ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ ఇంత ప్రమాదకరమా?

ప్లాస్టిక్ జీవితంలో భాగమైపోయింది. ఆధునిక జీవనశైలి కారణంగా ప్లాస్టిక్ బాటిల్స్, బాక్సులు, పాత్రలు, ప్లేట్లు విరివిగా వాడుతున్నారు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు పలు రూపాయల్లో ప్లాసిక్ వస్తువులు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ లంచ్ బాక్సులలో క్యారీ చేస్తున్నారు. ఇక మెజారిటీ జనాలు ఉపయోగించే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. తక్కువ బరువు కలిగి ఉండటం, సౌలభ్యం, అందుబాటులో ఉండే ధరలు ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

అయితే ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యం మీద  తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం మెల్లగా మీ శరీరంలోకి విషాన్ని పంపుతుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక రోగాలకు కారణం అవుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్. లంచ్ బాక్సుల తయారీలో ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సులలో ఉంచినప్పుడు లేదా ప్లాస్టిక్ బాటిల్స్ ఎండలో ఉంచి నీరు తాగినప్పుడు దానిలోని రసాయనాలు ఆహారంలో, నీటిలో కలిసిపోతాయి. తద్వారా సదరు రసాయనాలు మన శరీరంలోకి చేరతాయి.

ప్లాస్టిక్ పాత్రలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఇలా!

ప్లాస్టిక్ పాత్రల వినియోగం అత్యంత ప్రమాదకరం. తరచుగా ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగడం, ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తినడం వలన పలు రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి.

హార్మోన్ల అసమతుల్యత: ప్లాస్టిక్ తయారీకి ప్రాణాంతక బిస్ఫెనాల్, ఫథాలేట్స్ వంటి రసాయనాలు వాడతారు. ఈ రసాయనాలు శరీరంలోకి చేరినప్పుడు హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపుతాయి. హార్మోన్లు అసమతుల్యతకు గురైతే పలు రకాల సమస్యలు చుట్టుముడతాయి.

మైక్రో ప్లాస్టిక్ ముప్పు: ప్లాస్టిక్ పాత్రలు, బాటిల్స్ నుండి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు తాగినప్పుడు, పాత్రల్లో భోజనం చేసినప్పుడు ప్లాస్టిక్ కణాలు కడుపులోకి వెళతాయి. క్రమేణా ప్లాస్టిక్ కణాలు రక్తంలోకి కలిసి అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయి.

క్యాన్సర్ ప్రమాదం: ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి పదార్థాలు పెట్టడం వల్ల విడుదలయ్యే విషపూరిత రసాయనాలు దీర్ఘకాలంలో క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణం అవుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఆధునిక కాలంలో పలు రకాల క్యాన్సర్స్ కి ప్లాస్టిక్ వినియోగం కేంద్ర బిందువు అవుతుంది. మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ప్రాణాలను హరిస్తుంది.

సంతానలేమి సమస్యలు: ఈ జనరేషన్ కపుల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సంతాన లేమి. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా సహజంగా పిల్లలు పుట్టడం లేదు. దాంతో దంపతులు ఫెర్టిలిటీ సెంటర్స్ ని ఆశ్రయిస్తున్నారు. కాగా సంతానోత్పత్తి సమస్యలకు ప్లాస్టిక్ వినియోగం కూడా ఒక కారణమని వైద్యులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ రసాయనాలు స్త్రీ, పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

జీర్ణక్రియ: ప్లాస్టిక్ జీర్ణకోశ సమస్యలకు దారితీస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది రోగనిరోధక శక్తిని సైతం దెబ్బతీస్తుంది. జీర్ణక్రియ సమస్యల వలన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ క్రమంగా బలహీనం అవుతుందని వైద్యుల సమాచారం.

ప్లాస్టిక్ నివారణ-సురక్షిత ప్రత్యామ్నాయాలు 

రాగి పాత్రలు, బాటిల్స్:  మన పూర్వీకులు రాగి పాత్రల్లో భోజనం చేసే వారు. అలాగే నీటిని నిల్వ చేయడం, రాగి చెంబు, గ్లాసులో నీరు తాగేవారు. రాగి పాత్రలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు తెలియజేశాయి. రాగి పాత్రల వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో రాగితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కొంచెం ధర ఎక్కువైనా… కాఫర్ బాటిల్స్ కి మారిపోండి.

స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ & బాక్సులు: స్కూల్ పిల్లలు వినియోగించే వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు దాదాపు ప్లాస్టిక్ తో తయారు చేసినవే. అలాగే పెద్దవాళ్ళు సైతం ఆఫీస్ లకు లంచ్, ప్లాస్టిక్ బాక్సులలో తీసుకెళుతున్నారు. ఇక కార్యాలయాల్లో వినియోగించే వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ వే కావడం ఆందోళన కలిగించే అంశం. వేడి వేడి ఆహారాన్ని లంచ్ బాక్సులలో పెట్టకూడదు. ప్లాస్టిక్ లంచ్ బాక్సులకు బదులు స్టైన్లెస్ స్టీల్ వాడాలని నిపుణుల సలహా. ఇవి తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి.

గాజు పాత్రలు: ఇంట్లో ఆహారం, నీరు నిల్వ చేయడానికి గాజు పాత్రలు, బాటిల్స్ మంచి ప్రత్యామ్నాయం. గాజు పాత్రల్లో ఆహారం నిల్వ చేయడం వలన ఎలాంటి రసాయనాలు కలవు. ఆహారం విషపూరితం కాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ కి బదులు గాజు పాత్రలు వాడటం అలవాటుగా మార్చుకోండి.

మట్టి పాత్రలు: వేసవి కాలంలో ఫ్రిజ్ లో స్టోర్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగడం కంటే మట్టి కుండలో స్టోర్ చేసిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. మట్టి కుండలోని నీరు శరీరానికి సహజమైన చల్లదనం, ఖనిజాలు లభిస్తాయి. మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకుని తినేవారు. వాటిలోనే ఆహారాన్ని స్టోర్ చేసేవారు.

వేడి పదార్థాలు ప్లాస్టిక్ పాత్రలలో పెట్టకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పెట్టాల్సిన వచ్చినా… పూర్తిగా చల్లారిన తర్వాత నింపండి. వేడి నీటిని సైతం ప్లాస్టిక్ బాటిల్స్ లో పోయరాదు. మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే పరిష్కారం. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు నిషేదించడమే.

 

 

Leave a Comment