డబ్బులున్నాయని దుబారా చేస్తే దివాలా తీసినట్లే!

డబ్బు సంపాదించడం ఎంత కష్టమో… ఖర్చు చేయడం అంత సులభం. ఆదాయం వచ్చే మార్గాలు అత్యల్పం… ఖర్చు చేసే మార్గాలు అనంతం. చేతిలో కొంత పైకం ఉంటే దాన్ని ఖర్చు చేసే వరకు కొందరికి మనసు ఆగదు. అవసరం ఉన్నా లేకుండా వస్తువులు కొంటారు. మరి కొందరు ఆడంబరం కోసం, తమ గొప్పను చాటుకోవడానికి… మరి కొంత మంది మొహమాటానికి పార్టీలు ఇస్తారు. జల్సా చేస్తారు.

అడిగినవారికి అదే తడవుగా అప్పులు ఇచ్చేస్తారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి. భవిష్యత్ అవసరాలు ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేస్తే… తిప్పలు తప్పవు. ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అప్పులు, ఆర్థిక సహాయాలు, పెట్టుబడులు, వేడుకల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలో ఈ స్టోరీలో చర్చిద్దాం…

అవసరమా? కోరికా?

అవసరాలకు, కోరికలకు చాలా వ్యత్యాసం ఉంది. అవసరాలను ఖర్చుల నుంచి మినహాయించలేము. అవసరాల కోసం కచ్చితంగా బడ్జెట్ కేటాయించాల్సిందే. ఇల్లు, ఆహారం, మందులు, పిల్లల చదువు, నిత్యావసరాలు… ఈ కోవలోకి వస్తాయి. మన సంపాదనలో మెజారిటీ భాగం అవసరాలకు కేటాయించాలి.

అవసరాలు తీరిన అనంతరం కోరికల గురించి ఆలోచించాలి. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన మొబైల్స్, బ్రాండెడ్ బట్టలు, రెస్టారెంట్స్-పార్టీ కల్చర్ వంటివి కోరికల క్రిందికి వస్తాయి. వీటిని నియంత్రణ చేసుకుంటే డబ్బులు ఆదా చేయవచ్చు.

24 హవర్స్ రూల్స్ 

చాలా మంది టెంప్టేషన్ లో చూసిన వెంటనే వస్తువులు కొనేస్తారు. ఇది సరికాదు. మీకు ఒక వస్తువు నచ్చినప్పటికీ… 24 గంటల సమయం తీసుకోండి. ఆ వస్తువు కొనడం వలన మీకు ఉపయోగం ఉందా? ఆ ప్రొడక్ట్ మంచిదేనా? వంటి విషయాలు చెక్ చేసి, తర్వాత కొనండి. కొన్నిసార్లు 24 గంటల వ్యవధిలో మీకు ఆ వస్తువు మీద మోజు పోవచ్చు. అప్పుడు డబ్బులు సేవ్ అవుతాయి.

బడ్జెట్ ప్లాన్ 

జీవితంలో ప్రతి విషయానికి ప్రణాళిక ఉండాలి. ఆర్థిక భద్రతకు ఇది చాలా అవసరం. మన నెలసరి ఆదాయం ప్రకారం బడ్జెట్ రూపొందించాలి. ఆదాయంలో అవసరాలకు మొదటి ప్రాధాన్యత, పొదుపుకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరాలు, పొదుపుకి కేటాయించగా మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయండి. ప్రణాళిక లేకుండా ఆదాయాన్ని ఖర్చు చేస్తే పొదుపు సంగతి అటుంచితే, అవసరాలకు కూడా అప్పు చేయాల్సి వస్తుంది.

అత్యవసర నిధి 

ప్రతి మధ్యతరగతి కుటుంబం అత్యవసర నిధి మైంటైన్ చేయాలి. భవిష్యత్ లో సంభవించే ఊహించని పరిణామాలను అధిగమించడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. అనారోగ్యం, పిల్లల చదువులు, వేడుకల కోసం అత్యవసర నిధి కావాలి. అత్యవసర నిధి కోసం దాచిన డబ్బులు ఎమర్జెన్సీలోనే వాడాలి.

క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డుల వినియోగం ప్రమాదకరం. ఇవి ఆర్థిక భద్రతను దెబ్బతీసి అప్పుల పాలు చేస్తాయి. అవసరం లేకున్నా ఎడా పెడా షాపింగ్స్ చేసేస్తారు. అనంతరం అధిక వడ్డీలతో బ్యాంక్స్ వేసే బిల్లులు చెల్లించలేక అవస్థలు పడతారు. క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ మన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వాడాలి. ఇన్ టైం లో బిల్ చెల్లించి… పెనాల్టీ, ఇంట్రెస్ట్ రేట్స్ ని అవైడ్ చేయాలి.

ఆఫర్స్ & డిస్కౌంట్స్ ట్రాప్ లో పడొద్దు 

ఒకటి కొంటే మరొకటి ఫ్రీ, 50% ఆఫ్ వంటి ఆఫర్స్ కి టెంప్ట్ కాకండి. మనకు అవసరం లేని వస్తువు సగం ధరకు కొన్నా… 100% నష్టం క్రిందే లెక్క. ఇక కావాల్సిన వస్తువును కొనే ముందు ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చి చేసుకోండి. సరసమైన ధరకు క్వాలిటీ ప్రొడక్ట్ లభించేలా జాగ్రత్తపడండి.

Leave a Comment