సండే ఇలా ప్లాన్ చేసుకుంటే… మీరే సూపర్ ఎంప్లాయ్!

ఆదివారం ఉద్యోగులకు ఓ గొప్ప ఉపశమనం. ఉద్యోగులు డెడ్ లైన్స్, సమావేశాలు, ప్రయాణాలతో విసిగిపోయి ఉంటారు. వారమంతా పని చేసిన ఎంప్లాయ్స్ ఆ ఒక్కరోజు విశ్రాంతి కోరుకుంటారు. అలాగే చాలా మంది ఆదివారం ప్రశాంతంగా పడుకోవాలి అనుకుంటారు. కొందరు అయ్యో ఆదివారం అప్పుడే అయిపోతుందే అనే ఆందోళనలో గడిపేస్తారు. అలాగే మళ్ళీ ఆరు రోజుల తర్వాత వచ్చే ఆదివారం గురించి ఆలోచిస్తారు. నిజానికి ఆదివారం ఇట్టే గడిచిపోయినట్లుగా ఉంటుంది. ఆ ఒక్కరోజులో కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి.

ఇక భార్య, పిల్లలు ఆదివారం రోజున ఆహ్లాదంగా గడపాలి అనుకుంటారు. ఇంటి పెద్దతో కలిసి సినిమాకు వెళ్లాలని, షాపింగ్స్ చేయాలని ఆశపడతారు. ఆదివారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. అప్పుడే ఉద్యోగి రీఛార్జ్ అవుతాడు. అలాగే కుటుంబ సభ్యులకు సమయం కేటాయించి వారిని సంతృప్తి పరుస్తాడు. వ్యక్తిగత పనులు పూర్తి చేస్తాడు. ఆదివారాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో కొన్ని చిట్కాలు ఈ వ్యాసంలో చూద్దాం..

శారీరక, మానసిక విశ్రాంతి 

డిజిటల్ డిటాక్స్: ఆదివారం రోజు వీలైనంత ఎక్కువ సమయం మొబైల్ కి దూరంగా ఉండండి. కాల్స్ చేయకండి. అలాగే మొబైల్ లో వీడియోలు చూడకండి. సోషల్ మీడియా పోస్ట్స్, రీల్స్ చూస్తూ సమయం వృధా చేయకండి. కాసేపు మొబైల్ చూసినప్పటికీ, అనంతరం పక్కన పెట్టేయండి. గంటల తరబడి మొబైల్ చూడటం వలన కళ్ళు, మెదడు అలసిపోతాయి. మీరు కోరుకున్న విశ్రాంతి లభించదు. అలాగే ఆఫీస్ మెయిల్స్, వర్క్ ఛాట్స్ ని వీలైనంత వరకు అవైడ్ చేయండి. ఆఫీస్ మెయిల్స్ రేపటి మీ పనిని గుర్తు చేస్తూ ఆందోళన పెంచేస్తాయి.

ప్రశాంతమైన నిద్ర: ప్రతిరోజూ ఉదయాన్నే లేవాలి. లేదంటే ఆఫీస్ కి ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆదివారం ఓ గంట అదనంగా పడుకోవడంలో తప్పులేదు. బయటకు వెళ్లే పనులు లేకపోతే మధ్యాహ్నం సైతం ఓ కునుకు వేయండి. నిద్ర శరీరానికి, మెదడుకు అవసరమైన విశ్రాంతిని ఇస్తుంది. రోజంతా పడుకున్నా హుషారు ఉండదు. ఆదివారం కాసేపు యోగా, వ్యాయామం చేయడం మంచిది. యోగ, వ్యాయామం మీకు మంచి నిద్ర కలిగేలా చేస్తాయి.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపండి 

కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపండి. ఆదివారంలో కచ్చితంగా కొన్ని గంటలు వారికి కేటాయించండి. వారమంతా మీరు పిల్లలకు అందుబాటులో ఉండరు. అలాగే భార్యను కూడా బయటకు తీసుకెళ్లే అవకాశం దక్కదు. కాబట్టి పిల్లలు, భార్యతో ముచ్చటించండి. ఇష్టమైన వంటకాలు ఇంట్లో చేయించుకోవడం లేదా బయట భోజనానికి వెళ్ళండి. సినిమాలు, షాపింగ్స్, ఔటింగ్స్ వంటివి ప్లాన్ చేయండి. కుటుంబ సభ్యుల మన్నలను పొందేందుకు ఇది దోహదం చేస్తుంది. మీ మీద గౌరవం, ప్రేమ పెరుగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్, ప్రాబ్లెమ్స్ తెలుసుకునే వీలుంటుంది.

