ఈ మూడు సూత్రాలు పాటిస్తే… మీ లైఫ్ బిందాస్!

ఆరోగ్యమే మహాభాగ్యం. కోట్ల ఆస్తి ఉన్నా ఒక స్వీటు తినే ప్రాప్తం లేనివాళ్లు ఎందరో. ప్రపంచాన్ని చుట్టేసే స్తోమత ఉన్నా అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థితి. 30-40 ఏళ్లకే ఈ తరం యువత బీపీ, షుగర్, గుండె సంబంధింత రుగ్మతలతో బాధపడుతున్నారు. దీనంతటికి కారణం మన లైఫ్ స్టైల్.

పాశ్చాత్య ఆహారపు అలవాట్లు, మారిన వర్క్ కండిషన్స్, గాడ్జెట్స్ ని అధికంగా ఉపయోగించడం, దురలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి ముఖ్య కారణాలు… ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ఈ తరం 25 ఏళ్ల యువకుల కంటే 80 ఏళ్ల వృద్ధులు శారీరకంగా దృఢంగా , చురుకుగా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. వానలో తడిస్తే జ్వరం… నడిస్తే నొప్పులు… ఇవి ఈ జనరేషన్ కష్టాలు. రోగాలతో జీవించడం అత్యంత దుర్భరం.

అనేక ఆరోగ్య సమస్యలకు మన లైఫ్ స్టైల్ కారణం. చెప్పాలంటే స్వయంకృపరాధం. ఇప్పటికైనా యువత కళ్ళు తెరిచి.. మూడు సూత్రాలు పాటిస్తే ఆరోగ్యకర జీవనం మీ సొంతం అవుతుంది. అవేమిటో చూద్దాం..

హెల్తీ లైఫ్ స్టైల్

ఆహారం: మన దేశంలో 56% పైగా రోగాలు ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) సంస్థల నివేదికలు తేల్చాయి. ఇన్స్టాంట్ జంక్ ఫుడ్ కి అలవాటు పడిన జనాలు… ప్రతిరోజూ అనారోగ్యపూరిత ఆహారం తీసుకుంటున్నారు. బజార్లో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ ని అవైడ్ చేయండి. ఇంట్లో తయారు చేసిన శుభ్రమైన, తాజా ఆహారం తీసుకోండి. మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, చేపలు, మాంసం చేర్చుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి.

బాడీ కేర్: నిద్ర మనిషికి చాలా అవసరం. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సరిపడా నిద్రపోవాలి. రోజుకు కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యకరం. అలాగే నీళ్లు తరచుగా తాగండి. దాహం వేసే వరకు నీరు త్రాగకుండా ఉండకూడదు.

చెడు అలవాట్లు: చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. టొబాకో వినియోగాన్ని పూర్తిగా వదిలేయండి. అలాగే ప్రతి దినం అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

యాక్టీవ్ లైఫ్ స్టైల్

వ్యాయామం: రోజూ వ్యాయామం చేయండి. రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి ఎక్సర్సైజ్లు శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి. శరీరం తేలికగా మారి పనిలో ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. కనీసం కొన్ని నిమిషాలు వాకింగ్ చేయండి.

క్రీడలు ఆడండి: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర పటుత్వానికి దోహదం చేస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో అవుట్ డోర్ గేమ్స్ ఆడటం ఉత్తమం. మీకు ఇష్టమైన క్రీడను ఆడటం అలవాటుగా మార్చుకోండి.

ఫిజికల్ టాస్క్స్: గంటల తరబడి కూర్చొని పని చేయడం ప్రమాదకరం. ఇది ఊబకాయంతో పాటు అనేక రుగ్మతలకు కారణం అవుతుంది. తరచుగా లేవడం, అటూ ఇటూ తిరగడం చేయండి.

సెడెంటరీ లైఫ్ స్టైల్

స్క్రీన్ టైం: నేటి తరాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రమైన సమస్య స్క్రీన్ టైం. మొబైల్, కంప్యూటర్ లేకుండా జీవితాన్ని ఊహించలేని స్థితిలో మనం ఉన్నాము. పనిలో లాప్టాప్ స్క్రీన్ ని గంటల తరబడి చూడాల్సి వస్తుంది. ఇక ఖాళీ సమయంలో మొబైల్ లో తల పెట్టేస్తాం. రోజంతా మొబైల్, కంప్యూటర్, టీవీ స్క్రీన్స్ ని చూడటం సరైనది కాదు. వీలైనంత వరకు స్క్రీన్ టైం ని తగ్గించుకోండి.

లో మూమెంట్: పనిలో కానీ ఇంట్లో కానీ సుదీర్ఘ సమయం పాటు కూర్చొని ఉండిపోకండి. శరీరానికి కదలికలు అవసరం. అలాగే వ్యాయామం చేయండి. వ్యాయామం శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

పైన చర్చించిన విధంగా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే… ఆరోగ్యకర జీవనం మీ సొంతం అవుతుంది. జీవితంలో ఏది సాధించాలన్న ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఇకనైనా అన్ హెల్తీ లైఫ్ స్టైల్ కి గుడ్ బై చెప్పండి.

Leave a Comment