ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. సమయం దొరకక, సౌలభ్యం కోసం ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో కోరిన ఫుడ్ ఐటెం ఇంటి తలుపు తడుతుంది. అయితే హోటల్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో లభించే ఫుడ్ ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు. శుభ్రత లేని పాత్రలు, ప్రదేశాల్లో, నాసిరకం-పాడైపోయిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పేరున్న రెస్టారెంట్స్ లో సైతం ఫుడ్ హైజెనిక్ గా ఉండటం లేదు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీల్లో ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవుట్ సైడ్ ఫుడ్ తో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. ఇందుకు కారణం… సొంతింటి కిచెన్ లో స్వయంగా తయారు చేసుకున్న ఫుడ్ సైతం విషంగా మారుతుంది. అందుకు కిచెన్ లో మనం చేసే తప్పులు, అవగాహన లేని కారణం అవుతున్నాయి. వంటింట్లో మనం పాటించే చిన్న చిన్న అలవాట్లు, పొరపాట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడేలా చేస్తున్నాయి. సాధారణంగా వంట గదిలో అవగాహన లేమితో చేస్తున్న తప్పులు ఏమిటో చూద్దాం..

1. అతిగా నాన్ స్టిక్ పాత్రల వినియోగం
ప్రతి ఇంట్లో నాన్ స్టిక్ పాన్స్, కుక్ వేర్ వినియోగం ఎక్కువైపోయింది. కానీ ఈ నాన్ స్టిక్ పాన్స్, పాత్రలతో ప్రమాదం పొంచి ఉంది. ఆహారం పాత్రకు అంటుకు పోకుండా ఉంటుందని నాన్ స్టిక్ పాత్రలను జనాలు ఉపయోగిస్తున్నారు. అయితే గీతలు పడిన, తుప్పు పట్టిన నాన్ స్టిక్ పాత్రలను వాడకూడదు. నాన్ స్టిక్ పాత్రల కోటింగ్ లో టెఫ్లాన్(Teflon)(PFOA-PTFE) అనే రసాయనాలు ఉంటాయి. కోటింగ్ పాడైనప్పుడు, అధిక ఉష్ణోగ్రత వద్ద వాటిని వాడితే సదరు రసాయనాలు ఆహారంలో కలిసిపోతాయి. క్యాన్సర్ కి కారణం అవుతాయి.
2. ప్లాస్టిక్ డబ్బాలు-కవర్ల వాడకం
అప్పుడే వండిన వేడి వేడి పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలు, కవర్లలో స్టోర్ చేయడం సాధారణంగా పలువురు చేస్తున్న అతి పెద్ద తప్పు. మైక్రో ఒవేన్ లో ప్లాస్టిక్ పాత్రలు ఉంచరాదు. వేడి వేడి టీ, సాంబార్, కూరలను ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడదు. ఇలా చేయడం వలన ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే BPA(Bisphenol A), Phthalates అనే ప్రమాదకర రసాయనాలు వేడికి కరిగి ఆహారంలో కలిసిపోతాయి. తద్వారా మన శరీరంలోకి చేరతాయి. ఈ రసాయనాలు ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కి దారి తీస్తాయి.
3. ఒకే నూనె పలుమార్లు వంటకు ఉపయోగించడం
పూరీలు, బజ్జీలు, గారెలు వంటి ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించిన నూనె మరలా మరలా ఉపయోగించడం భారతదేశంలో ప్రతి ఇంట్లో జరిగే తప్పు. ఇది సరికాదు. వంట చేయగా మిగిలిన నూనెను స్టోర్ చేసి పలు మార్లు తిరిగి వాడతారు. ఇలా చేయడం వలన నూనెలో ఫ్రీ రాడికల్స్, PAHs(Polycyclic Aromatic Hydrocarbons) వంటి విషపూరిత పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి కణజాలాన్ని దెబ్బ తీసి క్యాన్సర్ కి కారణం అవుతాయి.
4. ఆహారాన్ని మాడ్చడం, మాడిన ఆహారాన్ని తినడం
చికెన్ ఫ్రై, కెబాబ్స్, రోటీలను బాగా మాడ్చి తింటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను మాడ్చడం వలన మరింత రుచిగా ఉంటాయని నమ్ముతారు. మాంసం లేదా పిండి పదార్థాలను బొగ్గులపై, పెనం మీద మాడ్చి తినడం సరికాదు. కిచెన్ లో జరుగుతున్న తప్పుల్లో ఇది ఒకటి. ఆహారం పరిమితికి మించి వేడికి గురై మాడినప్పుడు అందులో Heterocyclic Amines(HACs), Acrylamide అనే క్యాన్సర్ రసాయనాలు ఉత్పన్నం అవుతాయి. అవి శరీరంలో పలు రకాల క్యాన్సర్ కి కారణం అవుతాయి.
అల్యూమినియం పాత్రల్లో పులుపు వంటకాలు చేయడం
అల్యూమీనియం పాత్రల్లో పుల్లగా ఉండే ఆహార పదార్థాలతో వంట చేయకూడదు. టమాటా పప్పు, చింతచిగురు పప్పు, చింతపండు పులుసుతో చేసే వంటకాలు తయారు చేయకూడదు. పులుపుకు ఆమ్ల గుణం ఉంటుంది. పులుపులో ఉండే ఆమ్లం వలన అల్యూమీనియం కరిగి ఆహారంలో చేరుతుంది. ఆ విధంగా మన శరీరంలోకి అల్యూమినియం చేరుతుంది. ఇది దీర్ఘకాలంలో శారీరక ఆరోగ్యాన్ని, జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
పరిష్కార మార్గాలు
నాన్ స్టిక్ పాన్స్, పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇనుము, మట్టి, స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమీనియం పాత్రలను మాత్రమే వాడండి.
గాజు, స్టీల్ పాత్రలలో నీరు తాగండి. స్టోర్ చేసుకోండి.
ఒకసారి వంటకు వాడిన నూనెతో పదే పదే వంటలు చేయకండి. ఆ నూనెను వాడుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి.
ఆహారాన్ని మాడ్చకుండా సమతుల్యంగా వండి తినండి. మాడిన ఆహారం విషతుల్యం అవుతుంది.
తాజా కూరలు, పండ్లు, తాజా మాంసంతో వంట చేసినప్పటికీ… వంట చేసే విధానం, పాత్రల స్థితి, మెటీరియల్ అనేది చాలా ముఖ్యం. వంటింట్లో ప్లాస్టిక్ పాత్రల వాడకం మానేయండి. లేదంటే క్యాన్సర్ మహమ్మారి బారిన పడటం అనివార్యం.
