పిల్లలు పెద్దయ్యాక మీ మాట వినాలంటే ఇలా పెంచండి!

పేరెంట్స్ కి పిల్లలే ప్రపంచం. కిడ్స్ తమ జీవితంలోకి అడుగు పెట్టక ముందు నుంచే తల్లిదండ్రులు ప్రణాళికలు వేస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. పిల్లల్ని ఎప్పుడు కనాలి? ఎంత మందిని కనాలి? వాళ్ళను ఎలా తీర్చిదిద్దాలి? వాళ్ళ పోషణ, చదువుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయా?… ఇలా అనేక ఆలోచనలు వారి మదిలో మెదులుతాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారికి ఎలాంటి లోటు రాకుండా పెంచాలని పలు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళ సంతోషాలను, సరదాలను కూడా పక్కన పెట్టి సేవింగ్స్ మీద దృష్టి పెడతారు.

ఒక విధంగా చెప్పాలంటే పిల్లల కోసం పేరెంట్స్ సర్వస్వము ధారపోస్తారు. జీవితాలు సాక్రిఫైస్ చేస్తారు. పిల్లల్ని ప్రయోజకులను చేయాలనే పేరెంట్స్ ఆలోచనల్లో చిన్న స్వార్ధం కూడా ఉంటుంది. వారు లైఫ్ లో సెటిల్ అయితే వృద్ధాప్యంలో తమకు తోడుగా ఉంటారు. ఆసరాగా నిలుస్తారని ఆశపడతారు. అయితే అందుకు భిన్నంగా పరిస్థితులు తయారవుతున్నాయి. ప్రయోజకులైన పిల్లలను పేరెంట్స్ ని పట్టించుకోవడం లేదు. వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదు. డబ్బుల వేటలో విదేశాలకు చెక్కేస్తున్నారు. పేరెంట్స్ ని ఒంటరిగా వదిలేస్తున్నారు.

నానాటికి పెరుగుతున్న ఓల్డేజ్ హోమ్ ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. కనికరం లేకుండా పేరెంట్స్ ని భారంగా భావించిన కొడుకులు, కూతుళ్లు ఓల్డేజ్ హోమ్స్ లో వారిని వదిలేస్తున్నారు. వారసుల ప్రేమకు వారిని దూరం చేస్తున్నారు. వయసు, సంపాదన, ఆస్తులు… పిల్లల కోసం శాక్రిఫైస్ చేసిన పేరెంట్స్ మాత్రం నిస్సహాయులుగా మిలిగిపోతున్నారు. ఈ పరిస్థితికి పేరెంట్స్ కూడా కారణం. పిల్లల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయి. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉండాలన్నా… సామాజిక విలువలు పాటించాలన్నా… పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బాల్యంలో పిల్లలు నేర్చుకున్న విషయాలు, పేరెంట్స్ తీర్చిదిద్దిన వ్యక్తిత్వం ఆధారంగానే భవిష్యత్తులో వారి ప్రవర్తన ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలో నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పేరెంటింగ్ టిప్స్ 

మాటలు శ్రద్ధగా  వినండి: 

స్కూల్ నుండి ఇంటికి వచ్చాక పిల్లలు చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి.  మీరు పనిలో ఉన్నప్పటికి అందుకు కొంత సమయం కేటాయించండి. ఫ్రెండ్స్, టీచర్స్ తో పాటు స్కూల్లో, బయట తమకు అనుభవమైన ప్రతి విషయాన్ని పిల్లలు పేరెంట్స్ కి చెప్పాలని అనుకుంటారు. వారు ఓ పరిస్థితిని వివరించే తీరును బట్టి ఆలోచనా విధానం అంచనా వేయాలి. ఎలాంటి విషయాలకు బాధ పడుతున్నారు? ఎలాంటి విషయాలు వాళ్ళను సంతోష పెడుతున్నాయో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి.

వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం  చెప్పాలి. కోపం, దురుసుగా వారి ప్రవర్తన ఉంటే సరిచేయాలి. అర్ధమయ్యే రీతిలో చెప్పాలి. ఫ్రెండ్స్ తో స్నేహంగా ఉండాలని, టీచర్స్, స్టాఫ్ ని గౌరవించాలని చెప్పాలి. ఈ విధంగా చేయడం వలన పిల్లల్లో మంచి ప్రవర్తన పెంపొందుతుంది.

