చికెన్ లెగ్ పీస్/బ్రెస్ట్… ఏది తింటే మంచిది?

మాంసాహార ప్రియులు చికెన్ ని ఎక్కువగా ఇష్టపడతారు. మటన్, బీఫ్, పోర్క్ తో పోల్చితే ఇండియాలో చికెన్ తినే వారి సంఖ్య అధికం. అలాగే మటన్ తో పోల్చుకుంటే చికెన్ అందుబాటు ధరలో లభిస్తుంది. మధ్య తరగతి వారు అందుకే చికెన్ ని ఎంచుకుంటారు. వారంలో రెండు మూడు పర్యాయాలు చికెన్ తినే కుటుంబాలు అనేకం. లేదంటే వారంలో కనీసం ఒక రోజు చికెన్ ని ఆస్వాదించాలని ఆరాటపడతారు.

అయితే చికెన్ కొనేటప్పుడు చాలా మందికి కలిగే సందేహం… కోడిలో ఏ భాగం తీసుకోవాలి. చికెన్ లెగ్ పీస్ మంచిదా లేదా చికెన్ బ్రెస్ట్ మంచిదా? అనే సందిగ్ధం ఏర్పడుతుంది. మరి ఈ రెండింటిలో పోషకాలు, రుచి, ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఏది ఉత్తమం? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే అంశాలు పరిశీలిద్దాం…

పోషకాలు ఎందులో మెండు?

అందుబాటు ధరలో లభించే చికెన్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల ఉడకబెట్టిన స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ పీస్ లలో 165 కేలరీలు ఉంటాయి. అలాగే 31 గ్రాముల ప్రోటీన్, 3.6 గ్రాముల కొవ్వు లభిస్తాయి.

ఇక చికెన్ లెగ్ పీస్ విషయానికి వస్తే… 100 గ్రాముల స్కిన్ లెస్ చికెన్ లో సుమారు 209 కేలరీలు ఉంటాయి. 26 గ్రాముల ప్రోటీన్, 10.9 గ్రాముల కొవ్వు ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ లో కేలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇక చికెన్ లెగ్ పీస్ లో కేలరీలు ఎక్కువ, ప్రోటీన్ తక్కువ ఉంటాయి. కొవ్వు విషయానికి వస్తే… లెగ్ పీస్ లో అధిక శాతం కొవ్వు ఉంటుంది.

చికెన్ బ్రెస్ట్ ప్రయోజనాలు 

చికెన్ బ్రెస్ట్ ని లీన్ మీట్ అంటారు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ స్వభావం వలన బరువు అదుపులో ఉంటుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, అధిక బరువుతో బాధపడేవారికి చికెన్ బ్రెస్ట్ బెటర్ ఆప్షన్.  బాడీ బిల్డర్స్, కండరాల నిర్మాణం కోరుకునేవారికి సైతం చికెన్ బ్రెస్ట్ గొప్ప ఎంపిక అని చెప్పాలి. చికెన్ బ్రెస్ట్ కండరాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది.

చికెన్ లెగ్ పీస్ ప్రయోజనాలు 

చికెన్ లెగ్ పీస్ లేదా థైస్ ని డార్క్ మీట్ అంటారు. బ్రెస్ట్ తో పోల్చుకుంటే చికెన్ లెగ్ పీస్ లలో ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణ మెరుగు పరుస్తాయి. రుచి పరంగా కూడా చికెన్ లెగ్ పీస్ బెస్ట్ ఆప్షన్. చికెన్ లెగ్ పీస్ జ్యూసీగా ఉంటుంది. ముక్కలు పొడిబారకుండా మెత్తగా ఉంటాయి. శారీరక శ్రమ చేసేవారు, బరువు పెరగాలని కోరుకునేవారు చికెన్ లెగ్ పీస్ తినడం ఉత్తమం. బలహీనమైన కండరాలు కలిగినవారు కూడా చికెన్ లెగ్ పీస్ తింటే మంచిది.

చికెన్ ఎలా వండి తినాలి?

చికెన్ లో పోషకాలు ఉన్నప్పటికీ… ఉత్తమమైన పద్ధతుల్లో వండుకోవాల్సి ఉంటుంది. అప్పుడే చికెన్ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చికెన్ బ్రెస్ట్ ని గ్రిల్లింగ్, బేకింగ్ లేదా ఉడకబెట్టి తినడం వలన పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి. ఈ పద్ధతుల్లో చికెన్ ని ప్రిపేర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక చికెన్ లెగ్ పీస్ లు ఎక్కువ సేపు ఉడికినప్పటికీ గట్టిపడవు. కాబట్టి బిర్యానీ, కర్రీ తరహా వంటకాలకు చికెన్ పీస్లు బెస్ట్ ఆప్షన్. ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకోవాలని కోరుకునేవారు మార్కెట్ నుండి చికెన్ పీస్ లు తెచ్చుకుంటే రుచికి రుచి… ఆరోగ్యానికి ఆరోగ్యం.

చికెన్ బ్రెస్ట్ లేక లెగ్ పీస్ లను డీప్ ఫ్రై చేయకపోవడమే ఉత్తమం. నూనెలో బాగా వేగించడం వలన చికెన్ లో కొవ్వు, కేలరీల శాతం పెరుగుతుంది. ఈ కారణంగా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది.

చికెన్ బ్రెస్ట్-చికెన్ లెగ్ పీస్… ఏది ఎంచుకోవాలి?

చికెన్ బ్రెస్ట్-చికెన్ లెగ్ పీసులలో రెండూ ఉత్తమమే. మీ ఆరోగ్యం, శరీర నిర్మాణం ఆధారంగా ఎంచుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలని కోరుకునేవారు, జిమ్ చేస్తూ కండరాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నవారు… తక్కువ కేలరీలు ఉండే చికెన్ బ్రెస్ట్ తినడం మంచిది. ఇక మంచి రుచి, జ్యుసి టెక్స్చర్, ఐరన్-జింక్ కోరుకునేవారికి చికెన్ లెగ్ పీస్ బెస్ట్ ఆప్షన్. మీ ఫిట్నెస్ గోల్స్ ఆధారంగా చికెన్ బ్రెస్ట్ లేదా చికెన్ లెగ్ పీస్ ని తినాల్సి ఉంటుంది.

Leave a Comment