30 ప్లస్ లో పెళ్లి, సంతానం కష్టమే! సహజంగా తండ్రి అవ్వండిలా!  

మన తాతలు, తండ్రుల జనరేషన్స్ లో పిల్లల్ని కనడం సహజ ప్రక్రియ. పెళ్ళైన ఏడాది లోపే పాపనో… బాబునో పెద్దల చేతిలో పెట్టేసేవారు. ఒక్కో జంట అరడజను పిల్లల్ని అవలీలగా కనేసేవారు. ఆ తరం ఆహారపు అలవాట్లు, జీవన విధానం సంతానోత్పత్తికి సహకరించేది. కాలం మారింది. ఈ జనరేషన్ కపుల్ పేరెంట్స్ హోదా కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. పిల్లల్ని కనడం అనే ప్రక్రియ అత్యంత క్లిష్టమైపోయింది.

పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా సంతాన ప్రాప్తికి నోచుకోవడం లేదు. దీనికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ కారణం అవుతుంది. లేటు వయసులో మ్యారేజ్, సిటీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లోపించడం, చెడు అలవాట్ల వలన గర్భధారణ కష్టంగా మారింది. సమాజంలో పిల్లలు లేని జంటల సంఖ్య నానాటికి పెరుగుతుంది. దీంతో ఫెర్టిలిటీ సెంటర్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఏళ్ల తరబడి వేచి చూసి విసిగిపోయిన జంటలు ఫెర్టిలిటీ సెంటర్స్ ని ఆశ్రయిస్తున్నాయి.

IUI, IVF, ICSI, థర్డ్ పార్టీ రీప్రొడక్షన్, ఫెర్టిలిటీ ప్రివెన్షన్ వంటి కృత్రిమ పద్ధతుల్లో సంతానం పొందే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది దంపతులకు ఆధునిక వైద్య విధానాల ద్వారా కూడా సంతానం కలగడం లేదు. థర్టీ ప్లస్ లో ఫెర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి. ముఖ్యంగా మగవాళ్లలో స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ పడిపోతుంది. స్పెర్మ్ నాణ్యతపైనే సంతానోత్పత్తి ఆధారపడిన నేపథ్యంలో… దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఫుడ్స్ స్పెర్మ్ క్వాలిటీని గణనీయంగా పెంచుతాయి. ముప్పై ఏళ్ళు పైబడిన వారు ఈ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా సంతానం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి విత్తనాలు 

గుమ్మడి విత్తనాల్లో అధిక మొత్తంలో జింక్ ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి దోహదం  చేస్తుంది. మెదడులో టెస్టోస్టిరాన్ విడుదల కావడం వలన కోరికలు సంభవిస్తాయి. కాబట్టి గుమ్మడి విత్తనాలు తినడం ఆవశ్యకం.

వాల్ నట్స్ 

స్పెర్మ్ చురుకుగా కదలడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇవి వాల్ నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. సంతానోత్పతికి రోజుకు ఓ గుప్పెడు వాల్ నట్స్ తినాలని వైద్యుల సలహా. స్పెర్మ్ చురుకుగా ఉన్నప్పుడే స్పెర్మ్ సెల్స్ అండాన్ని చేరుకోగలవు.

గుడ్లు 

పలు పోషకాలు కలిగిన చౌకైన ఆహారం గుడ్డు. ఎగ్స్ లో ఉండే విటమిన్-ఈ, సెలేనియం… స్పెర్మ్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. సెల్స్ వేగంగా కదిలేందుకు దోహదం చేస్తాయి.

డార్క్ చాక్లెట్స్ 

సంతానోత్పత్తికి స్పెర్మ్ కౌంట్ చాలా కీలకం. ప్రతి మిల్లీ లీటర్ కి 15 మిలియన్ స్పెర్మ్ సెల్స్ ఉంటే, ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ గా భావిస్తారు. డార్క్ చాక్లెట్స్ లో ఉండే ఎల్-ఆర్జినైన్, యాంటీఆక్సిడెంట్స్ స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు దోహదం చేస్తాయి.

ఆకుకూరలు 

ఆకు కూరల్లో విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర స్పెర్మ్ క్వాలిటీకి దోహదం చేస్తుంది. ఆకు కూరలు తినడం వలన జెనిటిక్ సమస్యల నుండి బయటపడవచ్చు.

సాల్మన్ ఫిష్ 

సంతానోత్పత్తికి దోహదం చేసే ఆహారాల్లో చేపలు కూడా ప్రధానమైనవి. చేపల్లో ఒమేగా 3 అండ్ విటమిన్ డి లభిస్తాయి. ఇవి హార్మోన్స్ ని క్రమబద్దీకరించడానికి తోడ్పడతాయి.

పుల్లని పండ్లు 

ఆరంజ్, స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి సిటరస్ ఫ్రూట్స్… విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్  కలిగి ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, స్పెర్మ్ క్వాలిటీకి సహకరిస్తాయి.

టమోటా 

టమోటోలో లైకోపేన్, యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. స్పెర్మ్ నిర్మాణాన్ని ఇవి క్రమబద్దీకరిస్తాయి. కాబట్టి ఆహారంలో టమాటో చేరుకోవాలని వైద్యుల సూచన.

ఈ ఆహారాలకు దూరంగా ఉండండి 

స్పెర్మ్ హెల్త్ కి కొన్ని ఆహార పదార్ధాలు, పానీయాలు చేటు చేస్తాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం.  ఫాస్ట్ ఫుడ్, బేక్డ్ ఫుడ్ ని అవైడ్ చేయండి. ప్రాసెస్డ్ మీట్ సైతం స్పెర్మ్ హెల్త్ కి మంచిది కాదు. ఇక ఆల్కహాల్, ధూమపానం మరింత హాని చేస్తాయి.

తండ్రి కావాలన్న మీ కోరిక నెరవేరాలంటే పైన చెప్పిన ఆహార విధానాలు విధిగా పాటించండి.

Leave a Comment