పేరెంటింగ్ బాధ్యతతో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. పిల్లలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. అందుకు వారి సామర్ధ్యాలను మెరుగు పరచాలి. అదే సమయంలో సోషల్ వాల్యూస్ నేర్పించాలి. జ్ఞానంతో పాటు సంస్కారం కూడా అవసరం. ఈ జనరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నైతిక విలువలకు ప్రాధ్యానత ఇవ్వడం లేదు. చదువు అంటే కేవలం కెరీర్ కోసమే అన్నట్లు సాగుతుంది. సమాజంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిదర్శనం. గురువులను, పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను గౌరవించడం… భయం, భక్తి వంటి సద్గుణాలు పిల్లల్లో కొరవడుతున్నాయి.
సోషల్ వాల్యూస్, బిహేవియర్ తెలియకుండా పెరిగిన పిల్లలు అసహజ ప్రవర్తన కనబరుస్తున్నారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, ఒత్తిడిని జయించడం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కనిపించడం లేదు. బాల్యంలోనే గాడితప్పిన యువత అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. సొంత తల్లిదండ్రులను కూడా ప్రేమించలేని స్థితికి వారి ఆలోచనా విధానం చేరుతుంది.
ఈక్రమంలో పిల్లల పెంపకంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా పేరెంట్స్ తమ పిల్లలకు విలువలతో కూడిన ప్రవర్తన నేర్పించాలి. అందుకు వారు స్ఫూర్తిగా నిలవాలి. పిల్లలు తమ పేరెంట్స్ ని చాలా విషయాల్లో స్ఫూర్తిగా తీసుకుంటారు. పెద్దవారి ప్రవర్తన, మాట తీరు, ఇతరుల పట్ల వారు కనబరిచే ప్రవర్తన ఆధారంగానే పిల్లల నడవడిక ఉంటుంది. అంటే పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే… అందుకు పేరెంట్స్ దారి చూపాల్సి ఉంటుంది. కాగా పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని కొన్ని తప్పులను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

పిల్లల ముందు గొడవపడటం: దంపతుల మధ్య ఎన్ని సమస్యలు, మనస్పర్థలు ఉన్నా… అవి పిల్లలకు తెలియనీయకూడదు. సాధ్యమైనంత వరకు పేరెంట్స్ గొడవలు పిల్లల దృష్టికి వెళ్లకుండా చూసుకోవాలి. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు గట్టిగా అరుచుకోవడం, వస్తువులు విసిరివేయడం చేస్తే పిల్లలు ఆందోళనకు గురవుతారు. వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పిల్లలు తమ సమస్యలను పేరెంట్స్ కి చెప్పేందుకు భయపడతారు.
భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం వలన పిల్లల్లో కూడా అదే భావన ఏర్పడుతుంది. పేరెంట్స్ పట్ల గౌరవాన్ని కోల్పోతారు. కాబట్టి పేరెంట్స్ తమ సమస్యలు… పిల్లలు లేని సమయంలో సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. పిల్లల ముందు కీచులాడుకోవద్దు.
కంపారిజన్: పేరెంట్స్ సాధారణంగా చేసే అతి పెద్ద తప్పు…. ఇతరులతో తమ పిల్లలను పోల్చి, తక్కువ చేసి మాట్లాడటం. క్లాస్ టాపర్ తో లేదా మీ నైబర్ పిల్లలతో కిడ్స్ ని కంపేర్ చేయకండి. వాళ్ళు మెరుగ్గా ఉన్నారు… నువ్వు వెనకబడిపోయావు, నువ్వు యూజ్లెస్ అంటూ పదే పదే పిల్లలను దూషించడం వలన… వారి సామర్ధ్యాలు దెబ్బతింటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోయిన పిల్లలు… మరింత వెనుకబడిపోతారు.
పిల్లల లోపాలను ఎత్తి చూపడం మానేసి… వారి బలాన్ని గుర్తించండి. ఆ దిశగా ప్రోత్సహించండి. వారు బలహీనంగా ఉన్న కేటగిరీలో మెరుగయ్యేలా జాగ్రత్తలు తీసుకోండి. చేయాల్సిన పనులు సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు పిల్లలు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోగలరు.
అబద్దాలు చెప్పడం: బాల్యంలో ప్రతి విషయాన్ని నిశితంగా గమనించే లక్షణం ఉంటుంది. తాము చూసిన విషయాలు అలవర్చుకోవడానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు. పేరెంట్స్ పిల్లల ముందే అబద్ధాలు చెప్తుంటే… పిల్లలు కూడా అలవాటు పడతారు. అమ్మానాన్నలు చేస్తున్నారు కాబట్టి…. అబద్ధం చెప్పడం తప్పు కాదనే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వెళుతుంది. ఫ్రెండ్స్, టీచర్స్ తో అబద్ధాలు చెప్పేందుకు వెనకాడరు.
ఒక అబద్ధం అనేక తప్పులకు దారి తీస్తుంది. ఇదే తరహా ప్రవర్తనతో పెరిగిన యువత తమ కెరీర్ తో పాటు సోషల్ లైఫ్ లో పలు సమస్యలకు కారణం అవుతారు. ఇబ్బందులకు గురవుతారు. ఎగతాళికి కూడా పిల్లల ఎదుట అబద్ధాలు ఆడకండి.
ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం: ఈర్ష్యతోనో, మనం గొప్ప అని చెప్పుకోవడానికో… కొందరు ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడతారు. ఈ లక్షణం మంచిది కాదు. ఇతరుల ఆర్థిక స్తోమత, అందం, చదువు, కెరీర్, సామర్ధ్యాలను ఎగతాళి చేస్తారు. పేరెంట్స్ పిల్లల ఎదుట ఈ తరహా ప్రవర్తన కనబరిస్తే… వారు కూడా అలానే తయారవుతారు. ఇతరులను విజయాలను అంగీకరించలేని స్థితికి చేరుతారు. ప్రతి విషయాన్ని నెగిటివ్ కోణంలో చూడటం, విమర్శలు చేయడం అలవరుచుకుంటారు. ఒక వ్యక్తితో మంచి విషయాలను మాత్రమే గ్రహించాలి, చెడును పట్టించుకోకుండా వదిలేయాలనే లక్షణాలకు దూరం అవుతారు.
అతిగా మొబైల్, కంప్యూటర్స్ వాడటం: పేరెంట్స్ చేస్తూ ప్రధాన తప్పుల్లో ఇదొకటి. మొబైల్ అడిక్షన్ ని గురైన పేరెంట్స్… గంటల తరబడి ఫోన్ యూజ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా మోజులో కంప్యూటర్ స్క్రీన్స్ కి అతుక్కుపోతున్నారు. అవసరానికి మించి మొబైల్ వాడటం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ఇక పేరెంట్స్ ని చూసిన పిల్లలు సైతం మొబైల్ ని పరిమితికి మించి వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే మొబైల్ లో వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ పిల్లల ముందు మొబైల్, కంప్యూటర్స్ వాడటం తగ్గించాలి. అలాగే పిల్లలు వీలైనంత తక్కువ సమయం మొబైల్ వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పేరెంటింగ్ విషయంలో కపుల్స్ ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. అప్పుడే భవిష్యత్లో తమ పిల్లలు ఆదర్శవంతులుగా ఉంటారు. అటు కుటుంబ సభ్యులతో పాటు సమాజాన్ని గౌరవిస్తారు.
