ప్రతి ఇంట్లోకి ఫ్రిజ్ వచ్చేసింది. లోయర్ మిడిల్ క్లాస్ సైతం తమ స్తోమతకు తగ్గ ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే ఫ్రిజ్ ని ఎలా వాడాలో తెలిసింది కొందరికే. చాలా మందికి అవగాహన ఉండదు. ప్రతి ఆహార పదార్థం, కూరగాయలు, పండ్లు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తుంటారు. అలా చేయడం సరికాదు. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఫ్రిజ్ లో పెట్టరాదు. అలా చేయడం వలన అవి తమ పోషకాలు, రుచి కోల్పోతాయి. అలాగే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి.
కాబట్టి ఎలాంటి పదార్థాలు ఫ్రిజ్ లో స్టోర్ చేయాలో కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే ఫ్రిజ్ ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు అర్థం. కొన్ని రకాల ఆహార పదార్థాలకు చల్లదనం సరిపడదు. మరి ఫ్రిజ్ లో ఏ ఆహార పదార్థాలు స్టోర్ చేయాలి? ఏవి స్టోర్ చేయకూడదు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఫ్రిజ్ లో ఉంచకూడని పదార్థాలు
టమాటో: టమాటాల్లో ఉండే ఎమ్జైమ్ లను కూల్ టెంపరేచర్ దెబ్బతీస్తుంది. దాంతో అవి మెత్తబడి రుచి మారిపోతుంది. టమాటోలను ఫ్రిజ్ లో పెట్టరాదు. వీటిని ఫ్రిజ్ బయట సాధారణ ఉష్టోగ్రత వద్దే భద్రపరచుకోవాలి. ఎక్కువ మోతాదులో ఒకేసారి తెచ్చుకోకుండా… అప్పటికప్పుడు మార్కెట్ నుండి తాజాగా టమాటోలు తీసుకురండి.
బంగాళాదుంపలు: చల్లని ఉష్టోగ్రత బంగాళాదుంపల్లో ఉండే పిండి పదార్థాన్ని వేగంగా చక్కెరగా మారుస్తుంది. ఈ కారణంగా బంగాళాదుంపలు ఉడికించే సమయంలో ఒకరకమైన తీపి రుచిని సంతరించుకుంటాయి. బంగాళాదుంపలను ఫ్రిజ్ లో కాకుండా చీకటిగా ఉండి గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి.
ఉల్లిపాయలు-వెల్లుల్లి: ఫ్రిజ్ లో ఉండే తేమ వలన ఉల్లిపాయలు మెత్తబడి బూజు పడతాయి. ఇక వెల్లుల్లి మొలకెత్తే అవకాశం ఉంది. వీటిని పొడిగా ఉండే ప్రదేశాల్లో దాచుకోవాలి.
తేనె: తేనెను ఫ్రిజ్ లో స్టోర్ చేయడం వలన గడ్డకట్టి గట్టిగా మారిపోతుంది. తేనెను ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి. ఏళ్ల తరబడి తేనె నిల్వ ఉంటుంది. తేనెను వేడి కూడా చేయకూడదు.
అరటిపండ్లు: పచ్చిగా ఉన్న దశలో అరటి పండ్లను ఫ్రిజ్ లో ఉంచితే అవి పండవు. పైన తోలు మాత్రం నల్లబడి లోపలి గుజ్జు పాడవుతుంది. కాబట్టి పండ్లలో అరటిని ఫ్రిజ్ బయటే ఉంచాలి.
బ్రెడ్: చల్లదనం బ్రెడ్ ని పొడిగా చేస్తుంది. 2-3 రోజుల్లో తినే బ్రెడ్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేయకపోవడమే మంచిది.
ఫ్రిజ్ లో తప్పక ఉంచాల్సిన పదార్థాలు
బ్యాక్టీరియా చేరకుండా ఆహారం సురక్షితంగా ఎక్కువ రోజులు ఉండాలంటే కొన్నింటిని తప్పక ఫ్రిజ్ సహాయంతో రిఫ్రిజిరేట్ చేయాలి. అవేమిటో చూద్దాం
పాలు & పాలపదార్థాలు: పాలు, పెరుగు, వెన్న, చీజ్, పన్నీర్ బయట వాతావరణంలో త్వరగా పాడైపోతాయి. అందుకే వీటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.
మాంసం: పచ్చి మాంసం, చేపలు పాడవకుండా ఉండాలంటే తప్పని సరిగా ఫ్రిజ్ దిగువ అరలో భద్రపరచాలి. ఎక్కువ రోజులు మాంసాన్ని ఫ్రిజ్ లోని చల్లదనం తాజాగా ఉంచుతుంది.
మిగిలిపోయిన వంటకాలు: కూరలు, అన్నం వంటి పదార్థాలు ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి. అయితే వేడిగా ఉన్న స్థితిలో లోపల పెట్టకూడదు. చల్లారాక ఫ్రిజ్ లో ఉంచాలి.
ఆకుకూరలు అండ్ ఫ్రూట్స్: పాలకూర, బెర్రీలు, క్యారెట్స్, పుట్టగొడుగులు ఫ్రిజ్ లో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఓపెన్ చేసిన సాస్ లు: మయోనైజ్, జామ్ లు, సాస్ ల మూత తీసిన తర్వాత ఫ్రిజ్ లోనే ఉంచాలి.
ఫ్రిజ్ ఇలా సర్దుకోండి
పైన ఉండే అరలు: ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కాబట్టి మిగిలిపోయిన ఆహారం, జ్యూస్, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాలను ఉంచాలి.
మధ్య అరలు: పాలు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ఇక్కడ ఉంచాలి.
క్రింది అర: ఇది అత్యంత చల్లని భాగం. కవర్లలో గట్టిగా చుట్టిన పచ్చిన మాంసం, చేపలను ఇక్కడ ఉంచాలి.
క్రిస్పర్ డ్రాయర్లు: ఇవి తేమను నియంత్రిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు ఇక్కడ భద్రపరచాలి.
ఫ్రిజ్ డోర్: ఇది ఫ్రిజ్ లోనే కొద్దిగా వేడిగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ పాలు పెట్టకూడదు. కేవలం సాస్ లు, వాటర్ బాటిళ్లు, మసాలా దినుసులు మాత్రమే ఉంచాలి.
ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయడం ద్వారా వృధా కాకుండా చూడవచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
