఉన్న నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ని గుర్తించడం సులభమే. సిమ్యులేటెడ్ రామన్ స్కాటరింగ్ మైక్రోస్కోపి(SRS) అనే సాంకేతికత సహాయంతో నీటిలోని 7 రకాల ప్లాస్టిక్ కణాలను వెంటనే గుర్తించవచ్చు.

అవైడ్ ఆన్లైన్, ఫాస్ట్ ఫుడ్: ఆన్లైన్ లో ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు వేడి వేడిగా ప్లాస్టిక్ కవర్స్ లో సర్వ్ చేస్తున్నారు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ప్లాస్టిక్ కవర్ తో కూడిన ప్లేట్ లో అప్పుడే వండిన ఫుడ్ అందిస్తన్నారు. కావున ఆన్లైన్, ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండండి.

క్లాత్ బ్యాగ్స్ లేదా గన్నీ బ్యాగ్స్ వాడండి: మార్కెట్ కి ఇంటి  నుండి స్వయంగా  క్లాత్ లేదా గన్నీ బ్యాగ్ తీసుకెళ్లండి. బయటకు వెళ్లిన ప్రతిసారి వస్తువులతో పాటు ప్లాస్టిక్ బ్యాగ్స్ తేవడం మానుకోండి.

నానో ప్లాస్టిక్ పార్టికల్స్ వలన కలిగే నష్టాలు తెలుసుకోవడానికి ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం మనకే కాదు, భవిష్యత్ తరాలను కూడా చేటు చేస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ని నిషేధించాలి. అప్పుడే మనుషులతో పాటు ఈ నేల కూడా సురక్షితంగా ఉంటుంది.

Leave a Comment