ఎమోషనల్ డీటాక్స్… ఆ బాధకు ఏకైక మార్గం!

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళన, బాధ, నిరాశ, నిస్పృహ వంటి భావోద్వేగాలు వేధిస్తున్నాయి. ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ప్రేమ, స్నేహాలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు మనసులో మలినాలు పేరుకుపోయేలా చేస్తున్నాయి. మనసులో ఆలోచనలు భారంగా మారితే ప్రశాంతత దెబ్బతింటుంది. మానసిక సమస్యలకు పరిష్కారంగా ఎమోషనల్ డీటాక్స్ సహకరిస్తుంది. అసలు ఎమోషనల్ డీటాక్స్ అంటే ఏమిటీ? మానసిక ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం…

ఎమోషనల్ డీటాక్స్ అంటే ఏమిటీ?

శరీరానికి  విశ్రాంతి అవసరమైనట్లే మనసుకు సైతం విశ్రాంతి అవసరం. మనసులో ఎవరికీ చెప్పుకోలేక పేరుకుపోయిన బాధ, ఆవేశం, నిరాశ, నిస్పృహ, అపరాధ భావన వంటి భావోద్వేగాలను ఆరోగ్యకరమైన పద్ధతిలో బయటకు పంపడమే ఎమోషనల్ డీటాక్స్. అలా అని మనసులోని ప్రతికూల భావాలను బలవంతంగా అణచివేయడం కాదు. మన భావోద్వేగాలను అర్థం చేసుకుని, మనసుపై వాటి భారం తగ్గించుకోవడం. మానసిక రుగ్మతల బారిన పడకుండా, ఒత్తిడి, ఆందోళన, నిస్పృహలను అధిగమించే మార్గం.

ఎమోషనల్ డీటాక్స్ ఎందుకు అవసరం?

ఎప్పుడో గతంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచించడం, ఇతరులతో పోల్చుకోవడం, చిన్న విషయాలకే బాధపడటం, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవటం లాంటి విషయాలు మానసిక అలసటకు దారి తీయవచ్చు. కొందరిలో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, ఉత్సాహకరంగా లేకపోవడం వంటి ,మానసిక సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలకు ఎమోషనల్ డీటాక్స్ మంచి పరిష్కారం. ఎమోషనల్ డీటాక్స్ చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.

ఎమోషనల్ డీటాక్స్-7 మార్గాలు 

1. మీ భావాలు గుర్తించండి: మీకు బాధగా ఉన్నప్పుడు ఆ బాధను మనసులో అణచుకోకండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమోషన్ కి కారణం ఏమిటో తెలుసుకోండి. కోపం, అసూయ, భయం, ఈర్ష్య వంటి నెగటివ్ ఎమోషన్స్ మనుషుల్లో సర్వసాధారణం. వీటి తీవ్రత అధికమైతే ప్రమాదం. అందుకే మీ భావాల పట్ల స్పష్టమైన అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి.

2. మనసులోని మాటలు రాసుకోండి: ప్రతిరోజూ మీ మనసులో కలిగే భావోద్వేగాలను ఒక డైరీలో రాసుకోండి. ఒకవేళ ఒక విషయం లేదా వ్యక్తి మిమ్మల్ని బాధిస్తే… అందుకు కారణం ఏమిటీ? మీరు ఎలా స్పందించారు? ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాసుకోండి. ఇలా చేయడం వలన మీ భావోద్వేగాల పట్ల మీకు స్పష్టత వస్తుంది.

3.ప్రతికూల సంబంధాలకు హద్దులు పెట్టుకోండి: ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకపోతే ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. మొహమాటానికి ఇష్టం లేని పని చేయకండి. అలాగే మీ మాటలకు, భావోద్వేగాలకు విలువ ఇవ్వని వ్యక్తులకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. వారితో బంధాల విషయంలో నిర్దిష్టమైన హద్దులు పెట్టుకోండి.

4.గతం వదిలి వర్తమానం వైపు అడుగులు వేయండి: గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లను మార్చలేం. గత అనుభవాలను పాఠాలు తీసుకోవాలి. భవిష్యత్ లో ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. గతాన్ని తలచుకుని బాధపడటం మానేయండి. మీ నియంత్రణలో ఉన్న విషయాల మీద దృష్టి పెట్టండి. ప్రస్తుత క్షణం, అలాగే భవిష్యత్ ప్రణాళికల మీద ఫోకస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

5.సోషల్ మీడియాకు విరామం ఇవ్వండి: ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మనకు అలాంటి జీవితం లేదన్న బాధ వేధిస్తుంది. సోషల్ మీడియాకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. మొబైల్ ని అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించండి. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని తెలుసుకోండి.

6.శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి: రోజూ నడక, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే మీకు ఇష్టమైన సంగీతం వినడం, ప్రకృతిలో గడపడం, ధ్యానం, యోగా చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లకు మారండి. ఈ విషయాలకు రోజులో కొంత సమయం కేటాయించండి.

7.నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి: మీ బాధను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. మీకు నమ్మకమైన వ్యక్తులతో భావోద్వేగాలు పంచుకోండి. ఓదార్చే కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు, స్నేహితుల సాయం తీసుకోండి. సమస్య మరింత తీవ్రంగా ఉంటే మానసిక వైద్యులను సంప్రదించండి.

ఎమోషనల్ డీటాక్స్ అనేది ఒక్క రోజులో పూర్తి అయ్యే ప్రక్రియ కాదు. మన భావాలను అర్థం చేసుకోవడం, ప్రతికూల ఆలోచనలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవడం చేయడం. మీ మనసుకు ప్రశాంతతను చేకూర్చే పనులకు సమయం కేటాయించండి. భావోద్వేగాలను దాచుకోవడం కంటే పంచుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని గ్రహించండి.

Leave a Comment