ఇయర్ బడ్స్ కి యువత అడిక్ట్ అయ్యారు. శరీరంలో ఈ గాడ్జెట్ భాగమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యాయామం సమయంలో, ప్రయాణాల్లో, వాహనాలను నడుపుతున్నప్పుడు ఇయర్ బడ్స్ వినియోగం తప్పనిసరైంది. పబ్లిక్ ప్రదేశాల్లో పక్కన ఉన్న వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా సాంగ్స్, వీడియోలు ఎంజాయ్ చేయడానికి ఇయర్ బడ్స్ అనువైనవి.
ఇయర్ బడ్స్ రద్దీ ప్రదేశాల్లో సైతం స్పష్టమైన మొబైల్ సంభాషణలకు దోహదం చేస్తుంది. అందుకే వృత్తిపరమైన అవసరాలకు కూడా ఇయర్ బడ్స్ వాడకం ఎక్కువైంది. అయితే ఇయర్ బడ్స్ వినియోగం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వినికిడి లోపం, చెవిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇయర్ బడ్స్ వారికి చుట్టూ పరిసరాల మీద దృష్టి ఉండదు. ఇది ప్రమాదాలకు కారణం కావచ్చు. కాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇయర్ బడ్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని అధిగమించవచ్చు.

ఇయర్ బడ్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్
అధిక ధ్వని: ఇయర్ బడ్స్ శబ్దాలను పట్టి ఉంచి నేరుగా చెవిలోకి చేరాలా చేస్తాయి. అతి దగ్గరగా సౌండ్స్ వినడం వలన చెవిలో ఉండే సున్నితమైన హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది శాశ్వతమైన లేదా పాక్షికమైన వినికిడి లోపానికి దారితీయవచ్చు. 85 డెసిబుల్స్ కి మించి శబ్దాలను ఇయర్ బడ్స్ లో వినడం ప్రమాదకరం.
ఇయర్ ఇన్ఫెక్షన్స్: ఇయర్ బడ్స్ చెవిలో సహజంగా ఏర్పడే గులిమి(ఇయర్ వ్యాక్స్)ని చెవి ద్వారం నుండి లోతైన ప్రదేశానికి నెట్టివేస్తాయి. అలాగే చెవిలోపలి భాగానికి గాలి సోకక చెమట, తేమ ఏర్పడతాయి. అవి చెవిలో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఏర్పడేందుకు కారణం అవుతాయి.
ప్రమాదాలు: ఇయర్ బడ్స్ పెట్టుకొని డ్రైవ్ చేయడం, రోడ్లను దాటడం చాలా డేంజర్. వాటి వలన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టి ఉండదు. వాహనాల హారన్స్ వినిపించకపోవడం వలన ఆక్సిడెంట్స్ కి గురి కావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
60/60 రూల్ పాటించండి: విరివిగా ఇయర్ బడ్స్ వినియోగించేవారు 60/60 రూల్ విధిగా పాటించాలని నిపుణుల సలహా. అనగా వాల్యూమ్ 60% మించకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి 60 నిమిషాలకు 10-15 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి.
50% రూల్: మీ డివైస్ మాక్సిమమ్ వాల్యూమ్ కెపాసిటీలో 50% మించకుండా మ్యూజిక్, వీడియోలు ఎంజాయ్ చేయండి. మీ పక్కన కూర్చొన్న వ్యక్తికి మీరు ఏమి వింటున్నారో తెలియకూడదు.
నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ ని సెట్ చేయండి: నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్ బడ్స్ చిరాకు కలిగించే నాయిస్ తగ్గించి ఆడియో క్లియర్ గా ఉండేలా దోహదం చేస్తాయి. సినిమాలు చూసే సమయంలో బీజీఎమ్ తక్కువ శబ్దంతో ప్లే అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోవడం ఉత్తమం.
రెగ్యులర్ క్లీనింగ్: ఇయర్ బడ్స్ ని తరచుగా సున్నితమైన క్లాత్ తో శుభ్రం చేయండి. కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ చేయండి. అతి కొద్ది మొత్తంలో ఆల్కహాల్ వేసి శుభ్రం చేయడం మంచి ప్రయోజనాలు ఇస్తుంది.
ఇతరులతో పంచుకోకండి: ఇయర్ బడ్స్ బ్యాక్టీరియా, ఫంగస్, స్కిన్ ఆయిల్స్ వాహకాలుగా పని చేస్తాయి. ఇయర్ బడ్స్ షేర్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ ఒకరి నుండి మరొకరికి సోకవచ్చు.
అవసరం లేనప్పుడు తొలగించండి: చాలా మంది ఇయర్ బడ్స్ వినియోగం లేని సమయంలో కూడా చెవుల నుండి తీయరు. ఉపయోగంలో లేనప్పుడు ఇయర్ బడ్స్ తీసేస్తే… చెవి లోపలి భాగాలకు అవసరమైన సహజ గాలి ప్రవాహం చేరుతుంది.
సేఫ్ ఛార్జింగ్: ఛార్జింగ్ కేస్, కేబుల్స్, అడాప్టర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉత్పత్తిదారులు సూచించిన వాటినే వాడండి. వోల్టేజ్ హెచ్చుతగ్గులు లేకుండా చూస్కోండి.
నిద్రపోయే ముందు తొలగించండి: చాలామంది పాటలు వింటూనో, వీడియోలు చూస్తునో ఇయర్ బడ్స్ చెవిలో అలానే ఉంచి నిద్రపోతారు. నిద్రకు ముందు తప్పనిసరిగా ఇయర్ బడ్స్ తీసేయాలి. లేదంటే చెవిలో ఇన్ఫెక్షన్స్ చేరతాయి. ఇయర్ డ్రమ్స్ మీద ఒత్తిడి పెరిగి డ్యామేజ్ కావచ్చు.
