”సమయానికి తగు మాటలాడెనే…” అన్నారు త్యాగరాజు. సందర్భానికి, తగినట్టు మాట్లాడాలి. పరిస్థితులకు అనుగుణంగా మాటతీరుండాలని… సంగీత సామ్రాట్ త్యాగరాజు భావన. మనిషి మాటకు చాలా విలువ ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని మాట్లాడే విధానం, ఉపయోగించే పదాలు నిర్ణయిస్తాయి. అందుకే ఆచితూచి మాట్లాడాలి. తొందరపడి అసలు మాట్లాడకూడదు. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం.
అవసరమైన సందర్భాల్లో నోరు విప్పడం ఎంత ముఖ్యమో… మౌనంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. బహుముఖ ప్రజ్ఞాశాలి చాణక్యుడు… ఈ అంశం మీద కొన్ని సూచనలు చేశారు. ఎలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండాలో ఆయన సూచించారు. మౌనం మనకు మనశ్శాంతి, ప్రశాంతతను చేకూర్చుతాయని ఆయన అన్నారు. అలాగే మౌనం ఒకరి గౌరవాన్ని పెంచుతుంది అన్నారు. వందల ఏళ్ల క్రితం చేసిన ఆయన సూచనలు ఎప్పటికీ ఆచరణీయం. చాణుక్యుడి చెప్పిన ఆ సందర్భాలు ఏమిటో చూద్దాం… 
నీ మాటకు విలువ లేని చోట మాట్లాడకు: ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించని వారితో మౌనంగా ఉండటమే మంచిది. సమస్యకు పరిష్కారం కోసం కాకుండా మీతో వాదించడానికి వారు మాట్లాడొచ్చు. వితండ వాదం చేసే వారితో వాదన గెలవాలి అనుకోకూడదు. అందువలన మీ శక్తి, సమయం వృధా అవుతుంది తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ మాట సానుకూలంగా విని తప్పు ఒప్పులపై సహేతుకమైన చర్చ జరిపే వారితో మాత్రమే మాట్లాడాలి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండమని చాణుక్యుడి సూచన.
కోపంగా ఉన్న వారితో మాట్లాడకు: కోపం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అంటే కోపంలో ఉన్నవారికి తమ మాట, చేతల మీద అదుపు ఉండదు. అత్యంత కోపంగా ఉన్న వ్యక్తులతో చర్చకు దిగడం సమస్యను మరింత పెంచుతుంది. కాబట్టి కోపంగా ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండాలి. పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చాక వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అర్థమయ్యేలా విషయాన్ని వివరించాలి. లేకుండా కోపంగా ఉన్న వ్యక్తిని సముదాయించాలి అనుకోవడం పొరపాటు. ఆ సమయంలో నీవు చెప్పే మంచి కూడా వారికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి కోపంగా ఉన్న వ్యక్తులతో వాదించకుండా… మౌనం వహించండి.
లక్ష్యాన్ని గుట్టుగా ఉంచండి: మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని వెంటనే చెప్పకూడదు. ఎవరైనా అడిగినా మౌనంగా ఉండాలని చాణుక్యుడి సలహా. మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని ముందే చెప్పడం వలన… విమర్శలు, నిరుస్తాహపరిచే మాటలు ఎదురు కావచ్చు. దాంతో ఈ లక్ష్యాన్ని నేను సాధించలేనేమో అనే నిర్ణయానికి మీరు రావచ్చు. లక్ష్యాన్ని వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే తలపెట్టిన పనిని మౌనంగా పూర్తి చేయండి. అప్పుడు అందరికీ తెలిసేలా చేయండి. మీ చుట్టూ ఉన్నవారు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు నిర్ఘాంతపోతారు. నీ శక్తి, స్థాయి ఏమిటో తెలుసుకుంటారు.
రహస్యాలు: నీకు తెలిసిన రహస్యాలు ప్రతి ఒక్కరితో పంచుకోకూడదు. ఒకరు మీపై నమ్మకంతో చెప్పిన విషయాలు బహిర్గతం చేయడం వలన, వారి నమ్మకాన్ని మీరు కోల్పోతారు. రహస్యాలను ఇతరులు అస్త్రాలుగా వాడుకుని దెబ్బ తీస్తారు. ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉండాలన్నదే రహస్యం పరమార్థం. బంధు మిత్రులు లేదా కుటుంబ సభ్యుల రహస్యాలను బయటపెట్టకండి. ఈ విషయంలో మౌనం వహించండని చాణుక్యుడి సలహా.
అలాగే మీ రహస్యాలు సైతం ఎవరితో పంచుకోకండి. అత్యంత మిత్రులు, సన్నిహితులు, బంధువులకు కూడా చెప్పకండని చాణుక్యుడు హెచ్చరించారు. నేటి మిత్రుడు రేపటి శత్రువు కావచ్చు. మీ ఇద్దరి మధ్య బంధం చెడినప్పుడు… నీ రహస్యాలను నీపై ఆయుధంగా వాడొచ్చు. నీ గౌరవానికి భంగం కలిగించవచ్చు. కాబట్టి రహస్యాలు చెప్పాల్సి వచ్చిన సందర్భంలో మౌనమే గొప్ప పరిష్కారం.
చాణక్యుడు చేసిన ఈ సూచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. నేటి సమాజంలో జరిగే అనేక అనర్థాలకు మాటతీరే కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మౌనంగా ఉండటమే ఉత్తమం. ఒక వ్యక్తి గురించి వెనుక తప్పుగా మాట్లాడటం, అబద్దాలు చెప్పడం సరికాదు. ఈ తరహా వ్యక్తిత్వం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించినా దీర్ఘకాలంలో సమస్యల పాలు చేస్తుంది.
