డేటింగ్ యాప్స్ పై పెరుగుతున్న మోజు! షాకింగ్ సర్వే!

మారిన జీవన శైలి కారణంగా సామాజిక విలువలు మసకబారుతున్నాయి. పెళ్లి అనే పవిత్ర బంధం క్రమంగా ప్రాధాన్యత కోల్పోతుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన నమ్మకం, గౌరవం, పరస్పర అవగాహన కొరవడుతున్నాయి. తమ జీవిత భాగస్వామిని మోసం చేయడానికి వెనకాడటం లేదు. ప్రముఖ మీడియా సంస్థలు జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి.

వివిధ కారణాలతో భార్యాభర్తలలో ఇరువురో లేక ఒకరో అక్రమ సంబంధం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందు కోసం మహిళలు, మగవాళ్ళు డేటింగ్ యాప్స్ ని ఆశ్రయిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. భారతదేశంలోని కొన్ని నగరాలు ఈ విషయంలో ప్రమాదకర స్థాయికి చేరాయి. నార్త్ తో పోల్చుకుంటే సౌత్ ఇండియన్స్…డేటింగ్  యాప్స్ ని అధికంగా వాడుతున్నట్లు గణాంకాలు చూస్తే అర్థం అవుతుంది.

రాష్ట్రాల వారీగా జరిపిన సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. మహిళలు.. అలాగే పురుషులతో పాటు యువకులు సైతం ఈ సర్వేలో పాల్గొనడం విశేషం. వారు తమ డేటింగ్ యాప్స్ అనుభవాలను పంచుకున్నారు.

మొదటి స్థానంలో బెంగుళూరు:

గ్లిడేన్ ప్రముఖ డేటింగ్ యాప్ గా ప్రాచుర్యం పొందింది. ఇన్ఫిడెలిటీ స్టడీ 2025 ప్రకారం గ్లిడేన్ యాప్ యూసర్స్ లో మొదటి స్థానంలో బెంగుళూరు వాసులు ఉన్నారు. ఆ యాప్ మొత్తం యూసర్స్ లో 18% బెంగుళూరుకి చెందినవారని సర్వే లెక్కలు చెబుతున్నాయి. 12 నగరాల్లోని 18 – 60 ఏళ్ల వయసున్న 1500లకు పైగా మహిళలు, పురుషులు ఈ సర్వేలో పాల్గొన్నట్లు సమాచారం. ఇక 30-45 ఏళ్ల మధ్యలో ఉన్న వ్యక్తులు డేటింగ్ యాప్స్ పట్ల ఎక్కువుగా ఆకర్షితులు అవుతున్నారు. యూజర్స్ లో అధిక శాతం ఈ ఏజ్ గ్రూప్ వారే ఉన్నారని సమాచారం.

హైదరాబాద్ కు రెండో స్థానం:

హైదరాబాద్ వాసులు ఈ సర్వేలో రెండో స్థానం దక్కించుకోవడం కొసమెరుపు. బెంగుళూరు తర్వాత 17% యూజర్స్ తో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీని కూడా బెంగుళూరు, హైదరాబాద్ ఈ విషయంలో వెనక్కి నెట్టాయి. 11% యూజర్స్ ఢిల్లీ మూడోస్థానంలో ఉంది. ఇక 9% యూజర్స్ తో ముంబై నాలుగో స్థానం, 7% యూజర్స్ తో పూణే ఇదో స్థానంలో వరుసగా నిలిచాయి. అలాగే యాప్ యూజర్స్ లో 65% పురుషులు కాగా, 35% స్త్రీలు ఉన్నారు.

 డేటింగ్ యాప్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు?

డేటింగ్ యాప్స్ ని మహిళలు, పురుషులు ఆశ్రయించడానికి పలు కారణాలు ఉన్నాయి. అయితే మెజారిటీ యూజర్స్ కేవలం శారీరక సుఖం కోసం డేటింగ్ యాప్స్ ని వాడటం లేదని గ్లీడెన్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. శారీరక సంబంధానికి మించి ఎమోషనల్ బాండింగ్ కోరుకుంటున్నారు. పార్ట్నర్ తో సరైన అనుబంధం లేకపోవడం, దూరం పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి.

