మనుషులు పలు రకాలు. కొందరు కొత్తవారితో కలవలేరు. చొరవ తీసుకొని మాట్లాడలేరు. మరి కొందరు భిన్నంగా ఉంటారు. కొత్త పాత అనే బేధం లేకుండా ఎవరితోనైనా మాట కలుపుతారు. కొత్త బంధాలు, స్నేహాలు ఏర్పరచుకుంటారు. అంతర్ముఖులు ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండేందుకు… తమ పనులు తామే స్వయంగా చేసుకునేందుకు ఇష్టపడతారు. ఇలాంటి వ్యక్తులను ఇంట్రావర్ట్స్ (Introverts) అంటారు.
ఇంట్రావర్ట్స్ గా ఉండటంతో తప్పు లేదు. అయితే నేటి సమాజంలో రాణించాలి అంటే ఈ తరహా స్వభావం పనికిరాదు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది. స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించాల్సి ఉంటుంది. ఇంట్రావర్ట్స్ ఈ విషయంలో విఫలం చెందే ఆస్కారం ఉంది. కాబట్టి కెరీర్ లో ఎదగాలి అంటే ఇంట్రావర్ట్ నుండి ఎక్స్ట్రావర్ట్ గా మారాల్సిందే.

ఇంట్రావర్ట్ అంటే ఎవరు?
ఇంట్రావర్ట్స్ తమ ఆలోచనల ప్రపంచంలో గడపడానికి ఇష్టపడతారు. ఒంటరిగా సమయం గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొనడం వీరికి నచ్చదు. ఇంట్రావర్ట్స్ కి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. తమ ఆలోచనలకు దగ్గరగా ఉండే కొద్ది మందితోనే స్నేహం చేస్తారు. మాట్లాడతారు. అలాగే వేగంగా స్పందించరు. ఆచితూచి మాట్లాడతారు.
అదే సమయంలో ఇంట్రావర్ట్ అంటే సిగ్గు, భయపడటం కాదు. అలాగే కొత్తవారితో అసలు కలవలేరని కూడా చెప్పలేం. ఇది ఒక భిన్నమైన స్వభావం, వ్యక్తిత్వం. ప్రతి ఇంట్రావర్ట్ లక్షణాలు ఒకేలా ఉండవు.
ఇంట్రావర్ట్స్ లక్షణాలు
కొత్త వ్యక్తులతో మాట్లాడలేరు: ఇంట్రావర్ట్స్ కొత్తవారిని కలిసినప్పుడు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏం మాట్లాడాలో, మాట్లాడితో ఏమనుకుంటారో అనే ఆందోళన వారిలో ఉంటుంది. జాబ్ ఇంటర్వ్యూలలో, సమావేశాల్లో మాట్లాడేందుకు, తమ భావాలు, ఆలోచనలు వ్యక్తీకరించేందుకు కష్టపడతారు.
అతిగా ఆలోచించడం: ఒక విషయాన్ని వ్యక్తీకరించేందుకు అతిగా ఆలోచిస్తారు. తన భావాలు ఎదుటువారికి నచ్చుతాయో లేదో? తాము మాట్లాడేది సరైనదేనా? అనే సందేహాలతో తికమక పడతారు. దీంతో మానసిక ఒత్తిడికి సైతం గురయ్యే ప్రమాదం ఉంది.
ఎమోషన్స్ చెప్పలేకపోవడం: కోపం, బాధ, ప్రేమ, ఆనందం… వంటి ప్రాథమిక ఎమోషన్స్ సైతం దాచేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మీద తమకున్న ఎఫెక్షన్ సైతం వ్యక్తీకరించలేరు. ఎదుటివారిలో నచ్చని విషయాలు బహిర్గతం చేయలేరు. ఈ కారణంగా ఎక్సట్రావర్ట్స్ అపార్థాలకు గురయ్యే అవకాశం ఉంది. తమ మీద ఎక్సట్రావర్ట్ కి ప్రేమ, ఆప్యాయత లేదని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భావించవచ్చు.
