ప్రేమకథలకు వేదికలుగా ఆఫీసులు!

ఆఫీస్ వేదికగా ప్రేమలు చిగురిస్తున్నాయట. పనిలో పనిగా మనసులు ఇచ్చి పుచ్చుకుంటున్నారట. దీనికి సంబంధించిన తాజా లెక్కలు విస్తుపోయే నిజాలు వెల్లడిస్తున్నాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక జరిపిన సర్వే వివరాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆడ-మగ కలిసి పని చేయడం. విరామ సమయాల్లో మాటామంతి జరగడం ఇందుకు కారణం అవుతుంది. దీర్ఘకాలం కొనసాగుతున్న వృత్తిపరమైన ప్రయాణం… వ్యక్తిగత బంధానికి పునాది వేస్తుంది. వర్క్ కల్చర్ మారిపోయిన తరుణంలో పని ప్రదేశాలు ప్రేమకు దారి తీస్తున్నాయి.

ఫోర్బ్స్ వివరాల ప్రకారం 60 శాతానికి పైగా ఉద్యోగులు తమ లైఫ్ లో ఏదో ఒకసారి సహోద్యోగితో ప్రేమలో పడినట్లు ఒప్పుకున్నారు. ఇక వీరిలో 43 శాతం మంది తమ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చారు. కొందరు మాత్రం పెళ్లి కాకుండానే బ్రేకప్ అయ్యారు. ఈ లెక్కలు చూస్తే ఆఫీసులు మినీ మ్యాట్రిమోనీలుగా మారుతున్నాయి. ఆఫీసుల్లో ప్రేమలో సర్వసాధారణం అనే విషయం కూడా మనకు అర్థం అవుతుంది.

ప్రేమకథలు ఆఫీస్ ఎలా వేదిక అవుతుంది?

ఆఫీస్ లో  యువతీ యువకులు ప్రేమలో పడేందుకు పలు కారణాలు ఉన్నాయి. సర్వే వివరాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ”కంఫర్ట్ జోన్” అనే సర్వే సంస్థ ప్రకారం… ప్రతిరోజూ కలిసి పని చేయడం వలన ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం, ఇద్దరి మధ్య అవగాహన పెరగడం కారణం అంటున్నారు. 65% మంది ఉద్యోగులు కలిసి పని చేయడం వలనే ప్రేమలో పడినట్లు వెల్లడించారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే 61% మంది ఉద్యోగులు… వృత్తి కారణంగా బయట కొత్త వ్యక్తులను కలిసే సమయం వారికి దొరకడం లేదన్నారు.

ఒకే ఆఫీస్ లో పని చేయడం వలన ఆలోచనలు, ఆహారపు అలవాట్లు పంచుకోవడం. అలాగే కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత వివరాలు ఒకరితో మరొకరు చెప్పుకుంటున్నారు. బర్త్ డేస్ వంటి వేడుకలు కలిసి జరుపుకుంటున్నారు. ఈ పరిణామాలు ప్రేమలో పడేందుకు దోహదం చేస్తున్నాయనే భావన వ్యక్తీకరించారు. ఈ కారణాలతో తమ మధ్య త్వరగా అనుబంధం ఏర్పడుతుందని వెల్లడించారు.

బంధం బలపడుతుంది ఇలా!

పని ఒత్తిడి నేపథ్యంలో వీరి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడుతుంది. వర్క్ షేరింగ్ సైతం అలవాటుగా మారుతుంది. తమ జీవిత లక్ష్యాలు,కెరీర్ ప్లానింగ్స్ డిస్కస్ చేస్తున్న క్రమంలో అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. అతనితో లేదా ఆమెతో నా జీవితం బాగుంటుంది అనే నిర్ధారణకు వస్తున్నారు. ఇక కొలీగ్స్ మధ్య సోషల్ గ్యాధరింగ్స్ ఎటూ ఉంటాయి. విందులు, వినోదాల్లో కలిసి పాల్గొంటున్నారు. వీకెండ్స్ లో విహారాలు చేస్తున్నారు. మొత్తంగా ఉద్యోగుల మధ్య ఓ అందమైన బాండింగ్ కొనసాగుతుంది. ఇది ప్రేమకు పురిగొల్పుతుంది.

ఆఫీస్ లవ్ సైడ్ ఎఫెక్ట్స్ 

ఆఫీస్ లవ్ లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీరి బంధం సాఫీగా సాగుతున్నంత కాలం బాగానే ఉంటుంది. ఓ సర్వే ప్రకారం కొలీగ్స్ తో ప్రేమలో పడేందుకు కొందరు భయపడుతున్నారు. 17% ఉద్యోగులు ఈ భయాన్ని వ్యక్తీకరించారు. కొలీగ్ తో బ్రేకప్ అయితే వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కలిసి పని చేసే వారితో ప్రేమలో పడటం వలన వర్క్ లైఫ్ బ్యాలన్స్ తప్పిందని యాభై శాతానికి పైగా ఉద్యోగులు ఒప్పుకున్నారు. వ్యక్తిగత-ఉద్యోగ జీవితాన్ని బ్యాలన్స్ చేయడం కష్టం అంటున్నారు. ఇద్దరికీ ఒకేరోజు లీవ్ దొరకదు. వెకేషన్స్ ప్లాన్ చేయడం కష్టం అంటున్నారు. వర్క్ లైఫ్-పర్సనల్ లైఫ్ రెండు డిస్ట్రబ్ అయ్యాయని అంటున్నారు.

ఒకే చోట పని చేసే యువతీ యువకులు ప్రేమలో పడితే అది అసూయ, ఈర్ష్యకు దారి తీయవచ్చు. ఇతర ఉద్యోగులతో చనువుగా ఉండటం, మాట్లాడటం నచ్చకపోవచ్చు. దానికి తోడు ఆఫీస్ గాసిప్స్ వలన అనుమానాలు ఏర్పడవచ్చు. ఈ కారణంగా లవర్స్ మధ్య తరచుగా అభిప్రాయ బేధాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఆఫీస్ లో మొదలయ్యే చాలా ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లవు అంటున్నారు. ఇక బ్రేకప్ అయిన మాజీ లవర్స్ ఒకే ఆఫీస్ లో కలిసి పని చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.

ఆఫీస్ ప్రేమలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ చాలా మంది దంపతులు తమ భాగస్వామిని అక్కడే కలిసినట్టు చెబుతున్నారు. పని చేసే చోటే తమ పార్టనర్ ని కలిశామని, ప్రేమలో పడ్డామని, అది పెళ్ళికి దారి తీసింది అంటున్నారు. కులం, మతం, ప్రాంతం అనే బేధాలను ఛేదించి ఆఫీసులలో ప్రేమకథలు మొదలవుతున్నాయి.

Leave a Comment