రైల్ టికెట్ కొంటే ఇవి ఉచితం అని మీకు తెలుసా?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్ లో ఒకటి. దాదాపు 12 లక్షల ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. ఇక ఏడాదికి రైల్వేస్ లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 741 కోట్లు కాగా, రూ. 80 వేల కోట్ల ఆదాయం భారత ప్రభుత్వానికి సమకూరుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైల్వే నెట్వర్క్ విస్తరించి ఉంది. దేశం నలుమూలలకు ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చుతుంది. ఇతర రవాణా సాధనాలతో పోల్చితే రైలు ప్రయాణం సురక్షితం. చవక, సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే పేద మధ్యతరగతి ప్రజలు… సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణం ఎంచుకుంటారు.

రైల్వే టికెట్ కొన్నవారికి అనేక ఉచితాలు ఉన్నాయి. వ్యాలిడ్ టికెట్ కలిగిన పాసెంజర్స్ కి ఇండియన్ రైల్వేస్ ఉచితంగా అందించే సౌకర్యాలు, సేవల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. తరచుగా రైలు ప్రయాణం చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవడం అత్యంత లాభదాయకం. రైల్వేస్ అందిస్తున్న ఉచిత సౌకర్యాలు ఏమిటో చూద్దాం..

స్టేషన్ లో వెయిటింగ్ రూమ్(Free waiting room ): సాధారణంగా రైళ్లు సకాలంలో స్టేషన్ కి చేరుకోవు. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైనా, లేదా మీరు నిర్ణీత సమయం కంటే ముందు వెళ్లినా… స్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ట్రైన్ స్టేషన్ కి వచ్చే వరకు విశ్రాంతి తీసుకునేందుకు వెయిటింగ్ హాల్స్ అందుబాటులో ఉంటాయి. వ్యాలిడ్ టికెట్ ఉన్న ప్రయాణికులు స్టేషన్ వెయిటింగ్ హాల్స్ లో సేదతీరవచ్చు. ఏసీ,స్లీపర్, జనరల్ వెయిటింగ్ హాల్స్ అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్ లో ఉంటాయి. మీ దగ్గర ఉన్న టికెట్ క్లాస్ ఆధారంగా ఏసీ లేదా నాన్ ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఉచిత వై ఫై సౌకర్యం(Free High Speed Wi-Fi): నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఒక్క క్షణం ఉండలేము. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడ ఉంది? ఏ ప్లాట్ ఫార్మ్ కి వస్తుంది? వంటి విషయాలు ఫోన్లోనే పలు యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే విరామ సమయంలో వినోదం కోసం ఇంటర్నెట్ సౌకర్యం చాలా అవసరం. డిజిటల్ ఇండియా చొరవతో రైల్వే శాఖ ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తుంది. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్ లో వై-ఫై సౌకర్యం అందుబాటులో ఉంది. మీ మొబైల్ లో నెట్వర్క్ ఉన్నా లేకున్నా… రైల్వే స్టేషన్లో చక్కగా ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందవచ్చు. ప్రయాణికులు తమ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. మొదటి 30 నిమిషాలు హై స్పీడ్ ఇంటర్నెట్ ని ఉచితంగా పొందవచ్చు.

 ప్రథమ చికిత్స/అత్యవసర వైద్య సహాయం(First Aid/Medical Aid): ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన, ప్రమాదం బారిన పడిన, చిన్నపాటి గాయాలైనా… భయపడాల్సిన పనిలేదు. ప్రతి రైలులో ప్రాథమిక చికిత్స కిట్ ఉంటుంది. మీరు టికెట్ ఎగ్జామినర్ లేదా గార్డ్ కి సమాచారం అందిస్తే ఉచితంగా ప్రథమ చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, రాబోయే స్టేషన్ లో మెడికల్ సర్వీస్ అందిస్తారు. దగ్గర్లో ఉన్న హాస్పిటల్ లో చికిత్స అందేలా చర్యలు తీసుకుంటారు.

ఉచిత బెడ్ రోల్(Bedroll Facilities): మీరు ఏసీ క్లాస్ లలో ప్రయాణిస్తే రైల్వే శాఖ ఉచితంగా బెడ్ రోల్ కిట్ ను  అందిస్తుంది. ఈ కిట్ లో రెండు బెడ్ షీట్స్, ఒక దిండు, దుప్పటి ఒక హ్యాండ్ టవల్ ఉంటాయి. రాత్రి వేళల్లో , చలికాలంలో ఈ బెడ్ రోల్స్ చాలా ఉపయోగకరం. మీ శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని అందించి, హాయిగా నిద్రపోయేందుకు సహకరిస్తాయి. అయితే గరీబ్ రథ్ వంటి రైళ్లలో మాత్రం బెడ్ రోల్ కొరకు స్వల్పంగా ఛార్జ్ చేస్తారు. మిగతా రైళ్లలో ప్రయాణికులకు బెడ్ రోల్స్ ఉచితంగా అందిస్తారు.

ఉచిత భోజనం(Free Meal): రాజధాని, శతాబ్దితో పాటు మరికొన్ని ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు… నిర్ణీత సమయం కంటే 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయితే… రైల్వే శాఖ ఉచితంగా టిఫిన్, భోజనం లేదా కాఫీ/టీ వంటి ఆహార పానీయాలు అందిస్తుంది.

కాబట్టి మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాల మీద అవగాహన ఉంటే ప్రయాణించే రైలులో అలాగే స్టేషన్స్ లో పైన చెప్పిన ఉచిత సౌకర్యాలు పొందవచ్చు

Leave a Comment