మిత్రులను కలవండి. వారితో చిట్ చాట్ చేస్తూ మంచి కాఫీ ఆస్వాదించండి. మీ వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాలు పంచుకోండి. మిత్రులతో కలవడం వలన మనసులోని కొన్ని భారాలు తొలగిపోతాయి. జోక్స్ వేసుకొని హాయిగా నవ్వుకోండి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇది బెస్ట్ రెమిడీ.

వ్యక్తిగత హాబీలు, ఆసక్తులు 

ఉద్యోగ బాధ్యతల వలన మనకు ఇష్టమైన ఆసక్తులు, అభిరుచులు పక్కన పెట్టేస్తాం. ఆదివారం రోజు వాటిని గుర్తు చేసుకోండి. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి. గార్డెనింగ్, సంగీతం వినడం చేయండి. మీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడండి. కొత్త విషయాలు నేర్చుకోండి. హాబీలలో మునగడం మనసుకు ప్రశాంతతను చేకూర్చుతుంది.

ఇక ఇష్టమైన క్రీడలు ఆడటం వలన శరీరం, మనసు ఉత్తేజం అవుతాయి. క్రికెట్, షటిల్, టెన్నిస్ వంటి క్రీడలు మీ మిత్రులతో కలిసి ఆడండి. ఇలా చేయడం ద్వారా మీ సండేను గొప్పగా మలచుకోవచ్చు. రీఛార్జ్ కావచ్చు.

వ్యక్తిగత-కుటుంబ వ్యవహారాలు 

ఇంటికి పెద్ద మనమే అయితే… ప్రతి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. సమయం లేక అవన్నీ పెండింగ్ లో ఉండిపోతాయి. ఆదివారమే వీటికి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. వాయిదా వేస్తే పెండింగ్ లిస్ట్ పెరిగిపోతుంది. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఈ వ్యవహారాలకు టైం కేటాయించండి. కిరాణా సరుకు కొనడం, ఆర్థిక లావాదేవీలు, అందుకు సంబంధించిన వ్యక్తులను కలవడం వంటి పనులు నెరవేర్చండి. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతే ప్రశాంతత ఉండదు.

రాబోయే పనిదినాలకు ప్రణాళిక 

ఆదివారం ముగుస్తుంది అంటే ఉద్యోగుల్లో భయం మొదలైపోతుంది. దీన్ని మండే బ్లూస్ అంటారు. ఈ భయాన్ని అధిగమించాలి అంటే మనం ప్రణాళికాబద్దంగా  ఉంటే సరిపోతుంది. రాబోయే 6 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఆఫీస్ వర్క్ లిస్ట్ సిద్ధం చేసుకోండి. వాటిలో ముఖ్యమైనవి, అంతగా ప్రాధాన్యత లేనివిగా వర్గీకరించుకోండి. ముఖ్యమైన లక్ష్యాలు పూర్తి చేసేందుకు సిద్ధం అవ్వండి.

సోమవారం వేసుకోవాల్సిన డ్రెస్, తీసుకెళ్లాల్సిన ఫైల్స్ ముందు రాత్రే సేకరించి పెట్టుకోండి. హడావుడి లేకుండా ప్రశాంతంగా సోమవారం ఆఫీస్ కి వెళ్ళండి. ఈ చిట్కాలు మిమ్మల్ని పనిలో ఉత్సాహంగా మారుస్తాయి. పనితీరు మెరుగుపరుస్తాయి. మంచి ఉద్యోగిగా గుర్తింపు తెస్తాయి. కెరీర్లో ఎదిగేందుకు దోహదం చేస్తాయి.

 

 

Leave a Comment