తమ పార్ట్నర్ దగ్గర లభించిన ఎమోషనల్ బాండింగ్, సపోర్ట్ కోసం డేటింగ్ యాప్స్ ని ఆశ్రయిస్తున్నారు. వర్క్ ప్లేసెస్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ కొత్త వ్యక్తులతో పరిచయాలకు దారి తీస్తున్నాయి. తమ కోసం అధిక సమయం కేటాయించేవారికి వ్యక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

డేటింగ్ యాప్స్-మహిళా యూజర్స్:

మహిళలతో పోల్చుకుంటే పురుషులు అధికంగా డేటింగ్ యాప్స్ ని ఆశ్రయిస్తున్నారని మునుపటి గణాంకాలు చెబుతున్నాయి. అయితే గత రెండేళ్లలో మహిళల శాతం గణనీయంగా పెరిగింది. ఏకంగా 148% పెరుగుదల నమోదు చేసింది. ఈ ట్రెండ్ చూస్తుంటే పురుషులతో మహిళలు పోటీ పడే పరిస్థితి రానుంది. సంబంధాల పట్ల పట్టణ ప్రాంతాల్లోని మహిళల మారుతున్న ఆలోచనా దృక్పథాన్ని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా స్వేచ్ఛ కలిగిన మహిళలు డేటింగ్ యాప్స్ ని అధికంగా వాడుతున్నారని తెలుస్తుంది.

నిపుణులు ఏం చెబుతున్నారు?

సామాజిక సంబంధాల పట్ల ఈ విపరీత ధోరణులపై మానసిక నిపుణులు స్పందిస్తున్నారు. జీవిత భాగస్వామిని కాదని కొత్త వ్యక్తులను కోరుకోవడానికి వారు పలు అంశాలు తెరపైకి తెస్తున్నారు. ఒంటరితనం, ఎమోషనల్ సపోర్ట్ లోపించడం, మనస్పర్థలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, భాగస్వామికి సమయం కేటాయించకపోవడం వంటి కారణాలు ముఖ్యమైనవిగా చెబుతున్నారు. ఇతరులను స్ఫూర్తిగా తీసుకునే వారు కూడా ఉన్నారు.

సరాసరిన రోజులో గంట నుండి గంటన్నర సమయం డేటింగ్ యాప్స్ లో గడుపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  తమిళనాడులోని కాంచీపురం సైతం డేటింగ్ యాప్స్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు ఓ అంతర్జాతీయ సర్వే సంస్థ వెల్లడించింది.

డేటింగ్ యాప్స్ సైడ్ ఎఫెక్ట్స్:

మానసిక ప్రశాంత, వినోదం, ఎమోషనల్ బాండింగ్ లేదా మరే ఇతర సంతోషం కోసం డేటింగ్ యాప్స్ ని వినియోగించడం ప్రమాదకరం. సరదాగా మొదలైన ఈ అలవాటు అడిక్షన్ కి దారి తీసే అవకాశం ఉంది. అలాగే డేటింగ్ యాప్స్ లో పరిచయమయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం, వివరాలు పూర్తిగా తెలియవు. వారు చెప్పేవి అబద్దాలు కూడా కావచ్చు. డేటింగ్ యాప్స్ వేదికగా మోసపోయిన వ్యక్తులు కోకొల్లలు.

మొదట్లో మంచిగా నటించి, వ్యక్తిగత, ప్రైవేట్ సమాచారం సేకరించి బ్లాక్ మెయిల్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ డేటింగ్ యాప్స్ జోలికి పోకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవిత భాగస్వామితో సామరస్యంగా మాట్లాడి అవగాహన పెంచుకొని, బంధాన్ని బలపరుచుకోవాలి. డేటింగ్ యాప్స్ లేదా అక్రమ సంబంధాలు ఒకరి జీవితాలనే కాదు, కుటుంబాలను కూడా నాశనం చేస్తాయి.

Leave a Comment