టీనేజ్ లవ్ సైడ్ ఎఫెక్ట్స్! తప్పక తెలియాల్సిన నిజాలు!

ప్రేమకు వయసు లేదంటారు. అది ఎవరిపై? ఏ వయసులో? ఎందుకు కలుగుతుందో ? స్పష్టమైన కారణాలు ఉండవు. మంచి వ్యక్తులతో ప్రేమ స్ఫూర్తిని ఇస్తుంది. జీవితాన్ని అందంగా మారుస్తుంది. ప్రేమించిన వ్యక్తి కనిపిస్తే మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతాయి. ఆ వ్యక్తితో ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది.

ప్రపంచాన్ని మరిచిపోయేలా చేస్తుంది. పరిపక్వతతో కూడిన ప్రేమలో భద్రత ఉంటుంది.
అయితే టీనేజ్ లవ్ ఒకింత ప్రమాదంతో కూడుకుంది. మానసికంగా ఎదగని యువతీ-యువకుల ప్రేమ గమ్యం లేని ప్రయాణం వంటిది. ప్రేమలో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించలేక ఇబ్బందులపాలు కావచ్చు. అందుకే టీనేజ్ లవ్ పై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టీనేజ్ లవ్ కి దూరంగా ఉండటమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

టీనేజ్ లవ్ అంటే ఏమిటీ?

టీనేజ్ లవ్ 13 నుండి 19 ఏళ్ల వయసులో శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పు వలన ఏర్పడే బలమైన ఆకర్షణ. ఇది స్వచ్ఛమైన భావన అయినప్పటికీ నిజమైన ప్రేమ కాకపోవచ్చు. టీనేజ్ లవ్ ని ఆకర్షణగానే చూడాలి. ఎందుకంటే గుణగణాలకు మించి అందం ఆధారంగానే టీనేజ్ లవ్ పుట్టే ఆస్కారం ఉంది. భావోద్వేగాలు వేగంగా మార్పు చెందే వయసులో అందాన్ని, మాట తీరును చూసి ఆకర్షితులు అవుతారు.

జీవితంపై టీనేజ్ లవ్ ప్రభావం 

టీనేజ్ లవ్ లో ప్రతికూల ప్రభావాలతో పాటు సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సానుకూల అంశాలు ఏమిటో చూద్దాం..

భావోద్వేగ పరిపక్వత: టీనేజ్ లవ్ చిన్న వయసులోనే మానవ సంబంధాలు, బాధ్యతలు పంచుకోవడం నేర్పుతుంది అనే భావన ఉంది. ఇది భవిష్యత్ లో సామాజిక, కుటుంబ సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది.

ఆత్మవిశ్వాసం: సరైన వ్యక్తితో సాగే ప్రేమ ప్రయాణం… స్ఫూర్తిని ఇస్తుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చదువుల్లో, ఇతర రంగాల్లో మెరుగ్గా రాణించేందుకు దోహదం చేస్తుంది. తాము ప్రేమించిన వ్యక్తి మన్ననలు పొందేదుకు కష్టపడి, ఎంచుకున్న రంగంలో ముందు ఉండే ప్రయత్నం చేస్తారు.

ప్రతికూల ప్రభావాలు

చదువుపై దృష్టి తగ్గడం: టీనేజ్ లో ప్రేమే సర్వస్వమ్ అన్నట్లు ఉంటుంది. ఎప్పుడూ వారి ఆలోచనల్లో బ్రతుకుతారు. అధిక సమయం వారితో గడిపేందుకు, మాట్లాడేందుకు ఇష్టపడతారు. టీనేజ్ లవ్ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా చదువుల్లో వెనకబడతారు. మంచి కెరీర్ నిర్మించుకోవడానికి వీలైన టీనేజ్ ని వృధా చేసుకుంటారు.

మానసిక ఒత్తిడి: టీనేజర్స్ కి భావోద్వేగాలను నియంత్రించుకునే పరిపక్వత, సామర్ధ్యాలు ఉండవు. ఈ వయసులో బ్రేకప్ అయితే పూర్తిగా డిప్రెషన్ లోకి జారుకునే ప్రమాదం ఉంది. ప్రేమించిన వ్యక్తితో గొడవలు, అభిప్రాయ బేధాలను సరిగా డీల్ చేయలేరు. దీని వలన టీనేజర్స్ జీవితాన్ని కూడా కోల్పోయే ఆస్కారం లేకపోలేదు.

