అగరబత్తులు ఎంత హానికరమో తెలుసా?

భారతీయ సంస్కృతిలో అగరబత్తులు ఒక భాగం. ముఖ్యంగా హిందువులు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ క్రతువుల్లో అగరబత్తీలు వాడతారు. ప్రతి దేవాలయంలో, ఇంట్లోని దేవుని మందిరంలో అగరబత్తులు తప్పనిసరి. మన దేశంలో వందల కోట్ల టర్నోవర్ ఈ బిజినెస్ కలిగివుంది. ఇంట్లో, కార్యాలయాల్లో ఉదయాన్నే అగరుబత్తుల వాసన పలకరిస్తుంది. అలాగే రూమ్ ఫ్రెష్నర్స్ వాడకం పరిపాటిగా మారింది.

కాగా, రూమ్ ఫ్రెష్నర్స్, అగరబత్తుల నుండి వెలువడే సువాసన మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. కాగా వీటి వాడకం హానికరం అంటున్నారు నిపుణులు. రూమ్ ఫ్రెష్నర్స్,  అగరబత్తుల నుండి వెలువడే కృత్రిమ వాసన, పొగ పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతున్నాయో తెలుసుకుందాం…

శ్వాసకోశ సమస్యలు 

అగరబత్తుల పొగలో సన్నని కణ పదార్థాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు ఉంటాయి. అగరబత్తుల పొగను రోజూ పీల్చడం వలన ఊపిరితిత్తుల్లో చికాకు, ఆయాసం, గొంతుమంట వస్తాయి.

ఆస్తమా, బ్రోన్కెటిస్, సీఓపీడీ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అగరబత్తుల పొగతో సమస్య తీవ్రతరం కావచ్చు.

విషపూరిత రసాయనాలు 

రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు, ఆటోమేటిక్ డిఫ్యూజర్స్, అగరబత్తులలో సువాసన కోసం వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఫ్రాలయేట్స్ వంటి రసాయనాలు వాడతారు. ఈ రసాయనాలతో కూడిన వాసన మెదడులోని నరాలపై ప్రభావం చూపుతుంది. మైగ్రేన్ తలనొప్పి, కళ్ళు తిరగడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

రూమ్ ఫ్రెష్నర్స్ తయారీలో వాడే ఫ్రాలయేట్స్ శరీరంలోని ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది.

అలర్జీ, చర్మ సమస్యలు 

సున్నితమైన చర్మం కలిగిన వారిని అగరబత్తుల పొగ, ఫ్రెష్నర్స్ లోని రసాయనాలు పలు అలర్జీలకు గురి చేసే ప్రమాదం ఉంది. వాటికి దగ్గరగా ఉన్నప్పుడు చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు రావచ్చు. అలాగే దురద కూడా కలగవచ్చు.

అలాగే కళ్ళల్లో నీళ్లు తిరగడం, కళ్ళు మంట, ఎర్రబారటం, తుమ్ములు రావడం వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అగరబత్తుల పొగకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండె సంబంధిత, దీర్ఘకాల సమస్యలు 

వెంటిలేషన్ లేని మూసిన గదుల్లో అగరబత్తులు, రూమ్ ఫ్రెష్నర్స్ ని ఉపయోగించడం మరింత ప్రమాదం. దీర్ఘకాలంలో ప్రాణాంతక రోగాల బారిన పడే అవకాశం ఉంది. అగరబత్తుల పొగలో ఉండే సూక్ష్మ కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో చేరి ఆక్సిడేట్ స్ట్రెస్ పెంచుతాయి. అనంతరం గుండె, రక్త నాళాలపై దుష్ప్రభావం చూపుతాయి.

అగరబత్తుల పొగ, సువాసన, రూమ్ ఫ్రెష్నర్స్ లో ఉండే బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పీల్చడం వలన ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం లేకపోలేదు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

పూజ చేసే సమయంలో ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. దీని వలన పొగ బయటికి పోతుంది. రసాయనాల ప్రభావం తగ్గుతుంది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో అగరబత్తులు వెలిగించకండి. అలా చేయడం వలన ఎక్కువ మోతాదులో పొగ ఉత్పత్తి అవుతుంది. రూమ్ స్ప్రేయర్స్ విషయంలో కూడా ఇదే తరహా జాగ్రత్తలు తీసుకోకండి. పూర్తిగా మూసివేసిన గదిలో స్ప్రే చేయడం సరికాదు.

కృత్రిమ రూమ్ ఫ్రెష్నర్స్ కి బదులు సహజమైన పద్ధతులను ఎంచుకోండి. ఇంట్లో గాలిని శుద్ధి చేయడానికి సాంబ్రాణి వాడండి. కర్పూరం సైతం కృత్రిమ రూమ్ ఫ్రెష్నర్స్ కి మంచి ప్రత్యామ్నాయం. అలాగే మంచి వాసనను వెదజల్లే పూలను రూమ్ లలో అమర్చండి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇంట్లోని విషవాయువులను తొలగించడానికి ప్రత్యేకంగా కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి తప్పనిసరిగా పెంచుకోండి. స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్స్ కి గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఉంటాయి. ఈ మొక్కలు అన్ని నర్సరీలలో అందుబాటు ధరల్లో లభిస్తాయి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే రూమ్ ప్రెష్నర్ల అవసరం ఉండదు. అందుకే వారంలో ఒకటి రెండుసార్లు మీరుండే గదిని శుభ్రం చేసుకోండి. చెడు వాసనలు దరి చేరకుండా జాగ్రత్త పడండి. బంధించి ఉంచిన గదుల కిటికీలు రోజులో కొంత సమయం తెరిచి ఉంచండి. బయటి వాతావరణంలోని తాజా గాలి గదిలోకి చేరి దుర్వాసనను దూరం చేస్తుంది.

చాలామంది దేవుని పూజ కోసం వాడే అగరబత్తులతో ఎలాంటి హానీ ఉండదు అనుకుంటారు. ఆ పొగను దగ్గరగా ఆస్వాదిస్తారు. కానీ అగరబత్తుల పొగ సైతం హానికరమే అని అధ్యయనాలు ధృవీకరించాయి. ఇక రూమ్ ఫ్రెషన్నర్స్ మరింత ప్రమాదం.

ఇంట్లో సువాసన ముఖ్యం అయినప్పటికీ మన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అగరబత్తుల పొగ, రూమ్ ప్రెషన్నర్స్ లో ఉండే రసాయనాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఊపిరితిత్తులు, గుండె వంటి ప్రధాన అవయవాల మీద దుష్ప్రభావం చూపుతాయి. అందుకే వీలైనంత వరకు వీటిని దూరం పెట్టండి. సువాసన, తాజాదనం కోసం సహజ మార్గాలు ఎంచుకోండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడండి.

 

Leave a Comment