వయసుకొచ్చిన ఆడపిల్లకు తల్లి తప్పక నేర్పాల్సిన విషయాలు!

ఆడపిల్లలు వయసుకొచ్చారంటే తల్లిదండ్రుల్లో ఎక్కడ లేని టెన్షన్. వాళ్ళ కెరీర్, డెవలప్మెంట్, భద్రత గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు. నేటి సమాజంలో ఆడపిల్లను పెంచడం అంత సులువు కాదు. కేవలం… ఉన్నత విద్య, మంచి ప్రవర్తన మాత్రమే సరిపోవు. సమాజంలోని పోకడలు, సవాళ్ళను ఎదుర్కొనేలా సిద్ధం చేయాలి. అందుకు వయసుకు వచ్చిన అమ్మాయిలతో కొన్ని విషయాలు అమ్మలు చర్చించాలి.

ఆడ పిల్లల్లో ధైర్యం, ఆత్మస్తైర్యం నింపాల్సి ఉంటుంది. అడిగినవన్నీ ఇవ్వడం, అవసరాలు సమకూర్చడంతో మన బాధ్యత పూర్తి అయ్యింది అనుకుంటే పొరపాటే. ఆడపిల్లలు సిగ్గుతోనో, భయంతోనో తమ సమస్యలను దాచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తల్లులు అర్థం చేసుకొని చొరవ తీసుకోవాలి.  ఆడపిల్లలకు తల్లులు ఇవ్వాల్సిన అసలైన ఆస్తులు ఏమిటో ఈ టాపిక్ లో తెలుసుకుందాం..

సెల్ఫ్ కాన్ఫిడెన్స్: టీనేజ్ వయసులోనే ఆడపిల్లల్లో మనోధైర్యం నింపాలి. సమస్యలకు భయపడకుండా ఎదుర్కొనే తెగువ నేర్పాలి. ఒకరి మీద ఆధారపడటం, తన ఇబ్బందులను వేరొకరు తీరుస్తారులే… అనే, ఆధారపడే తత్వాన్ని దూరం చేయాలి. అందుకు అనుగుణంగా ఆత్మవిశ్వాసం పెంపొందించాలి. నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోగలవు అని ప్రోత్సహించాలి.

సెల్ఫ్ డిఫెన్స్: ఆడపిల్లకు అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది. సమాజంలో పోకిరీలకు, నేరగాళ్లకు కొదవే లేదు. కాబట్టి ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో శిక్షణ ఇప్పించండి. అలాగే ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియజేయండి. సహాయం కోసం పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చిన హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి అవగాహన కల్పించండి.

ఆర్థిక క్రమశిక్షణ: మనీ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే టీనేజ్ నుండే డబ్బును పొదుపుగా ఖర్చు చేయడం నేర్పించండి. టీనేజ్ లో తోటి స్టూడెంట్స్ ఆడంబరాలు, లైఫ్ స్టైల్ చూసి… పిల్లలు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది. స్తోమత లేకున్నా తమకు కూడా లగ్జరీస్ కావాలని కోరుకుంటారు. అలాంటి ఆలోచనా ధోరణిని నుండి బయటపడేయండి. అవసరాలకు మాత్రమే డబ్బు ఖర్చు చేయాలని, భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేయడం ఆవశ్యకం అని తెలియజేయండి.

శారీరక మార్పులు, రుతుక్రమం: వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులు, రుతుక్రమం వంటి విషయాలను అర్థం అయ్యేలా చెప్పండి. రుతుక్రమం సహజ  ప్రక్రియ, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇవ్వండి. ఇక రుతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శుభ్రత, ఆరోగ్య సంరక్షణ గురించి వివరించండి.

రిలేషన్షిప్స్: టీనేజ్ లో రిలేషన్షిప్స్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు మంచి చెడులను గుర్తించే అనుభవం ఉండదు. గుడ్ రిలేషన్, బ్యాడ్ రిలేషన్ మధ్య వ్యత్యాసం తెలియజేయాలి. పరస్పర అవగాహన, నమ్మకం, గౌరవం కలిగిన వ్యక్తులతోనే స్నేహం మంచిదని చెప్పాలి. ఇక రిలేషన్స్ లో బౌండరీలు నిర్దేశించుకోవడం నేర్పాలి.

కెరీర్ & గోల్స్: తమ లక్ష్యాలను స్వయంగా నిర్దేశించుకునే స్వేచ్ఛను ఇవ్వండి. విద్య, లక్ష్యాల ఎంపిక విషయంలో ఒత్తిడి చేయడం సరికాదు. తాము ఎంచుకున్న రంగంలో ఎదిగేందుకు ప్రోత్సహించండి. ఒత్తిడి, మానసిక ఆందోళన కలిగితే వెంటనే తల్లిదండ్రులతో పంచుకోవడం నేర్పించండి.

నో మీన్స్ నో: తమకు ఇష్టం లేని విషయాన్ని బలంగా వ్యతిరేకించేలా చెప్పండి. మొహమాటానికో, భయపడో అయిష్టంగా ముందుకు వెళ్లరాదని చెప్పండి. మూఢ నమ్మకాలు నమ్మడం, భయాందోళనకు గురికావద్దని అర్థం అయ్యేలా వివరించండి.

Leave a Comment