సాంప్రదాయాలకు పెద్ద పీఠ వేసే భారతదేశంలో కూడా విడాకుల తీసుకునే జంటల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లవ్ మ్యారేజ్-అరేంజ్డ్ మ్యారేజ్ అనే వ్యత్యాసం లేకుండా విడిపోవడానికి జంటలు పోటీపడుతున్నాయి. అయితే పెద్దలు కుదిర్చిన వివాహ బంధాలు ఒకింత బెటర్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం కావడం, తల్లిదండ్రులకు దూరంగా నగరాల్లో భార్యాభర్తలు జీవించడం విడాకులకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా విడాకులకు దారి తీస్తున్నాయి. ఈ జనరేషన్ కపుల్స్ భాగస్వామితో ఏ మాత్రం కంఫర్ట్ లేకుండా విడిపోవడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో విడాకులు తీసుకోవడం పెద్ద నేరం, సామాజిక తప్పిదంగా భావించేవారు. పెద్దలు కూడా విడాకులను పరువు సమస్యగా ఫీలవడం లేదు. కొన్ని సందర్భాల్లో విడిపోవడానికి పిల్లలను ఎంకరేజ్ చేస్తున్నారు.

అయితే పెళ్లి నూరేళ్ళ బంధం. ఒకరినొకరు అర్థం చేసుకొని మెలిగితే సంసారం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా క్షణికావేశానికి గురయ్యే భార్యలను భర్తలు తెలివిగా సముదాయించాలి. కోపం, అసహంతో ఉన్న భార్యతో ఆర్గ్యుమెంట్ చేస్తే… పరిణామాలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. కారణం ఏదైనా కానీ… కోపంగా ఉన్న భార్యను కూల్ చేసి, ఆమె మెంటల్ గా సెటిల్ అయ్యాక… సమస్యను చర్చిస్తే మంచిది. భార్యల కోపాన్ని ఎలా దూరం చేయాలో తెలియజేసే కొన్ని టిప్స్ భర్తల కోసం…
సెల్ఫ్ రెస్పెక్ట్: భార్య కంటే భర్త గొప్ప అనే ఆలోచనా విధానం వదిలేయండి. ఈ జనరేషన్ కి అది వర్తించదు. భాగస్వాములు ఇద్దరూ సమానమే. భార్య వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాలి. బంధులు, మిత్రుల ముందు తక్కువ చేసి మాట్లాడటం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం సరికాదు.
ట్రాన్సఫరెన్సీ: విషయం ఏదైనా దాచకుండా భార్యతో పంచుకోండి. మీరు దాచిన విషయం వేరొకరి ద్వారా తెలిస్తే మీపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ తాలూకు అసహనం మనసులో ఉండిపోతుంది. అలాగే ఆమెపై మీకు కలిగిన అభిప్రాయాలను నేరుగా, పొలైట్ మేనర్ లో అడిగి తెలుసుకోండి. వివాహ బంధంలో ట్రాన్స్పరెన్సీ చాలా కీలకం.
సమయం కేటాయించండి: గృహిణులు రోజంతా ఇంటికే పరిమితం అవుతారు. ఆఫీస్ నుండి వచ్చిన భర్త… ఆమెతో మాట్లాడకుండా టీవీ చూస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనే గడిపేస్తే వారికి నచ్చదు. భర్త ఇంటికి రాగానే కొన్ని విషయాలు చెప్పుకోవాలని వారు వేచి చూస్తారు. భార్య మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడం చాలా కీలకం.
ఆ రోజు ఆమెకు ఎలా గడిచిందో అడగండి. అలాగే మీకు ఎదురైన అనుభవాలు పంచుకోండి. ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశంలో భార్యతో కూర్చుని చిట్ చాట్ చేయండి. భార్యల కోపాన్ని దూరం చేయడానికి ఇది మంచి ప్రాక్టీస్.
మౌన దీక్ష వీడండి: భార్యతో గొడవైనప్పుడు చాలా మంది భర్తలు మాట్లాడటం మానేస్తారు. కొందరు రోజుల తరబడి ముఖం చాటేస్తారు. ఇది సరైన విధానం కాదు. సమస్యను పరిష్కరించకుండా మౌనంగా ఉంటే పెద్దది అవుతుంది. అందుకే సత్వరమే భార్యతో మాట్లాడి పరిష్కరించుకోండి. ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి.
ఇగో వదిలేయండి: కుటుంబానికి నేనే సుపీరియర్, భార్య నేను చెప్పినట్లే వినాలనే అహం వదిలేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులను భార్య గౌరవించినట్లే… మీరు కూడా ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను గౌరవించండి.
బాధ్యతలు పంచుకోండి: సంపాదించడం, ఇంటికి కావలసిన అవసరాలు సమకూర్చడం మాత్రమే నా బాధ్యత అనుకోకండి. కుటుంబానికి సంబంధించిన ప్రతి పనిలో మీకు కూడా భాగం ఉందని గ్రహించండి. స్కూల్ కి పిల్లలను రెడీ చేయడం, సెలవు దినాల్లో ఇంటిని శుభ్రం చేయడం, వంట చేయడం వంటి పనులతో భార్యల మనసులు గెలుచుకోండి. ఇలా చేయడం వలన ఆమెకు ఒత్తిడి తగ్గి, మీపై ప్రేమ పెరుగుతుంది.
చిన్న చిన్న సంతోషాలు మరవకండి: మీ ఆర్థిక స్థోమతను బట్టి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళండి. షాపింగ్స్ చేయండి. ఆమెకు ఇష్టమైన రెస్టారెంట్ లో టేస్టీ ఫుడ్ ఆర్డర్ చేయండి. వెకేషన్స్ కి బడ్జెట్ కేటాయించి ఏడాదిలో ఒకటి రెండు పర్యాయాలు విహరించండి.
పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి ముఖ్యమైన ఈవెంట్స్ గుర్తుపెట్టుకోండి. బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేయండి. ఇలా భర్తలు తమ వైవాహిక జీవితం ప్లాన్ చేసుకుంటే… సంసారం సాఫీగా సాగుతుంది. భర్తలకే కాదు భార్యలకు కూడా పైన చెప్పిన సూత్రాలు వర్తిస్తాయి.
