మీ శరీరం వ్యాయామం కోరుకుంటుందని సూచించే లక్షణాలు!

వ్యాయామం శరీరానికి గొప్ప ఔషధం. ఆధునిక జీవనశైలికి అత్యంత ప్రధానం. గతంలో అందరూ శారీరక శ్రమతో కూడిన వృత్తుల్లో ఉండేవారు. రోజంతా కష్టపడేవారు. ఆ జనరేషన్ కి ప్రత్యేకంగా వ్యాయామం అవసరం లేకుండా పోయింది. గంటల తరబడి చెమటోడ్చి పని చేయడం వలన సహజంగానే శరీరానికి వ్యాయామం లభించేది. ప్రస్తుత పరిస్థితులు వేరు. మారిన జీవనశైలి, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత రీత్యా కూర్చొని పని చేస్తున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. దానికి తోడు అసమయ భోజనం, అనారోగ్యపూరిత ఆహారం తీసుకుంటున్నారు.

రోజంతా కూర్చుని పని చేసే ఉద్యోగులకు వ్యాయామం ఆవశ్యకం. శరీరానికి తగినంత వ్యాయామం లేకపోతే రోగాలు వెంటాడతాయి. దినచర్యలో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాగా శరీరం కొన్ని లక్షణాల ద్వారా మీకు వ్యాయామం అవసరం అనే సంకేతాలు ఇస్తుంది. అప్పుడు అశ్రద్ధ చేయకుండా జీవనశైలి మార్చుకోవాలి. వ్యాయామం దిశగా అడుగులు వేయాలి. శరీరానికి వ్యాయామం అవసరం అని చెప్పే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

చిన్న పనులకే అలసట రావడం 

చిన్న చిన్న పనులు, శారీరక శ్రమకు విపరీతమైన అలసట అనిపిస్తే మీ శరీరం వ్యాయామం కోరుకుంటుందని అర్థం చేసుకోవాలి. కొన్ని మీటర్ల దూరం నడిచినా, మెట్లు ఎక్కినా, తేలికైన బరువులు మోసినా… అలసట భావన కలుగుతుంది. రోజూవారి పనులు చేసుకోవడానికి కూడా శరీరం సహకరించదు. వ్యాయామ లేమి కారణం శరీరం దృఢత్వం కోల్పోయిందని మనం ఈ సంకేతాలతో అర్థం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రక్తహీనత, నిద్రలేమితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలసట ఎక్కువగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది.

బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు 

శారీరక శ్రమ లోపిస్తే… తిన్న ఆహారంలోని కేలరీలు కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ అవుతాయి. తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు తక్కువగా ఉంటే బరువు పెరుగుతాయి. పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుంది. ఊబకాయం దాపురిస్తుంది. బరువు పెరిగితే… కూర్చోవడం, నిల్చోవడం, లేవడం కూడా కష్టంగా మారుతుంది. హార్ట్ అటాక్ తో పాటు మరికొన్ని రుగ్మతలకు ఊబకాయం కారణం. సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలతో పెద్ద మొత్తంలో కేలరీలను కరిగించవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

కండరాల బలహీనత 

రోజంతా కూర్చుని పని చేయడం వలన కండరాలు బలహీనపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెడ, భుజాలు, నడుము ప్రాంతాల్లో కండరాలు బిగుతుగా మారతాయి. శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండదు. భారంగా అనిపిస్తుంది. తేలికపాటి స్ట్రెచింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. కండరాల నొప్పి దీర్ఘకాలంగా బాధిస్తున్నా, నొప్పి ఎక్కువగా ఉన్నా… వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి.

నిద్రపట్టకపోవడం 

శారీరక శ్రమ లేకపోతే నిద్రపట్టదు. శ్రమజీవులు ఇంటికి రాగానే భోజనం చేసి పడుకుంటారు. సుఖమైన నిద్రను ఆస్వాదిస్తారు. ఈ జనరేషన్ కి నిద్రలేమి అతిపెద్ద సమస్యగా తయారైంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కావాలన్నా… వ్యాయామం చేయాలి. అర్ధరాత్రి దాటినా నిద్రపట్టకపోవడం, మధ్య మధ్యలో మెలకువ రావడం వంటి లక్షణాలు, మీ శరీరానికి వ్యాయామం అవసరం అని చెబుతున్నట్లు భావించాలి. అయితే పడుకునే ముందు వ్యాయామం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి, చిరాకు పెరగడం 

వ్యాయామం లోపిస్తే మానసిక ఆరోగ్యం సైతం పాడవుతుంది. తరచుగా కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం, అసహనం, చిరాకు పడుతుంటారు. చేసే పని మీద కూడా ఏకాగ్రత ఉండదు. నిద్ర సరిగా రావాలి అంటే… యోగ, నడక, ప్రాణాయామం వంటి వ్యాయామాలు సహకరిస్తాయి. అన్ని మానసిక సమస్యలకు వ్యాయామం పరిష్కారం కానప్పటికీ, హెల్తీ లైఫ్ స్టైల్ లో ఒక భాగం అని గ్రహించాలి.

బద్ధకంగా అనిపించడం 

శరీరానికి వ్యాయామం అవసరం అని సూచించే మరో లక్షణం బద్ధకం. ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించదు. పనులు సకాలంలో పూర్తి చేయలేరు. వాయిదా వేస్తూ ఉంటారు. బద్ధకాన్ని అధిగమించడం చాలా అవసరం. గంటల తరబడి కదలకుండా పని చేయవద్దు. ప్రతి అరగంటకు లేదా గంటకు లేచి కొన్ని నిమిషాలు తిరగండి. సాధ్యమైనంత వరకు లిఫ్ట్ కి బదులు మెట్లు ఉపయోగించండి. ఈ చిన్న చిన్న మార్పులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఆయాసం రావడం 

నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా, వేగంగా నడిచినా సాధారణం కంటే ఎక్కువగా అలసట, ఆయాసానికి గురైతే, మీ శరీరానికి వ్యాయామం అవసరం. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తుల సమస్య కూడా అలసటకు కారణం కావచ్చు. ఆయాసం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను కలవాలి.

రోజూ ఎంత సేపు వ్యాయామం చేయాలి?

ప్రపంచ ఆరోగ్య సంస్థల మార్గదర్శకాల ప్రకారం పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాలు వ్యాయామం చేయాలి. వేగంగా నడవడం, సైక్లింగ్ వంటి వ్యాయామాలతో పాటు వారంలో ఒకటి రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయండి. ఆరంభం 10-15 నిమిషాలు వ్యాయామం చేసి, క్రమంగా పెంచుతూ పోండి. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి.

Leave a Comment