భయపెడుతున్న ఎల్ నినో, ఇండియాలో కరువు తప్పదా?

ప్రపంచం మరో ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఎల్ నినో(El nino) రూపంలో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో వర్షాలు, వ్యవసాయం, ఉష్ణోగ్రతలు, నీటి లభ్యతపై ఎల్ నినో ఎఫెక్ట్ భారీగా పడనుంది. అన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియాలో ఎల్ నినోపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రజలు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.

దేశంలోని పలు పరిశ్రమలు ఎల్ నినో ప్రభావానికి లోను కానున్నాయి. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల వలన వ్యవసాయం కుదేలు అవుతుందని అంటున్నారు. కరువు వెంటాడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎల్ నినో అంటే ఏమిటీ? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎల్ నినోని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ?… ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎల్ నినో అంటే ఏమిటీ?

ఎల్ నినో ఒక స్పానిష్ పదం. దీని అర్థం ”చిన్న బాలుడు” లేదా ”ఏసు క్రీస్తు” అని అర్థం. పసిఫిక్ మహాసముద్రంలో… మధ్య, తూర్పు భూమధ్య రేఖ ప్రాంతాల్లోని సముద్ర ఉపరితలం అసాధారణంగా వేడెక్కడం వలన ఏర్పడే వాతావరణ మార్పు. ఫసిఫిక్ మహాసముద్రంలో వీచే గాలులు, సముద్ర ఉష్టోగ్రతల్లో మార్పులు వరల్డ్ వైడ్ ఈకో సిస్టం ను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా ఉష్ణమండల పసిఫిక్ మీదుగా వాణిజ్య గాలులు(Trade winds) తూర్పు నుండి పడమర వైపుకు వీస్తాయి. ఇవి వెచ్చని ఉపరితల నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టివేస్తాయి. ఈ పరిణామం దక్షిణ అమెరికా తీరం వెంబడి చల్లని నీరు, పోషకాలు అధికంగా ఉన్న నీరు పైకి రావడానికి అవకాశం కల్పిస్తాయి.

ఎల్ నినో సమయంలో ఈ తూర్పు వాణిజ్య పవనాలు బలహీనపడతాయి. లేదా వ్యతిరేక దిశలో పడమర నుండి తూర్పుకు వీస్తాయి. పశ్చిమ పసిఫిక్ లో దానిని నిలిపి ఉంచడానికి బలమైన వాణిజ్య పవనాలు లేకపోవడంతో ఉపరితలం మీద ఉన్న భారీ వెచ్చని నీటి నిల్వ అమెరికా సమీపంలోని మధ్య పసిఫిక్, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపు తూర్పుగా ప్రవహిస్తుంది. తూర్పు పసిఫిక్ లోని వెచ్చని నీటిపొర మందంగా మారడంతో లోతైన చల్లని నీరు, పోషకాలు ఉపరితలం మీదకు రాకుండా నిరోధించబడతాయి. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి… మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి చోటు చేసుకుంటుంది.

భారతదేశంపై ఎల్ నినో ప్రభావం 

భారతదేశ వ్యవసాయం ప్రధానంగా నైరుతి రుతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో నైరుతి ఋతుపవనాల గమనం మార్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఎల్ నినో ఏర్పడిన ప్రతిసారి ఇండియాలో కరువు చోటు చేసుకుంటుందని చెప్పలేమని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు ఉష్టోగ్రతలు పెరగడం వలన విద్యుత్, తాగు నీటి వినియోగం అధికం కావచ్చు. అయితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పరిస్థితులు ఉంటాయని కూడా చెప్పలేం.

రైతులపై ఎల్ నినో ప్రభావం 

సకాలంలో వర్షాలు పడకపోయినా, వర్షపాతం తగ్గినా పంటల పెంపకం, విత్తనాలు వేయడం, సాగు నీటి నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది. నేలలో తేమ శాతం తగ్గితే పంటల అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండదు. రాబడి తగ్గి నష్టాలు చోటు చేసుకుంటాయి. ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. 2026లో భారత వాతావరణ శాఖ(IMD) ఋతుపవనాల సమయంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని ఏప్రిల్ నెలలో నివేదిక విడుదల చేసింది.

ఎల్ నినో సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

నీటిని పొదుపు చేయాలి: నీటిని వృధా చేయడం మానేయాలి. క్రమశిక్షణతో కూడిన నీటి వినియోగం ఆవశ్యకం. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ఇంటి వద్ద నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి.

రైతులు ముందస్తు ప్రణాళికలు వేసుకోండి: రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను పరిశీలించి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలి. బిందు సేద్యం వైపు మొగ్గు చూపాలి. వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవాలి.

ఎండల నుండి రక్షణ: ఎండ తీవ్రత అధికంగా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఎక్కువ సమయం పని చేయకూడదు. శరీరానికి తగినంత నీరు త్రాగాలి. పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగరాదు.

వాతావరణ హెచ్చరికలు గమనించాలి: IMD జారీ చేసే వర్షపాతం, ఉష్టోగ్రత, వేడిగాలుల హెచ్చరికలను గమనించాలి. వదంతులను నమ్మకండి. అధికారిక సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోండి.

ఎల్ నినోని పూర్తి స్థాయిలో అరికట్టగలమా?

ఎల్ నినో సహజంగా ఏర్పడే వాతావరణ మార్పు. దీనిని పూర్తిగా నియంత్రించడం కుదరదు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్ట నివారణ చేసుకోవచ్చు. నీటిని పొదుపు చేయడం, వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు, వాతావరణ హెచ్చరికల ఆధారంగా ప్రణాళికలు వేసుకోవడం వలన కొంత మేర నష్టాన్ని తగ్గించవచ్చు. ఎల్ నీనో పట్ల అవగాహన పెంచుకోవాలి.నీటిని పొదుపు చేయడం, వాతావరణ సూచనలను అనుసరించడం ద్వారా రైతులు, ప్రభుత్వాలు ఎల్ నినో వలన ఎదురయ్యే సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

Leave a Comment