సాధారణ డెలివరీ గగనంగా మారింది. గర్భం దాల్చిన ప్రతి మహిళకు తన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా చాలామంది గర్భిణులు నార్మల్ డెలివరీ కావాలని కోరుకుంటారు. అయితే నార్మల్ డెలివరీ అనేది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదల, గర్భధారణ సమయంలో ఎదురయ్యే పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
సరైన ఆహారం, తగిన వ్యాయామం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రసవానికి సిద్ధం కావచ్చు. మరి నార్మల్ డెలివరీకి సహాయపడే అలవాట్లు ఏమిటి? గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? తెలుసుకుందాం.

1. పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం
గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు, పెరుగు వంటి పోషకాహార పదార్థాలు ఉండాలి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను అందిస్తాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కడుపులో ఉన్న బిడ్డ సైతం ఆరోగ్యంగా, బలంగా ఉంటుంది. గర్భిణులు పోషకాహారం తీసుకోవడం అనివార్యం.
2. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం
గర్భిణులకు ప్రోటీన్ ఎంతో అవసరం. ఇది బిడ్డ కణజాలం, కండరాల ఎదుగుదలకు తోడ్పడుతుంది. పప్పులు, శనగలు, పెసర్లు, సోయాబీన్స్, పాలు, పనీర్, గుడ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మాంసాహారం తీసుకునేవారు బాగా ఉడికించిన చేపలు, చికెన్‌ను వైద్యుల సూచనల మేరకు ఆహారంలో చేర్చుకోవచ్చు. గర్భిణులు తమ ఆహారంలో ప్రోటీన్స్ ఉండేలా జాగ్రత్తపడాలి. ప్రోటీన్స్ తో కూడిన ఆహారం తీసుకోవాలి.
3. ఐరన్, కాల్షియం ఉన్న ఆహారం
గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య రాకుండా ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలకూర, తోటకూర, ఖర్జూరం, పప్పుధాన్యాలు, శనగలు వంటివి ఉపయోగపడతాయి. అలాగే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు కాల్షియం అందిస్తాయి. ఇవి తల్లి ఎముకల ఆరోగ్యానికి, బిడ్డ ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి. వైద్యులు సూచించిన ఐరన్, కాల్షియం మాత్రలను కూడా క్రమం తప్పకుండా వాడాలి.
4. తగినంత నీరు తాగాలి
గర్భిణులు రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గడంతో పాటు శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. దాహం వేయకపోయినా తరచుగా నీరు త్రాగాలి. శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్తపడాలి.
5. ప్రతిరోజూ వాకింగ్ చేయాలి
నార్మల్ డెలివరీకి సిద్ధమవుతున్న గర్భిణులు వైద్యుల సూచనల మేరకు ప్రతిరోజూ నడవడం మంచిది. వాకింగ్ వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. కండరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గర్భధారణ సమయంలో బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు వారానికి సుమారు 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ చేయవచ్చని వైద్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. సున్నితమైన గర్భధారణ కలిగినవారు వ్యాయామానికి దూరంగా ఉండాలి. పోషకాహారంతో తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా నార్మల్ డెలివరీ సాధ్యం అవుతుంది.
6. ప్రెగ్నెన్సీ యోగా, శ్వాస వ్యాయామాలు
వైద్యుల సూచనలతో ప్రెగ్నెన్సీ యోగా, తేలికపాటి స్ట్రెచింగ్, శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ఇవి శరీరాన్ని రిలాక్స్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. అయితే ప్రతి యోగాసనాలు గర్భిణులకు అనుకూలంగా ఉండదు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. యోగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
7. తగినంత నిద్ర, మానసిక ప్రశాంతత
గర్భధారణ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. శారీరక శ్రమలేని మనసుకు నచ్చిన హాబీస్ ని ఆచరించాలి.
8. రెగ్యులర్ వైద్య పరీక్షలు తప్పని
సరిగర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బిడ్డ ఎదుగుదల, తల్లి రక్తపోటు, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు, ఇతర ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలి. వైద్యులు సూచించిన మందులు, పోషకాహార సప్లిమెంట్లను మాత్రమే తీసుకోవాలి. ఆధునిక కాలంలో గర్భిణులకు రెగ్యులర్ వైద్య పరీక్షలు అవసరం.
నార్మల్ డెలివరీ కావాలంటే గర్భిణులు మొదటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం, తగినంత నీరు, వైద్యుల అనుమతితో వ్యాయామం, ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యకరమైన గర్భధారణకు తోడ్పడతాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నార్మల్ డెలివరీ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే సిజేరియన్ చేయడం కూడా సురక్షితమైన వైద్య నిర్ణయమే.
