స్వీట్స్ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా ఆహార ప్రియులు మక్కువగా స్వీట్స్ తింటారు. అలాగే పలు ఆహార పదార్థాలు, టీ, కాఫీ, శీతల పానీయాల్లో చక్కెర వినియోగం చాలా సాధారణం. అయితే వైద్యులు చక్కెరను పూర్తిగా త్యజించడం ఉత్తమం అంటున్నారు. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెర మన శరీరానికి పోషకాలు అందించకపోగా… పలు అనారోగ్యాలకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న డయాబెటిస్ ముప్పు నేపథ్యంలో పలువురు చక్కెర వినియోగాన్ని తగ్గించడానికి లేదా పూర్తిగా వదిలేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అయితే చక్కెర తినడం మానేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటీ? అదే సమయంలో నష్టాలు కూడా ఉన్నాయా? అనే విషయాలు తెలుగుకోవాలి. వైద్యులు, న్యూట్రిషన్స్ చక్కెరకు దూరంగా ఉంటే శరీరంలో జరిగే మార్పులు వెల్లడిస్తున్నారు. అవేమిటో ఈ కథనంలో చూద్దాం…

పంచదార మానేయడం వలన కలిగే ప్రయోజనాలు
బరువు నియంత్రణ: పంచదారలో కేలరీలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో పోషకాలు ఉండవు. ఎక్కువ మోతాదులో ఉండే కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేసి బరువు పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు పూర్తిగా షుగర్ ని వదిలేయడం మంచిది. షుగర్ ఫ్రీ లైఫ్ స్టైల్ క్రమంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
మధుమేహం: 90 మిలియన్స్ నుండి 100 మిలియన్స్ భారతీయులు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన జనాభాలో సుమారు 10% పైగానే ఉంది. సగటున 20 నుండి 79 ఏళ్ల మధ్య వయసు వారు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉన్నారు. మధుమేహ వ్యాధి సోకడానికి అనేక కారణాలుండగా… వాటిలో షుగర్ వినియోగం కూడా ఒకటి. షుగర్ తినడం వదిలేస్తే టైప్-2 మధుమేహం రాకుండా జాగ్రత్తపడొచ్చు.
గుండె ఆరోగ్యం: షుగర్ తినడం మానేస్తే క్రమంగా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి. వీటి పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు నుండి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కూడా షుగర్ ఫ్రీ ఆహారం దోహదం చేస్తుంది.
రోజంతా ఎనర్జీ: ప్రాసెస్ చేసిన చక్కెర ఇన్స్టంట్ గా శక్తిని ఇస్తుంది. అయితే కాసేపటికే తీవ్రమైన అలసట కలిగిస్తుంది. షుగర్ వినియోగం వదిలేసిన వారు రోజంతా ఎనర్జీగా ఉంటారు. పనుల్లో ఉత్సాహంగా కనిపిస్తారు. షుగర్ తినని వారికి స్థిరమైన శక్తి లభిస్తుంది.
కాంతివంతమైన చర్మం: వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించాలి అంటే షుగర్ కి దూరంగా ఉండాలి. షుగర్ వదిలేసిన వారి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం మీద ముడతలు పోతాయి. మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. అందుకే పలువురు సెలెబ్స్ స్వీట్స్ తినేందుకు, షుగర్ తో కూడిన పానీయాలు సేవించేందుకు ఇష్టపడరు.
దంతాలకు రక్షణ: స్వీట్స్, చాక్లెట్స్ దంతక్షయానికి దారితీస్తాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి షుగర్ తినడం ఆపేస్తే దంతాలు పాడవకుండా దృఢంగా ఉంటాయి. చిగుళ్ల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం సరిగా తినగలం. ఆహారం చక్కగా నమిలి తినడం వలన పలు ప్రయోజనాలు చేకూరుతాయి.
చక్కెర వదిలేయడం వలన కలిగే నష్టాలు
తలనొప్పి-చికాకు: చక్కెర వినియోగాన్ని పూర్తిగా వదిలేయడం కూడా కొన్ని సమస్యలకు కారణం అవుతుందని నిపుణుల సలహా. ఏళ్ల తరబడి షుగర్ వినియోగానికి శరీరం అలవాటు పడి ఉంటుంది. ఒక్కసారిగా షుగర్ తినడం ఆపేస్తే… తీవ్ర తలనొప్పి, చిరాకు, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది మూడ్ స్వింగ్స్ కి కూడా కారణం అవుతుంది. కాబట్టి మోతాదు తగ్గించుకుంటూ క్రమంగా షుగర్ ని అవైడ్ చేయాలని అంటున్నారు.
మెదడుపై ఒత్తిడి: స్వీట్స్ కి అలవాటు పడిన వారి మెదడు… వాటి కోసం వెతుకుతుంది. స్వీట్స్ తినాలనే కోరికలు కలిగిస్తుంది. ఈ క్రేవింగ్స్ మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. క్రేవింగ్స్ తీవ్ర స్థాయికి చేరితే… ఒకేసారి పెద్ద మొత్తంలో స్వీట్స్ తినే ప్రమాదం ఉంది.
సోషల్ ప్రాబ్లమ్స్: విందులు, వినోదాలు, వేడుకల్లో స్వీట్స్ వినియోగం సాధారణం. మన చుట్టూ ఉన్నవారు రుచికరమైన పలు స్వీట్స్ ఆస్వాదిస్తూ ఉంటే… మనకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. నేను స్వీట్స్ తినను, తినలేను అని చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. అందరితో పాటు తినాలా? షుగర్ అవైడ్ చేయాలన్న నియమానికి కట్టుబడి ఉండాలా? అనే సందిగ్ధత ఏర్పడుతుంది.
షుగర్ ప్రత్యామ్నాయాలతో సమస్యలు: షుగర్ కి ప్రత్యామ్నాయం అంటూ మార్కెట్ లో పలు కృత్రిమ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని వినియోగించడం వలన దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ కి ప్రత్యామ్నాయాలు ఇవే
బెల్లం-తాటి బెల్లం: తీపిని ఆస్వాదించడం పూర్తిగా వదిలేయలేని వారు బెల్లం, తాటి బెల్లం ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. బెల్లంలో ఖనిజాలు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. అయితే బెల్లం కూడా మితంగానే తినాలి.
స్వైటియా: ఇది జీరో క్యాలరీలు కలిగిన మొక్కలతో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన తీపి పదార్థం. మధుమేహ రోగులకు స్వైటియా చక్కని పరిష్కారం. సురక్షితమైనది కూడాను.
తేనె: ప్రకృతిలో లభించే తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలు, టీ, గ్రీన్ టీ వంటి పానీయాల్లో తేనె వినియోగాన్ని అలవాటుగా మార్చుకోవడం మంచిది. ఇది షుగర్ కి మంచి ఆల్టర్నేటివ్.
ఖర్జూరం – ఎండు ద్రాక్ష: పిండి పదార్థాలు, పానీయాల్లో షుగర్ కి ప్రత్యామ్నాయంగా ఖర్జూరం, ఎండు ద్రాక్ష పేస్ట్ ని వినియోగించండి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే షుగర్ ప్రత్యామ్నాయాలు.
