నిద్రలేచిన వెంటనే మనకు ఎదురయ్యే క్షణాలు, అనుభవాలు ఆ రోజంతా వెంటాడుతాయి. అంటే మన డే ఆహ్లాదంగా మొదలైతే… ఆ రోజు పాజిటివ్ వైబ్ తో ముగుస్తుంది. బ్యాడ్ మూడ్ తో డే స్టార్ట్ అయితే… చికాకు, అలసట, పనులు జరగకపోవడం వంటి నెగిటివ్ అంశాలతో ముగుస్తుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ హెల్తీగా ఉండేలా చూసుకోవాలి.
అసలు హెల్తీ మార్నింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలా మందికి అవగాహన లేక, క్రమశిక్షణ లోపం వలన నిద్ర లేచిన వెంటనే తప్పులు చేస్తున్నారు. అనారోగ్యపూరిత జీవన శైలికి అలవాటు పడ్డారు. దాని తాలూకు అనర్థాలు… ఆరోగ్యం మీదే కాదు, కెరీర్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మన సమాజంలో తొంభై శాతం మంది ఉదయాన్నే చేసే తప్పులేంటో ఇప్పుడు చర్చిద్దాం…

సెల్ ఫోన్ చూడటం: నిద్రలేచిన వెంటనే ప్రతి ఒకరు చేసే తప్పు సెల్ ఫోన్ చూడటం. కొందరు కేవలం సమయం తెలుసుకోవడానికి సెల్ ఫోన్ చూసి పక్కన పెట్టేస్తారు. కానీ మెజారిటీ జనాలు… సోషల్ మీడియాలో తమకు వచ్చిన సందేశాలు, అప్డేట్స్ చెక్ చేసుకుంటారు. కనీసం ఓ అరగంట మొబైల్ చూడకుండా బెడ్ దిగరు.
నిద్రలేవగానే మొబైల్ చూడటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30-60 నిమిషాలు మొబైల్ స్క్రీన్ చూడటం వలన మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది. చదువు, వృత్తి, వ్యాపారం వంటి కీలక విషయాల్లో దృష్టి పెట్టలేరని హెచ్చరిస్తున్నారు.
సూర్యరశ్మి: ఉదయపు సూర్యకిరణాలు శరీరానికి మేలు చేస్తాయి. ఎర్లీగా నిద్రలేచి కాసేపు ఎండలో గడపడండి. దీని వలన శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది. అలాగే రాత్రివేళ మంచి నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ సైకిల్ క్రమబద్ధం అవుతుంది.
ఇందుకు భిన్నంగా ఆధునిక జీవనశైలి మారింది. లేటుగా నిద్రలేవడం, లేచిన వెంటనే వాష్ రూమ్ కి వెళ్లడం. రెడీ అయిన తర్వాత సొంత కార్ లోనో, క్యాబ్ లోనో ఆఫీస్ కి చేరడం చేస్తున్నారు. ఏమాత్రం సూర్యరశ్మి చేరని ఏసీ భవనాల్లో రోజంతా పని చేసి… రాత్రి ఇంటికి వస్తున్నారు. రోజుల తరబడి సూర్యుని ముఖం చూడకుండా గడిపేస్తున్నవారు ఎందరో ఉన్నారు.
హైడ్రేషన్: నిద్రపోవడం వలన సుదీర్ఘ సమయం మనం నీటిని తాగకుండా ఉండిపోతాం. దాంతో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అప్పుడు శరీరానికి కావలసిన నీరు అందుతుంది. కానీ చాలా మంది… నిద్ర లేచిన వెంటనే పరగడుపుతో టీ, కాఫీలు తాగేస్తారు. ఎమ్టీ స్టమక్ తో టీ, కాఫీలు తాగడం మానుకోవాలి.
వ్యాయామం: ఉదయాన్నే చేసే వ్యాయామం శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. కనీసం 15 నుండి 20 నిమిషాలు… యోగా, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసేందుకు కేటాయించండి. వ్యాయామం, యోగా రక్తప్రసరణ మెరుగు పరిచి తక్షణ శక్తిని ఇస్తాయి. శరీరం తేలికగా మారి, పనిలో చురుకుగా ఉండేందుకు వ్యాయామం దోహదం చేస్తుంది.
వ్యాయామానికి శరీరం సహకరించనివారు ధ్యానం చేయండి. కనీసం 5-10 నిమిషాలు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇక ఆ రోజు పూర్తి చేయాల్సిన పనులు ఒక డైరీలో రాసుకోవడం వలన స్పష్టత వస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయవచ్చు.
పోషకాహారం: ఉదయం తీసుకునే ఆహారం రోజంతటికి కావలసిన ఇంధనాన్ని అందిస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు, తాజా పండ్లు ఉన్న అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల రోజంతా ఏకాగ్రత, ఉత్సాహం నిలిచి ఉంటాయి. ఇడ్లీ, దోస, పూరి, బోండా వంటి ఫుడ్ ఐటెమ్స్ కి స్వస్తి చెప్పండి.
ఈ చిన్న సానుకూల అలవాట్లను ప్రతిరోజూ పాటించడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోజువారీ పనితీరులో గొప్ప మార్పు వస్తుంది. పైన చెప్పిన అంశాలు అన్నీ ఒకేసారి ఆచరణలో పెట్టకుండా… ఒక్కో మార్పుతో ముందుకు వెళ్ళండి. ముందుగా త్వరగా పడుకోవడం, ఉదయాన్నే లేవడం అలవరుచుకోండి. ఇది అన్నింటికంటే ముఖ్యం.
