ఓ రెండు జెనరేషన్స్ కి పూర్వం వివాహ బంధం జీవితాంతం కొనసాగాలనే ఆలోచన సమాజంలో బలంగా ఉండేది. చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయి సంసారాన్ని కొనసాగించేవారు. కానీ ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ జోక్యం వంటి అనేక కారణాలతో విడాకులు తీసుకునే వారి సంఖ్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారతదేశంలోనూ విడాకులు, విడిపోయి జీవించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
విడాకులు తీసుకోవడం భార్యాభర్తలు సమస్యగా, సామాజిక వైఫల్యంగా భావించడం లేదు. పిల్లలు మానసిక ఒత్తిడి, పెద్దల ఆందోళన వారికి పట్టడం లేదు. విడిపోదామని నిర్ణయించుకున్నాక ఎవరి మాట వినడం లేదు. అసలు విడాకులకు ప్రధాన కారణాలేంటి? ప్రపంచంలో ఏ దేశాల్లో విడాకుల రేటు ఎక్కువగా ఉంది? తెలుసుకుందాం.

1. భారతదేశంలో విడాకులకు ప్రధాన కారణాలు
భారతదేశంలో విడాకులకు ఒక్కటే కారణం ఉండదు. దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయి.
అనుమానాలు, నమ్మకద్రోహం: భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గడం, వివాహేతర సంబంధాలు ఏర్పడటం బంధాన్ని బలహీనపరుస్తాయి. వివిధ కారణాలతో దంపతుల్లో ఒకరు లేదా ఇద్దరు వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆకర్షణ, లైంగిక సంతృప్తి, ఆర్థిక అవసరాలు, సరదాలు ఇందుకు దారి తీస్తున్నాయి.
ఆర్థిక సమస్యలు: కుటుంబ ఖర్చులు, అప్పులు, సంపాదనలో వ్యత్యాసాలు, ఆర్థిక బాధ్యతలపై గొడవలు వస్తుంటాయి. ఇతరులతో పోల్చుకోవడం. తమ జీవితం గొప్పగా లేదనే అసహనం భాగస్వామిపై ప్రేమను దూరం చేస్తుంది.
కుటుంబ సభ్యుల జోక్యం: అత్తమామలు, ఇతర బంధువుల అధిక జోక్యం దంపతుల మధ్య విభేదాలను పెంచుతుంది. కొందరు పెద్దవాళ్ళు దంపతుల మధ్య ఏర్పడే మనస్పర్థలను తొలగించకపోగా, మరింత పెరిగేందుకు కారణం అవుతున్నారు.
గృహహింస, వేధింపులు: శారీరక, మానసిక వేధింపులు, వరకట్న వేధింపులు కూడా విడాకులకు ముఖ్య కారణాలు. ఈ జనరేషన్ లో కూడా కట్నం కోసం వేధించే భర్తలు, అత్తమామలు ఉన్నారంటే అతిశోయోక్తి కాదు.
అభిప్రాయ భేదాలు: పిల్లల పెంపకం, ఉద్యోగం, జీవనశైలి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం సమస్యలకు దారితీస్తుంది.
2. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్య్రం
గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్వతంత్రంగా జీవిస్తున్నారు. దీంతో వేధింపులు, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అనే ఆలోచనలో మార్పు వస్తోంది. గౌరవం, సమానత్వం లేని వివాహ బంధం నుంచి బయటపడటానికి చాలామంది మహిళలు ముందుకొస్తున్నారు. అయితే మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని విడాకులకు ప్రత్యక్ష కారణంగా చూడటం సరికాదు. ఇది అసంతృప్తికరమైన లేదా హింసాత్మక బంధం నుంచి బయటపడే అవకాశాన్ని కల్పించే అంశంగా కూడా చూడాలి.
3. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటు ఉన్న దేశాలు
ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సామాజిక పరిస్థితులు, వివాహ చట్టాలు, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.అధిక విడాకుల రేటు నమోదయ్యే దేశాలు.
మాల్దీవులు
రష్యా
బెలారస్
కజకిస్థాన్
లాట్వియా
అమెరికా
లిథువేనియా
అయితే ఈ జాబితాను ఖచ్చితమైన ప్రపంచ ర్యాంకింగ్గా భావించకూడదు. ఎందుకంటే దేశాల వారీగా గణాంకాలు సేకరించిన సంవత్సరం, లెక్కింపు విధానం మారుతుంటాయి. OECD 2024(Organization for Economic Co-operation and Development)నివేదిక ప్రకారం 2022లో చిలీలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 3.6 విడాకులు నమోదయ్యాయి. OECD దేశాల్లో ఇది అత్యధిక రేటు.
4. భారతదేశంలో విడాకుల పరిస్థితి ఎలా ఉంది?
ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో అధికారిక విడాకుల రేటు ఇప్పటికీ తక్కువగానే ఉంది. అయితే వివాహ బంధాల నుంచి విడిపోయి జీవించే వారి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. NFHS-5 (2019-21) సర్వేలో పాల్గొన్న 15-49 ఏళ్ల మహిళల్లో 1.1 శాతం మంది విడాకులు పొందినవారు, విడిపోయినవారు లేదా భర్త వదిలేసినవారిగా నమోదయ్యారు.
5. విడాకులు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వివాహ బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, నమ్మకం చాలా అవసరం. చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా మార్చకుండా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ఆర్థిక విషయాల్లో పారదర్శకత పాటించాలి. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించాలి. కుటుంబ సభ్యుల జోక్యానికి పరిమితులు ఉండాలి. అవసరమైతే మ్యారేజ్ కౌన్సెలింగ్ సహాయం తీసుకోవచ్చు. అయితే గృహహింస, వేధింపులు ఉన్నప్పుడు కేవలం సర్దుకుపోవడమే పరిష్కారం కాదు. బాధితులు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
విడాకులు అనేవి కేవలం భార్యాభర్తల మధ్య జరిగే చిన్నపాటి గొడవల ఫలితం కాదు. వాటి వెనుక అనేక సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. వివాహ బంధంలో ప్రేమతో పాటు గౌరవం, స్వేచ్ఛ, బాధ్యత కూడా ఉండాలి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగినప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
