ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఆహార నియమాలు పాటించడం లేదు. ఇంటి భోజనం తినే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. క్షణాల్లో నచ్చిన ఆహారం అందించే ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వందల కొద్దీ ఉన్న రెస్టారెంట్స్, హోటల్స్, ఫుడ్ కోర్ట్స్ అన్ని సమయాల్లో ఫుడ్ అందిస్తున్నాయి. బయట దొరికే ఆహారంలో ఎలాంటి నూనెలు వాడుతున్నారు? ఎంత పరిమాణంలో వాడుతున్నారు? అనే అంశంపై ఎలాంటి ప్రమాణాలు లేవు. ఆహారంలో నూనె వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ప్రజలకు సంక్రమిస్తున్న అనేక వ్యాధులకు నూనెలు కారణం అవుతున్నాయి.
మన ముందు తరాల వారు రుచికి బదులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆహారపు అలవాట్లను అనుసరించారు. తమ ఆహారంలో నూనె అధిక మోతాదులో లేకుండా చూసుకున్నారు. దానికి తోడు శారీరక శ్రమ కారణంగా వారు ఊబకాయం, గుండెపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలు అధిగమించారు. ఇక ఈ జనరేషన్ ఆస్వాదించే ప్రతి ఆహారంలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అది కూడా ప్రమాదకర స్థాయికి చేరింది. ఒక్కొక్క భారతీయుడు రోజుకు ఎంత మోతాదులో ఆయిల్ కన్స్యూమ్ చేస్తున్నాడో గణాంకాలు చెబుతున్నాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ మెడికల్ రీసెర్చ్(ICMR) అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) నివేదికలు, దేశంలో నూనె వినియోగం ఏ స్థాయిలో ఉందో తెలియజేశాయి. వారి నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయులు తమ వంటల్లో సన్ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్, నువ్వుల నూనె అధికంగా వాడుతున్నారు.

ఒక భారతీయుడు రోజుకు ఎంత నూనె వాడుతున్నాడు?
తాజా గణాంకాల ప్రకారం… సగటున ఒక భారతీయుడు ఏడాదికి 23.5 కిలీల నూనె వినియోగిస్తున్నాడు. దీనిని రోజువారీ లొక్కల్లోకి తర్జుమా చేస్తే… 60-65 గ్రాముల నూనె వివిధ ఆహార రూపాల్లో శరీరానికి అందిస్తున్నాడు. ఇది 12 నుండి 13 టీ స్పూన్స్ పరిమాణానికి సమానం. ఇక నెలకు ఒక వ్యక్తి 1.8 నుండి 2 లీటర్ల ఆయిల్ కన్స్యూమ్ చేస్తున్నాడని సమాచారం. ఇది సాధారణ మోతాదు కంటే చాలా అధికమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రధాన ఆహారం రూపంలో తీసుకునే నూనెతో పాటు సమోసా, చిప్స్, బేకరీ ఐటమ్స్ వంటి స్నాక్ ఫుడ్ రూపంలో మరింత నూనెను శరీరంలోకి పంపుతున్నారు. నిజానికి వైద్యులు సూచించే నూనె మోతాదు చాలా తక్కువగా ఉంది.
ఎంత నూనె వాడితే సురక్షితం?
2 వేల కేలరీల సాధారణ ఆహారం తీసుకునే ఓ వ్యక్తి ఎంత ఆయిల్ కన్స్యూమ్ చేయాలో ICMR, NIN మార్గదర్శకాలు ఇచ్చాయి. కేవలం ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి 20 నుండి 30 గ్రాముల నూనెను మాత్రమే వినియోగించాలి. ఇది సురక్షితమైన మోతాదు. అంటే రోజుకు 4 నుండి 6 టీస్పూన్స్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక నెలకు 500 మిల్లీ లీటర్స్ కి మించకూడదు. పైన చెప్పిన గణాంకాల ప్రకారం మనం సాధారణ వినియోగానికి రెట్టింపు వినియోగిస్తున్నాము.
అధిక నూనె వినియోగంతో అనారోగ్య సమస్యలు
పరిమితికి మించి నూనె ఆహారంలో తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. దీని వలన పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అవేమిటో చూద్దాం..
1. గుండె జబ్బులు: గుండె సంబంధిత రుగ్మతలకు ప్రధాన కారణాల్లో నూనె వినియోగం ఒకటిగా ఉంది. నూనె వినియోగం రక్త సరఫరా ప్రక్రియలో కీలకమైన ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి బీపీ, గుండెపోటుకు దారి తీయవచ్చు. అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకుపోవడానికి నూనె కారణం అవుతుంది.
2. అధిక బరువు: భారతదేశంలో 25 నుండి 30 శాతం ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. శారీక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, నూనె వినియోగం దీనికి కారణం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒక స్పూన్ నూనెలో దాదాపు 100 కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి ఒబెసిటీకి దారితీస్తున్నాయి.
టైప్ 2 మధుమేహం-ఫ్యాటీ లివర్: నూనె వినియోగం కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకత పెరగడం వలన టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
వంటల్లో నూనె వినియోగం తగ్గించడం ఎలా?
కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక నెలలో ఎంత నూనె వాడాలో ముందే నిర్ణయించుకోండి. ఉదాహరణకు… ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు 1.5 లీటర్ల నూనె కంటే ఎక్కువ వినియోగించకుండా నియమాలు విధించుకోండి.
సుదీర్ఘ కాలం ఒకే రకమైన నూనెను వాడటం సరికాదు. వేరుశనక, నువ్వులు, ఆవాల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్… మార్చిమార్చి వాడండి. లేదా అన్ని నూనెలు కలిపి వాడండి.
వేపుడు కూరలు, ఫ్రైలు తగ్గించండి. ఎక్కువగా ఉడికించిన ఆహారాలు తీసుకోండి. ఆవిరి చేసిన ఆహార పదార్దాలు, నిప్పులపై చేసే ఆహార పదార్దాలకు మారండి. ఈ విధంగా నూనె వినియోగం నియంత్రంలోకి తేవచ్చు.
ఒకసారి కాచిన, వంటకు వినియోగించిన నూనెను వాడకండి. ఒకే నూనెను పలుమార్లు ఉపయోగిస్తే అందులో క్యాన్సర్ కారకాలు తయారుకావచ్చు. బయట ఫుడ్ ని వీలైనంత వరకు అవైడ్ చేయండి.
