పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అధికారిక లెక్కలు విస్తుపోయేలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(NSO) డేటా ప్రకారం ఇండియాలో 15-25 ఏళ్ల వయసున్న 26.1% అబ్బాయిలు బ్రహ్మచారులు గా ఉన్నారు. 2011లో 20.8% గా ఈ రేటు గణనీయంగా పెరిగింది. ఇక మొత్తం జనాభాలో 0.3% నుంచి 3-4% వరకు 40 ఏళ్ళు దాటిన అబ్బాయిలు వివిధ కారణాలతో పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతున్నారు.
ఆధునిక ప్రపంచంలో మారిన ఆలోచనా విధానం సైతం అబ్బాయిలు పెళ్లిని అవైడ్ చేసేందుకు కారణం అని నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి కంటే కెరీర్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వివాహం వలన వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోల్పోతామనే భావన యువకులలో కనిపిస్తుంది. ఒంటరి జీవితంలో స్వేచ్ఛగా బ్రతకొచ్చు, బాధ్యతలు లేని జీవితం అనే ఆలోచన ఉండొచ్చు. అదే సమయంలో భారతీయ సంప్రదాయాల రీత్యా వారు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదృశ్య పోరాటాలు, మానసిక ఒత్తిడి తప్పడం లేదు. మన దేశంలో సింగిల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటో చూద్దాం…

సింగిల్స్ కష్టాలు
కుటుంబం, సామాజిక ఒత్తిడి
మన సంస్కృతిలో పెళ్లి కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత. 25 ఏళ్ళు దాటిన యువకులకు సమాజం నుండి ఒత్తిడి ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్లినా ”పెళ్లి ఎప్పుడు?” అనే ప్రశ్న వెంటాడుతుంది. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవడం తప్పనిసరి అనే దృష్టి కోణం సమాజంలో ఉంది.
ఇక ఏ కారణంతో పెళ్లి చేసుకోక పోయినప్పటికీ… జనాలు దాన్ని ఒక లోపంగా చూస్తారు. పెళ్లి కాకుండా ఒంటరి జీవితం గడిపే వ్యక్తులను చులకనగా చూస్తారు. శారీరక, మానసిక లోపాలు అంటగడతారు. సింగిల్స్ కి తరచుగా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి.
కుటుంబ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొనాలంటే భయం వేస్తుంది. బంధువులు, స్నేహితులు… ఇంకా పెళ్లి కాలేదా అని హేళన చేస్తారు. సింగిల్స్… ఫ్యామిలీ లేదా స్నేహితుల వేడుకల్లో పాల్గొనేందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. సింగిల్స్ వేర్పాటువాదానికి గురవుతారు.
ఆర్థిక స్థిరత్వం-పెళ్ళికి ప్రమాణం
భారతదేశంలో పెళ్లి అంటే ఆర్థిక స్థిరత్వంతో కూడిన వ్యవహారం. పెళ్లి కావాలంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి. మంచి జీతం, సొంత ఇల్లు, కారు, గౌరవం, హోదా వంటి ఆర్థిక విషయాలు పరిగణలోకి వస్తాయి. ఈ క్రమంలో మగవారు ఆర్థికంగా స్థిరపడేందుకు కష్టపడాలి ఉంటుంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతారు. డబ్బులు సంపాదించాలనే పరుగులో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోల్పోతారు.
కుటుంబ సభ్యులు, సమాజం సెట్ చేసే బెంచ్ మార్క్స్ అందుకోలేకపోతే పురుషులు తీవ్ర నిరాశకు గురవుతారు. ఇండియాలో సింగిల్స్ ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య ఈ ఆర్థిక స్థిరత్వం.
