వర్షాకాలం వచ్చిందంటే చాలు గృహిణులకు శ్రమ భారం పెరుగుతుంది. తరచుగా ఇల్లు తేమగా మారుతుంది. సకాలంలో బట్టలు ఆరవు. కిచెన్ లో పప్పులు, బియ్యం వంటి సరుకులు పాడయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ఏం చేయాలో తెలియక మహిళలు అసహనానికి గురవుతారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు.
ఈ చిట్కాలు మీ సమయాన్ని ఆదా చేసి, శారీరక శ్రమ తగ్గిస్తాయి. వంట సరుకులు, మొబైల్స్, షూస్ పాడవకుండా చేసి, డబ్బును ఆదా చేస్తాయి. ఈ చిట్కాలతో మీరు కుటుంబ సభ్యులను కూడా ఇంప్రెస్ చేయవచ్చు. వర్షాకాలంలో సాధారణంగా ఏర్పడే సమస్యలకు పరిష్కార మార్గాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం…

బట్టలు త్వరగా ఆరాలంటే చేయండి ఇలా!
వర్షాకాలంలో మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య బట్టలు ఆరకపోవడం. ప్రతిరోజూ కురిసే వర్గాల కారణంగా బయట ఆరేసిన బట్టలు తడుస్తూ ఉంటాయి. గంటల పాటు బట్టలు తడిగా ఉంటే వాసన వస్తాయి. రేపటి కోసం పిల్లల స్కూల్ యూనిఫార్మ్, భర్తకు ఆఫీస్ వేర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. తాజా దుస్తులు లేకపోతే వారు అసహనానికి గురవుతారు.
అందుకే వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసే సమయంలో ఇలా చేయండి. స్పిన్ సైకిల్ సమయంలో తడి బట్టలతో పాటు పొడిగా ఉన్న ఒక మెత్తటి టవల్ ని వేయండి. పొడి టవల్ బట్టల్లో ఉన్న అధిక తేమను పీల్చుకుంటుంది. దీంతో మీ బట్టలు ఆరే సమయం సగానికి తగ్గుతుంది.
వార్డ్ రోబ్ దుర్వాసన రాకుండా ఉండాలంటే!
వర్షాకాలంలో వార్డ్ రోబ్స్ తేమగా మారుతాయి. దీంతో వార్డ్ రోబ్స్ నుండి బూజు వాసన వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు వార్డ్ రోబ్ లో సిలికాన్ జెల్ ప్యాకెట్స్ ఉంచండి. లేదా సుద్ద ముక్కలను మీ అల్మారాలలో, షూ ర్యాక్స్ లో పెట్టండి. ఇలా చేయడం ద్వారా అవి తేమను గ్రహించి వార్డ్ రోబ్స్ దుర్వాసన రాకుండా కాపాడతాయి.
అద్దాలపై పేరుకుపోయే పొగమంచును నివారించండి
షేవింగ్ ఫోమ్ అద్దాలపై జమయ్యే పొగమంచును నివారించేందుకు చక్కని పరిష్కారం. కారు విండ్ షీల్డ్స్, బాత్ రూమ్ అద్దాల మీద పొగ మంచు చేరి మసకబారతాయి. పొగమంచు విజిబులిటీని దెబ్బ తీస్తుంది. దీనికి పరిష్కారంగా షేవింగ్ ఫోమ్ వాడండి. అద్దాల మీద షేవింగ్ ఫోమ్ ని పలుచని పొరగా పూయండి. అనంతరం శుభ్రమైన గుడ్డతో రుద్దండి. షేవింగ్ ఫోమ్ అద్దాలమీద పొగమంచు పేరుకుపోకుండా కవచంలా పనిచేస్తుంది.
కీటకాలకు చెక్ పెట్టండి
వర్షాల వలన వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఇది వంట గదిలో స్టోర్ చేసిన బియ్యం, పప్పు దినుసుల్లో కీటకాలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కీటకాలు పప్పు దినుసులను పాడు చేస్తాయి. కీటకాలను నివారించేందుకు బియ్యం, పిండి డబ్బాలలో మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు ఉంచండి. ఇక చెక్కెరకు చీమలు పట్టకుండా ఉండేందుకు నాలుగైదు లవంగాలు డబ్బాలు వేయండి. లవంగాల ఘాటు వాసనకు చీమలు రాకుండా ఉంటాయి.
తడిసిన గాడ్జెట్స్ ని ఇలా చేయండి
వానైనా వరదైనా కొన్ని పనుల కోసం బయటకు వెళ్లాల్సిందే. ఇక ప్రతి అవసరానికి మొబైల్ బయటకు తీసి వాడాల్సిందే. ఈ క్రమంలో మొబైల్ వర్షంలో తడిసే అవకాశం ఉంది. నీటిలో పడ్డ మొబైల్స్ ని వేడి చేయడం ప్రమాదం. దీనికి చక్కని పరిష్కారం మన ఇంట్లోనే ఉంది. బియ్యంలో మొబైల్ ని కూర్చి రాత్రంతా ఉంచాలి. ఉదయానికి మొబైల్ లోని తేమను బియ్యం సంగ్రహించి పొడిగా చేస్తుంది.
తడి బూట్లను ఇలా ఆరబెట్టండి
గంటల పాటు బూట్లు తడిగా ఉంటే పాడైపోతాయి. తడి బూట్లను ఇంటికి వచ్చిన వెంటనే ఆరబెట్టాలి. తడి బూట్లలో పాత న్యూస్ పేపర్స్ ని నలిపి లోపల కుక్కండి. ప్రతి కొన్ని గంటలకు తడిసిపోయిన పేపర్ బయటకు తీసి, మరలా పొడి పేపర్ పెట్టండి. షూ షేప్ పాడవకుండా ఆరబెట్టేందుకు ఈ చిట్కా సహకరిస్తుంది.
