జెన్ జీకి డబ్బు కాదు… అదే ముఖ్యం!

జెన్ జీ ఆలోచనా విధానం, పద్ధతులు, విధానాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. కొన్నాళ్లుగా జెన్ జీ ప్రపంచాన్ని ఊపేస్తున్న పదం. ఈ జనరేషన్ యువతపై విపరీతంగా చర్చ జరుగుతుంది. 1997-2012 మధ్య జన్మించిన యువతను జెన్ జీగా అభివర్ణిస్తున్నారు. వీరు స్మార్ట్ ఫోన్స్, హైస్పీడ్ ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో పుట్టారు. వాటి ప్రభావం జెన్ జీపై విపరీతంగా ఉంది. వైవిధ్యమైన ఆలోచన ధోరణితో వీరు ప్రసిద్ధి చెందారు.

జెన్ జీ సామాజిక మార్పు కోరుకుంటున్నారు. వీరు మెంటల్ హెల్త్, ఇండిపెండెన్స్, విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరి ముందు జనరేషన్ మిలీనియల్స్ లేక జెన్ ఎక్స్ తో పోల్చుకుంటే చైతన్యవంతులుగా ఉన్నారు. సామాజిక సర్వేలలో తేలిన మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే జెన్ జీ డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జెన్ ఎక్స్ తో పోల్చుకుంటే ఇది చాలా విరుద్ధమైన స్వభావం అని చెప్పొచ్చు.

శాలరీ కాదు మానసిక ప్రశాంత కావాలి 

బహుళజాతి సంస్థలు ఇండియాలోకి అడుగుపెట్టాక కెరీర్ అంటే ఉద్యోగం, అధిక శాలరీ, ప్రమోషన్స్ ని హోదాగా చూడటం అలవాటైంది. మనం సంపాదించే శాలరీ బంధుమిత్రుల్లో గౌరవం తెచ్చిపెడుతుంది. అందుకే మిలీనియల్స్ శ్రమను పట్టించుకోకుండా వీలైనంత ఎక్కువ శాలరీతో కూడిన జాబ్ సంపాదించేందుకు ప్రయత్నించేవారు.

కాగా జెన్ జీ ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. జెన్ జీ అధిక శాలరీ కంటే మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలని, స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. వీటిని హరించే కార్పొరేట్ జాబ్స్ ని సైతం తృణ ప్రాయంగా వదిలేస్తున్నారు. ఏసీ గదుల్లో చేసే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి… మోడ్రన్ రైతులుగా, క్యాబ్ డ్రైవర్స్ గా, పానీపూరి బండి ఓనర్స్ గా మారుతున్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ లో స్వేచ్ఛ, ప్రశాంతత ఉంటుందని భావిస్తున్నారు.

వర్క్- లైఫ్ బ్యాలన్స్

కార్పొరేట్ కంపెనీలో రోజుకు 12 నుండి 14 గంటలు పని చేసి లక్షల్లో శాలరీలు తీసుకోవడాన్నీ జెన్ జీ తిరస్కరిస్తున్నారు. జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే… ఉద్యోగమే జీవితం కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గంటల తరబడి పని చేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకోలేం అంటున్నారు. అధిక వేతనం జెన్ జీని ఏమాత్రం ఆకర్షించడం లేదు. తాము చేసే ఉద్యోగం… ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అంటే దాన్ని వదులుకోవడానికి వెనకాడటం లేదు. ఒత్తిడితో కూడిన హై పేయిడ్ జాబ్స్ వదిలేసి… ప్రశాంతతను ఇచ్చే ఉద్యోగాలను వెతుక్కుంటున్నారు.

పని వేళలు-వర్క్ లిమిట్స్ 

వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్స్ కి జెన్ జీ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాకపోయినప్పటికీ పని వేళలు ప్లెక్సిబుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఓవర్ నైట్ డ్యూటీ చేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారు. అలాగే వృత్తికి సరిహద్దులు నిర్ణయిస్తున్నారు. వీకెండ్స్ లో సైతం వృత్తి సంబంధిత కాల్స్ అటెండ్ కావడం, మెయిల్స్ కి రిప్లై ఇవ్వడం మా వల్ల కాదంటున్నారు. జాబ్, జాబ్ హౌర్స్… తమ వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టకూడదని స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించుకున్నారు. జెన్ జీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఈ విధానం తోడ్పడుతుందని నిపుణుల అంచనా.

మానసిక ఆరోగ్యం 

ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు. ఉన్న ఈ ఒక్క జీవితం ఒత్తిడితో వృధా చేసుకోలేం అంటున్నారు. శాలరీ, జాబ్ టైటిల్ కంటే వారు మానసిక ప్రశాంతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత శాలరీ చెల్లించినా… మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఉద్యోగాలు చేయమని స్పష్టమైన సందేశం పంపుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ కి దారి తీసే పనిభారంతో కూడిన జాబ్స్ ని వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. స్వచ్ఛంగా తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. అందుకు ప్రతిగా తక్కువ పనిభారం ఉన్న ఉద్యోగాలు లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ వైపు అడుగులు వేస్తున్నారు.

కార్పొరేట్ కంపెనీల స్పందన 

జెన్ జీ ఆలోచనా విధానం కార్పొరేట్ కంపనీలను సైతం కుదిపేస్తున్నాయి. వారి అభిరుచులకు అనుగుణంగా పాలసీలు మార్చే పనిలో ఉన్నాయి. కేవలం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం వలన జెన్ జీతో పని కాదని వారికి అవగతం అవుతుంది. అందుకే సరళతరమైన పని వేళలు, వర్క్ లో ఒత్తిడి తగ్గించడం ఎలా? ఎంప్లాయ్ మెంటల్ హెల్త్ వంటి అంశాల మీద దృష్టి సారించాయి. వెల్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన ఆఫీస్ వాతావరణం ఏర్పాటు చేస్తున్నాయి.

జెన్ జీతో కార్పొరేట్ కల్చర్ సైతం మారిపోయింది. కేవలం డబ్బు వెనుక పరుగెత్తకుండా… మానసిక ప్రశాంతతో కూడిన ఆనందకర జీవితం అవసరం అంటున్నారు.  అదే నిజమైన విజయం అని గుర్తిస్తున్నారు.

Leave a Comment