ఒంటరితనం-డిప్రెషన్
పురుషులు తమలోని అన్ని భావాలను స్వేచ్ఛగా పంచుకోరు. తమ బాధలను ఎవరికీ చెప్పకుండా దాచేస్తారు. జీవిత భాగస్వామి ఉంటే ఒకింత కష్టనష్టాలు పంచుకునే వీలుంటుంది. ఒంటరిగా ఉండే పురుషులు రోజంతా తమ జీవితంలో చోటు చేసుకున్న విషయాలు పంచుకునే వ్యక్తి లేక మానసిక ఏకాంతతకు లోనవుతారు. సంతోషం, బాధ, కోపం వంటి ఎమోషన్స్ షేర్ చేసుకునే తోడు లేక సింగిల్స్ ఆవేదనకు గురవుతారు.
ఏడ్చే స్వాతంత్ర్యం కూడా మగవారికి ఉండదు. తమ బలహీనతలు బహిర్గతమైతే అవమానాలు తప్పవు. ఈ కారణాల వలన సింగిల్స్ తమలోని ఎమోషన్స్ బయటకు కనిపించకుండా అణచుకోవాల్సి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. సింగిల్స్ మూడీగా, ఏదో కోల్పోయినట్లు కనిపిస్తారు. కేవలం స్నేహితుల ద్వారా మాత్రమే తమ ఒంటరితనాన్ని దూరం చేసుకుంటారు. ఇక స్నేహితులతో కూడా చెప్పుకోలేని విషయాలు వారి మనసులోనే సమాధి చేసుకుంటారు.
రెంట్ హౌస్ దొరకడం కూడా కష్టమే
నగరాల్లో సింగిల్ పురుషులు ఎదుర్కొనే మరొక తీవ్ర సమస్య… రెంట్ హౌస్. సింగిల్స్, బ్యాచిలర్స్ కి ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు యజమానులు నిరాకరిస్తారు. అపరిశుభ్రమైన హాస్టల్స్ లో పరిచయం లేని వ్యక్తులతో ఉండలేక అద్దె ఇల్లు కోసం వెతికే బ్యాచిలర్స్ కి కష్టాలు తప్పవు. బ్యాచిలర్స్ లేదా ఓ ఒంటరి అబ్బాయికి ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. సింగిల్స్ క్రమశిక్షణగా ఉండరు. చెడు అలవాట్లు ఉంటాయి. ఇంటిని పాడు చేస్తారనే అపోహ యజమానుల్లో ఉంటుంది.
అడిగినంత రెంట్ ఇస్తామన్నా.. నచ్చిన ఇల్లు అద్దెకు దొరకడం కష్టమే. చేసేది లేక పెద్దగా సౌకర్యాలు లేని, మనసుకు నచ్చని గదుల్లో ఉండాల్సి వస్తుంది. సింగిల్స్ ని ఇబ్బంది పెడుతున్న అంశాలలో ఈ రెంట్ హౌస్ వ్యవహారం కూడా ఒకటి. ఇక నగరాల్లో సొంతింటి కల అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
గతంతో పోల్చితే సింగిల్స్ ని ఇండియన్ సొసైటీ చూసే దృష్టికోణం కొంత మెరుగైంది. అయినప్పటికీ ఇంకా మారాల్సి ఉంది. సింగిల్స్ సమస్యల పట్ల జనాల్లో అవగాహన రావాల్సి ఉంది. పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండటం వ్యక్తిగత ఎంపిక అని సమాజం గుర్తించాలి. వారి ప్రైవసీని గౌరవించాలి. పెళ్లి కాని అబ్బాయిలను అసమర్ధులుగా, లోపాలు కలిగిన వారిగా చూడటం మానాలి. ఒకరు సింగిల్ గా ఉండటం వెనుక పలు కారణాలు, సమస్యలు ఉంటాయని గ్రహించాలి.
అలాగే సింగిల్స్… ఒంటరితనం వలన ఎదురయ్యే మానసిక సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. తమ ఒంటరితనాన్ని కొన్ని మార్గాలు అనుసరించడం ద్వారా దూరం చేసుకోవాలి. స్నేహితులతో గడపడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం, ట్రిప్స్ కి వెళ్లడం వంటి ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోండి. ఆ విధంగా ఒంటరితనం వలన ఏర్పడే ఒత్తిడిని జయించవచ్చు. మానసిక ప్రశాంతత పొందవచ్చు.
