పారాసెటమాల్ అత్యంత సాధారణంగా ఉపయోగించే ఔషధం. ప్రతి ఒక్కరి ఇంట్లో విధిగా పారాసెటమాల్ ఉంటుంది. జ్వరం, తలనొప్పి, ఇతర శరీర నొప్పులకు ఉపశమనంగా పారాసెటమాల్ వాడుతుంటారు. అయితే సాధారణ స్థాయిలో, ఒక పద్ధతి ప్రకారం మాత్రమే పారాసెటమాల్ వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే పారాసెటమాల్ శరీరం మీద దుష్ప్రభావాలు చూపుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు కారణం అవుతుంది.
సొంత వైద్యంగా పారాసెటమాల్ ఉపయోగించేవారు పలు విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మెడికల్ స్టోర్స్ తో సులభంగా పారాసెటమాల్ దొరుకుతుంది. డాక్టర్ డిస్క్రిప్షన్ లేకుండానే పారాసెటమాల్ స్టోర్ కీపర్స్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పారాసెటమాల్ విక్రయిస్తూ ఉంటారు. సరైన మోతాదులో, సమయ పాలన లేకుండా విరివిగా పారాసెటమాల్ తీసుకోవడం ప్రమాదం. అవగాహన లేకుండా పారాసెటమాల్ వినియోగిస్తే కలిగే నష్టాలు ఏమిటో చూద్దాం..

సాధారణ దుష్ప్రభావాలు
జీర్ణక్రియ సమస్యలు: కొందరిలో పారాసెటమాల్ వాడిన వెంటనే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వాటిలో జీర్ణక్రియ సమస్య ఒకటి. కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. వికారంగా ఉంటుంది. వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది.
నీరసం: పారాసెటమాల్ వేసుకున్న వెంటనే పలువురిలో నీరసం, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే మలబద్ధకం లేదా విరోచనాలతో బాధపడే ఆస్కారం కలదు. జీర్ణక్రియలో ఏర్పడే మార్పుల వలన ఈ సమస్యలు తలెత్తవచ్చు.
కాలేయ సమస్యలు: పారాసెటమాల్ ఎడాపెడా వాడేయడం అత్యంత ప్రమాదం అని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇది కాలేయ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. పారాసెటమాల్ కాలేయంలో ప్రాసెస్ అవుతుంది. పారాసెటమాల్ మోతాదుకు మించి తరచుగా తీసుకోవడం వలన కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇక మద్యం అలవాటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారి కాలేయం దెబ్బతినే అవకాశం కలదు.
అలర్జీ సమస్యలు: పారాసెటమాల్ కొందరికి సరిపడదు. దాని వలన అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. చర్మంపై దురదలు, దద్దుర్లు లేదా ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చు. ముఖ్యం, పదవులు, నాలుక, గొంతు వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం వంటి సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఈ అలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మూత్రపిండాల సమస్యలు: దీర్ఘకాలం పాటు ఎక్కువ మోతాదులో పారాసెటమాల్ వాడితే మూత్రపిండాలు దెబ్బతింటాయి. వాటి పనితీరు మందగిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే ఈ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పని నిపుణుల సూచన.
బ్లడ్ సమస్యలు: నియంత్రణ లేకుండా దీర్ఘకాలం పారాసెటమాల్ తీసుకుంటే రక్త సంబంధిత సమస్యలు తప్పవు. పారాసెటమాల్ రక్తంలోని ముఖ్యమైన ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలను నాశనం చేస్తుంది. దీని వలన గాయాలు మానవు. రక్తస్రావం అవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
పారాసెటమాల్ వాడకంలో జాగ్రత్తలు
వైద్యుల సూచనల మేరకే పారాసెటమాల్ వినియోగించాలి. ఒక రోజుకు కేవలం 4 గ్రాముల పారాసెటమాల్ కంటే ఎక్కువ మోతాదు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర దగ్గు, జలుబు మందులు వాడే సమయంలో వాటిలో పారాసెటమాల్ మోతాదు ఉందేమో గమనించాలి. వరుసగా 3 రోజులు జ్వరంతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించాలి. పారాసెటమాల్ వేసుకుంటూ ఇంటికే పరిమితం కావడం ప్రమాదం.
పారాసెటమాల్ శరీర బరువు, వయసు ఆధారంగా మోతాదు నిర్ణయించుకోవాలి. సరైన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించితే దుష్ప్రభావాలు తప్పవు. పెద్దలు ప్రతి 4 నుండి 6 గంటల విరామంతో ఒకసారి తీసుకోవాలి. 24 గంటల వ్యవధిలో 4 గ్రాముల(4000mg)కు మించకుండా చూసుకోవాలి. ఒకే రోజు 650 mg మాత్రలు 5 కంటే ఎక్కువ తీసుకోకూడదు.
పిల్లలకు ఎలా వాడాలి
పిల్లలకు మాత్రల కంటే సిరప్/డ్రాప్స్ రూపంలో ఇవ్వడం శ్రేయస్కరం. మోతాదు వయసు కంటే బరువు ఆధారంగా నిర్ణయించాలని వైద్యుల సూచన. ప్రతి 1 కేజీ బరువుకు 10mg నుండి 15mg వరకు ఇవ్వొచ్చు. 4 నుండి 6 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి.
రోజుకు గరిష్టంగా 4 పర్యాయాలకు మించకూడదు. డ్రాపర్ లేదా కొలత కప్పును మాత్రమే వాడాలి. స్పూన్స్ వాడటం వలన మోతాదు సరిగా తెలియకపోవచ్చు. దగ్గు, జలుబు మందుల్లో కూడా పారాసెటమాల్ కంటెంట్ ఉందేమో సరిచూసుకోండి. ఓవర్ డోస్ కాకుండా జాగ్రత్తపడండి.
పారాసెటమాల్ ఎవరైనా వాడదగిన సాధారణ ముందుగా జనాలు భావిస్తారు. అది తప్పుడు భావన. అలాగే జ్వరం, తలనొప్పితో పాటు శరీర నొప్పులకు పారాసెటమాల్ తరచుగా వాడేస్తూ ఉంటారు. అలాగే పారాసెటమాల్ విరివిగా, తక్కువ ధరకు లభిస్తుంది. కాగా పారాసెటమాల్ సరైన మోతాదులో, క్రమపద్ధతిలో వాడటం తప్పనిసరి. లేదంటే లివర్, కిడ్నీ వంటి అత్యంత ముఖ్య అవయవాలు పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముందు ప్రతి సమస్యకు పారాసెటమాల్ వాడకాన్ని మానుకోవాలి. దీర్ఘకాలం శరీర భాగాల నొప్పులు, జ్వరంతో బాధపడుతుంటే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ఇక పిల్లలకు పారాసెటమాల్ వినియోగం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