అప్రిషియేట్ చేయండి:

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే కోప్పడే పేరెంట్స్… వారి మంచి పనులను గుర్తించరు. పిల్లల్ని పొగడరు. పొగిడినా… జస్ట్ ‘గుడ్ గర్ల్ ఆర్ గుడ్ బాయ్’ అని సరిపెడతారు. అలా చేయకండి. ఒకవేళ స్వయంగా స్కూల్ బ్యాగ్ నీట్ గా సర్దుకుంటే… అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. ”నువ్వు చాలా చక్కగా నీ బ్యాగ్ సర్దుకున్నావు, వెరీ గుడ్…” అనండి. ఇలా వారు చేసే మంచి పనులను గుర్తించి ప్రోత్సహించడం మరింత క్రమబద్ధంగా, క్రమశిక్షణతో మెలిగేలా చేస్తుంది. మంచి పనులు చేస్తే పేరెంట్స్ పొగుడుతారనే ఆలోచనతో అలాంటి ప్రవర్తన అలవరుచుకుంటారు.

సమయాన్ని కేటాయించండి:

ఈ రోజుల్లో పేరెంట్స్ చేస్తున్న అతి పెద్ద తప్పు… పిల్లలతో గడపకపోవడం. నగరాల్లో జాబ్స్ చేసే పేరెంట్స్… ఇంటికి రాగానే అలసిపోతారు. ఇక మొబైల్ బ్రౌసింగ్, సోషల్ మీడియా అడిక్షన్ తో అసలు పిల్లలకు సమయం కేటాయించడం మానేస్తున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఫోన్. అదే వాళ్ళ ప్రపంచంగా బ్రతుకుతున్నారు. పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం చాలా అవసరం. రోజంతా కలిసే వీలుండదు కనుక… ఈవెనింగ్ పిల్లలతో గడపాలి. వాళ్ళను బయటకు తీసుకెళ్లాలి. ఇంట్లో అయినప్పటికీ ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని ముచ్చట్లు చెప్పాలి. అప్పుడే పిల్లలకు పేరెంట్స్ మీద ప్రేమ, అభిమానం పెరుగుతాయి. లేదంటే వాళ్ళ దృష్టిలో ఆర్థిక అవసరాలు తీర్చే యంత్రాలుగానే మిగిలిపోతారు.

అతి గారాబం:

అతిగా ప్రేమించడం, పిల్లలు చేసిన తప్పులను సమర్ధించడం, వాళ్ళ భావోద్వేగాలు అదుపు చేయకపోవడం ప్రమాదకరం.  పిల్లలు తాము ఏం చేసినా కరెక్ట్ అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి.  వయసుకు తగిన, అవసరమైన వస్తువులను మాత్రమే కొనివ్వాలి. విపరీతమైన కోపం, బాధ, సంతోషం వంటి ఎమోషన్స్ వారిలో గమనిస్తే… నియంత్రించేందుకు ప్రయత్నం చేయాలి. మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే పిల్లల ముందు పేరెంట్స్ ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే చాలా విషయాల్లో పిల్లలు తమ పేరెంట్స్ ని స్ఫూర్తిగా తీసుకుంటారు.

కోప్పడకండి.. అర్థం అయ్యేలా చెప్పండి:

పిల్లల్ని భయపెట్టి మంచి మార్గంలో నడిపించాలి అనేది… ఈ జనరేషన్ కి సెట్ కాదు. వాళ్లకు ఏదైనా ప్రేమగా, అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు బ్యాడ్ బాయ్, నీకు అసలు ఏమీ తెలియదు, నువ్వు ఎప్పుడూ ఇంతే… వంటి నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఇలా చేస్తే తాము అసమర్థులం, చెడ్డవాళ్ళం అని పిల్లలు మనసులో ముద్రపడే ప్రమాదం ఉంది. షూస్ ర్యాక్ లో పెట్టాలని, వస్తువులు-పుస్తకాలు క్రమబద్ధంగా నిర్దేశించిన ప్రదేశాల్లో పెట్టుకోవాలని వివరంగా చెప్పండి.

Leave a Comment