పబ్లిక్ లో కిస్ చేయడం నేరమా?

భారతీయ యువతపై పాశ్చాత్య నాగరికత ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక ఏళ్లుగా ఇది అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చింది. తిండి, బట్ట, ప్రవర్తన, రిలేషన్స్ తో పాటు పలు విషయాల్లో మనం విదేశీ సంస్కృతిని అనుసరిస్తుంది. అలాంటిదే పబ్లిక్ కిస్సింగ్. ఒకప్పుడు మన దేశంలో వయసులో ఉన్న అమ్మాయి-అబ్బాయి కలవడం, మాట్లాడుకోవడమే నేరంగా భావించేవారు. పరాయి పురుషుడితో పెళ్లి కాని యువతులు పరిచయాలు పెంచుకోకూడదు అన్నట్లు ఉండేది. అలాంటి మైండ్ సెట్ నుండి లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు కల్చర్ మారిపోయింది. పెళ్లి కాకుండానే పట్టణాల్లో యువతీ యువకులు కలిసి జీవిస్తున్నారు.

ఇక పబ్లిక్ రొమాన్స్ సైతం పాశ్చాత్య సంస్కృతిలో భాగమే. బహిరంగ ప్రదేశాల్లో కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి విదేశీ ప్రేమికులు, స్నేహితులు వెనుకాడరు. దాన్ని అక్కడి జనం నేరంగా కూడా చూడరు. ఇండియన్స్ మైండ్ సెట్ ఇంకా ఆస్థాయికి చేరలేదు. ఓ యువతీ యువకుడు కలిసి రోడ్డు మీద వెళుతున్నా… పబ్లిక్ వాళ్ళ మీద ఒక లుక్ వేస్తారు. ఇక కొంచెం అన్యోన్యంగా మెలిగితే ఆశ్చర్యంగా చూస్తారు.

కాగా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటున్న, కౌగిలించుకుంటున్న ప్రేమికుల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. మెట్రోలు ట్రైన్స్, పార్కులు, బస్ స్టాప్స్, రెస్టారెంట్స్ లో ప్రేమికులు రొమాన్స్ చేస్తున్నారు. చుట్టూ మనుషులు ఉన్నా… తమదైన ప్రేమ మైకంలో విహరిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం ఇబ్బందికర అంశం. ఇది తమ చుట్టూ ఉన్నవారిని అసౌకర్యానికి గురి చేస్తుంది. మరి పబ్లిక్ ప్లేస్ లో ముద్దు పెట్టుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరమైన శిక్షలు ఉంటాయా? భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి. ఈ స్టోరీలో చూద్దాం…

ప్రధాన చట్టాలు 

భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) లేదా అనంతరం అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లలో ‘పబ్లిక్ కిస్సింగ్’ అనే పదాన్ని పొందుపరచలేదు. అలాగే దీన్ని నేరంగా పరిగణించలేదు. అయితే పబ్లిక్ కిస్సింగ్ సెక్షన్ 249 క్రిందకు వస్తుందని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు.

భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 294 ప్రకారం… బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడడం, ఇతరులకు ఇబ్బందిగా కలిగేలా నడుచుకోవడమా శిక్షార్హం. ఈ నేరానికి గరిష్టంగా 3 నెలలు జైలు శిక్ష లేదా జరినామా పడే అవకాశం ఉంది. కేసు తీవ్రత మీద ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని కేసుల్లో జైలు శిక్షతో పాటు జరిమానా సైతం విధించవచ్చు. పబ్లిక్ లో జుగుప్సాకర ప్రవర్తనకు చట్టపరమైన చర్యలు ఉంటాయి. కాగా భారతీయ చట్టాల్లో ”అశ్లీలత” అనే పదానికి సరైన నిర్వచనం లేదు. ఒక కేసు నమోదు అయినప్పుడు తీర్పు చెప్పే జడ్జి అవగాహన, ఆయన వ్యక్తిగత పర్సెప్షన్ మీద కూడా శిక్ష ఆధారపడి ఉండొచ్చు.

న్యాయస్థానాల తీర్పులు 

ఢిల్లీ హైకోర్టు తీర్పు(2009): ఢిల్లీ హైకోర్టు దృష్టికి బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ కి సంబంధించిన ఒక కేసు వెళ్ళింది. అయితే ఈ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం గమనార్హం. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న జంటకు ఊరట లభించింది. పబ్లిక్ లో పాల్పడినప్పటికీ సాధారణమైన ముద్దు లేదా కౌగిలింత ”అశ్లీలత” క్రిందకు రాదు అని కోర్టు అభిప్రాయం పడింది. పైగా ఇది మనుషుల ప్రాథమిక హక్కుగా పరిగణించింది. ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం ఒకరిని ఒకరు సాధారణ స్థాయిలో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం స్వేచ్ఛలో భాగమని, శిక్షతో నియంత్రిస్తే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందన్న భావన కోర్టు వెల్లడించింది.

అసౌకర్యానికి ఆధారాలు, కేసులు: బహిరంగ ప్రదేశంలో ముద్దాడిన, లేదా కౌగిలించుకున్న జంట మీద చర్యలు తీసుకోవాలన్నా, శిక్ష వేయాలన్నా… అందుకు ఆధారాలు కావాల్సి ఉంది. అలాగే ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. ఎలాంటి ఫిర్యాదు లేకుండా అరెస్ట్ చేయడం, కేసు నమోదు చేయడం కుదరదు అని సెక్షన్ 294 స్పష్టంగా చెబుతుంది.

చట్టబద్ధతను నిరూపించే అంశాలు 

బహిరంగ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకుంటే అది చట్టబద్ధమైనదా? కాదా? అనే అంశం కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది.

పరిమితి(డిగ్రీ ఆఫ్ ఇంటిమసీ): కేవలం పెదవులపై ముద్దు, సాధారణమైన కౌగిలింతను ప్రేమానురాగం వ్యక్తం చేసే చర్యగా భావిస్తారు. దీన్ని అశ్లీలతగా పరిగణించకూడదు. కానీ హద్దులు దాటి లైంగికంగా చర్యకు ప్రేరేపించేలా ముద్దులు, కౌగిలింతలు ఉంటే అది నేరం అవుతుంది. అశ్లీలత క్రిందకు వస్తుంది. అటువంటి చర్యలు పరిసరాల్లో ఉన్నవారికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి కాబట్టి, ఫిర్యాదులు అందే అవకాశం ఉంది.

సందర్భం-ప్రదేశం: ముద్దులు, కౌగిలింతలు వంటి చర్యల భావం… అది జరిగిన ప్రదేశం, సందర్భం ఆధారంగా కూడా మారిపోతుంది. పవిత్ర స్థలాలుగా భావించే పాఠశాలలు, మందిరాల్లో అటువంటి చర్యలకు తావులేదు. రద్దీగా ఉన్న ప్రదేశంలో సైతం ముద్దులు నిషిద్ధం. ఇటువంటి సందర్భాలు, ప్రదేశాల్లో… ఎటువంటి ఫిర్యాదు లేకుండానే పోలీసులు ప్రాథమిక చర్యలు తీసుకుంటారు.

మొత్తంగా చెప్పాలంటే భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవచ్చు. అయితే అది సాధారణంగా ప్రేమను వ్యక్తీకరించేలా మాత్రమే ఉండాలి. లైంగిక చర్యలకు ప్రేరేపించే విధంగా ఉంటే మాత్రం దాన్ని అశ్లీలత గా పరిగణిస్తారు. ఫిర్యాదుల అందిన నేపథ్యంలో చట్టపరమైన చర్యలు ఉంటాయి.

Leave a Comment