ఒంటరితనం, స్నేహితులు లేకపోవడం: ఇంట్రావర్ట్స్ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని ముందే చెప్పుకున్నాం. ఈ క్రమంలో వీరికి స్నేహితులు ఉండరు. ఉన్నప్పటికీ ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది ఉండరు. వారు అన్ని వేళలలో అందుబాటులో ఉండకపోవచ్చు. దాని వలన ఏకాకిగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. ఆపదలో ఆదుకునే మనుషులు కరువవుతారు.
ఉద్యోగం-కెరీర్ లో ఇబ్బందులు: సమావేశాల్లో మాట్లాడటం, తమ పనిని ఇతరులకు వివరించడం, కొత్త అవకాశాల కోసం ముందుకు రావడం వంటి సందర్భాల్లో కొందరు ఇంట్రావర్ట్స్ వెనుకంజ వేస్తారు. ఉన్న ప్రతిభను కూడా వ్యక్తీకరించలేరు. దీని వలన కెరీర్ లో ఎదిగే అవకాశం కోల్పోతారు. ప్రతిభ ఉంది కూడా సక్సెస్ కి దూరం అవుతారు.
ఇంట్రావర్ట్ సమస్యలు అధిగమించే మార్గాలు
ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తితో చొరవ తీసుకొని మాట్లాడేందుకు ప్రయత్నం చేయండి. మీ ఇంటి వాచ్ మెన్, లేదా బస్ స్టాప్ లో పక్కన నిల్చొన్న వ్యక్తి లేదా ఆఫీస్ లో పరిచయం లేని కొలీగ్… ఎవరైనా కావచ్చు. మీకు మీరే చొరవ తీసుకుని పలకరించండి.
ఎవరో ఏదో అనుకుంటారని, నవ్వుతారని… నచ్చిన పనిని చేయడం మానేయకండి. ఇష్టమైన పనులు చేసేందుకు కొంత సమయం కేటాయించండి. విమర్శలు, హేళనలను పట్టించుకోకండి.
ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీకు మీరే ప్రత్యేకం అని భావించండి. ఒకరిలా నేను లేను, నాకు అంత సామర్థ్యం, తెలివితేటలు లేవనే నెగిటివ్ థాట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టండి.
మీరు సాధించిన విజయాలు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి. మీ సక్సెస్ ని ఇతరులతో షేర్ చేయండి. మీ గొప్పతనాన్ని తెలియజేయండి. ఎదుటి వాళ్ళు గొప్పలు చెబుతున్నాడని భావిస్తారు అనుకోవద్దు. నిజమైన విజయాలు చెప్పుకోవడంలో తప్పులేదు.
అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకునేందుకు మొహమాట పడకండి. సహాయం అడిగితే ఏమనుకుంటారో అని ముందే ఒక అభిప్రాయానికి రాకండి. ఆఫీస్ లో కొలీగ్ అయినా.. రోడ్డు మీద ఓ స్ట్రేంజర్ అయినప్పటికీ సహాయం తీసుకునేందుకు వెనకాడకండి.
ఆఫీసుల్లో, మీ వీధిలో లేదా అపార్ట్మెంట్ లో జరిగే వేడుకల్లో బిడియం విడిచి పాల్గొనండి. అందరితో కలిసి హ్యాపీ మూమెంట్స్ ఆస్వాదించండి. విందులు, వేడుకల్లో నలుగురితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. దాంతో కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
సామాజిక పరిస్థితులు, కొత్త వ్యక్తుల విషయంలో మీలో భయం, తీవ్రమైన నిరంతర ఆందోళన ఉంటే… మానసిక వైద్యులను సంప్రదించండి. ట్రీట్మెంట్ తీసుకోండి. ఒంటరిగా, మౌనంగా ఉండటం తప్పేం లేదు. అదే సమయంలో అవసరమైన ప్రదేశం, సమయంలో భావాలు వ్యక్తీకరించకపోతే నష్టం జరుగుతుంది. అందుకే ఇంట్రావర్ట్స్… ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయడం మంచిది.