తల్లిదండ్రులకు దూరం: టీనేజ్ లో పేరెంట్స్ కేరింగ్, గైడెన్స్ చాలా అవసరం. టీనేజ్ లో ప్రేమలో పడితే తల్లిదండ్రులను దూరం పెడతారు. వారితో సామరస్యంగా మెలగరు. వారికి టైం కేటాయించరు. ఈ క్రమంలో పేరెంట్స్ గైడెన్స్ కోల్పోతారు. అలాగే కుటుంబ సభ్యులకు చిన్న వయసులోనే దూరం అవుతారు. ఇక టీనేజ్ లవర్స్ తరచుగా పేరెంట్స్ కి అబద్ధాలు చెప్పడం మనం చూడొచ్చు.

టీనేజ్ లవ్- జాగ్రత్తలు

ప్రేమ? ఆకర్షణ?: ఒకరిపై మనకు కలిగిన ఫీలింగ్… ప్రేమ లేక ఆకర్షణ? అనే విషయాన్ని తెలుసుకోండి. ఒక నిర్ణయానికి వచ్చే ముందు సమయం తీసుకోవాలి. ప్రేమ శాశ్వతం… ఆకర్షణ తాత్కాలికం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సుదీర్ఘ ప్రయాణంతో మాత్రమే ఈ విషయాల మీద అవగాహన వస్తుంది.

కెరీర్ కి ప్రాధాన్యత: భవిష్యత్ కి పునాది టీనేజ్ లో మాత్రమే పడుతుంది. ఇది అత్యంత విలువైన సమయం. కాబట్టి టీనేజ్ లో ప్రేమకు మించి చదువుకు, కెరీర్ ప్లానింగ్ కి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితంలో స్థిరపడితే మీకు నచ్చిన, మెచ్చిన… మంచి గుణాలున్న వ్యక్తి దొరుకుతుందని గ్రహించండి. ప్రేమలో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే… జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.

సెట్ బౌండరీస్: ప్రతి రిలేషన్ కి హద్దులు ఉంటాయి. మన భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయి. కాబట్టి నచ్చిన వ్యక్తులతో సాగే బంధంలో జాగ్రత్తగా ఉండండి.

పేరెంట్స్ లేదా పెద్దలకు చెప్పండి: టీనేజ్ లో వ్యక్తులను, సంఘటలను అంచనా వేసే సామర్థ్యం, పరిపక్వత ఉండవు. స్కూల్ మేట్స్, క్లాస్ మేట్స్, కొత్తగా పరిచయమైన వ్యక్తుల గురించి పేరెంట్స్ కి లేదా ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పండి. అలాగే ప్రేమ, ఆకర్షణ వలన ఎదురైన మానసిక ఒత్తిడిని వారితో పంచుకోండి. పేరెంట్స్ సరిగా మనల్ని గైడ్ చేస్తారు. ఇబ్బందుల నుండి బయటపడేస్తారు.

సోషల్ మీడియా: టీనేజ్ లవ్ కి సోషల్ మీడియా అడ్డాగా మారింది. సులభంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఫోటోలు, వీడియోలు, మాయమాటలతో వారు చేసే మోసాల బారిన పడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా పరిచయాలు విషయంలో టీనేజర్స్ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

కాబట్టి యువత టీనేజ్ లవ్ కి దూరంగా ఉండటమే ఉత్తమం. చదువుకొని భవిష్యత్ కి బాటలు వేసుకోవాల్సిన సమయంలో… లవ్ పక్కదారి పట్టిస్తుంది. అనేక సమస్యలకు కారణం అవుతుంది. తల్లిదండ్రులు సైతం పిల్లల స్నేహాలు, పరిచయాలను గమనిస్తూ ఉండాలి. పిల్లల ప్రవర్తనలో తెలియని మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించాలి.

 

Leave a Comment