కాపురాల్లో చిచ్చు పెడుతున్న సోషల్ మీడియా!

అంతకంతకు దేశంలో విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతుండగా… దానికి సోషల్ మీడియా కూడా కారణం కావడం… కలవరపరిచే అంశం. భార్యాభర్తల మధ్య గొడవలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో సోషల్ మీడియా కూడా చేరింది. సోషల్ మీడియా మోజులో దంపతులు మాట్లాడుకోవడం, ఆహ్లాదంగా గడపడం మానేస్తున్నారు.

సైకాలజీ నిపుణులు ఈ విషయం మీద కొన్ని దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడించారు. తమ అధ్యయనంలో తెలుసుకున్న విషయాలు పొందుపరిచారు. అసలు సోషల్ మీడియా ఏ విధంగా ఎడబాటుకు కారణం అవుతుందో ఈ స్టోరీలో చూద్దాం.

ఎమోషనల్ అటాచ్మెంట్: సోషల్ మీడియాకు బానిసలైన దంపతులు ఒకరితో మరొకరు మాట్లాడటం తగ్గించేస్తున్నారు. భాగస్వామికి సమయం కేటాయించడం లేదు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తతో భార్య మనసు విప్పి మాట్లాడటం లేదు. అలాగే భార్య రోజు ఎలా గడిచిందని భర్త అడగడం లేదు.మన మనసులోని భావాలను భాగస్వాములతోనే పంచుకోగలం. మన పార్ట్నర్ సోషల్ మీడియాలో మునిగి సమయం ఇవ్వకపోవడం… అసహనానికి దారి తీస్తుంది.

తనను పట్టించుకోవడం లేదు. ప్రాముఖ్యత ఇవ్వడం లేదనే భావన కలుగుతుంది. అదే చిన్న చిన్న గొడవలుగా మొదలై విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే భాగస్వామితో మాట్లాడటం, ఆహ్లాదంగా గడపడం ద్వారా ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. బంధాన్ని బలంగా మార్చుతుంది.

ఇతరులతో పోల్చుకోవడం: సోషల్ మీడియాలో ఇతరులు పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు చూసి వారి జీవితం చాలా బాగుంది. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నారనే భావనలు మనసులో కలుగుతాయి. తమ జీవితం అంత అందంగా ఎందుకు లేదు అనే అసహనం మొదలవుతుంది. ఇతరుల వలె తన జీవితం సంతోషంగా ఉండకపోవడానికి భాగస్వామినే కారణం అనే ఆలోచనకు వస్తారు. ఇది విబేధాలకు దారి తీస్తుంది.

అనుమానాలు: సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు లైక్స్, కామెంట్స్ రూపంలో నెటిజెన్స్ తమ స్పందన తెలుపుతారు. ఒకరు చేసిన కామెంట్ ని భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా కామెంట్స్, చాట్స్… భాగస్వామి మీద అనుమానాలకు దారితీస్తాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం ఒకసారి అనుమానం మొదలైతే అది పెరుగుతూ పోతుంది. ఈ అనుమానాలు విడాకులకు కారణం కావచ్చు.

పిల్లల కేరింగ్: సోషల్ మీడియా పిచ్చిలో దంపతులు పిల్లల ఆలనాపాలనా కూడా వదిలేస్తున్నారు. స్కూల్ కి రెడీ చేయడం, మంచి ఆహారం ఇవ్వడం, వాళ్ళ మార్క్స్, బిహేవియర్ వంటి కీలక అంశాల మీద దృష్టి పెట్టడం లేదు. పిల్లల్ని పట్టించుకోవడం లేదనే అసహనం భాగస్వామిలో కలిగితే అది గొడవలకు బీజం వేస్తుంది.

డామినేషన్: సోషల్ మీడియా స్టార్ డమ్ కొందరిలో అహానికి బీజం వేస్తుంది. భాగస్వామి కంటే నేనే ఎక్కువ అనే ఆలోచన రేకెత్తించవచ్చు. దీంతో కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడటం, చులకనగా చూడటం చేయవచ్చు. తమ బాధ్యతలు కూడా మరిచి స్టార్ డమ్ ఫీల్ కావడం అనేక గొడవలకు కారణం అవుతుంది.

అయితే సోషల్ మీడియాతో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా బంధాలను తుంచడమే కాదు పెంచుతుంది. వేరు వేరు నగరాల్లో పని చేస్తున్న దంపతులు సాయంత్రం సరదాగా సంబాషించుకోవడానికి సోషల్ మీడియా కారణం అవుతుంది. వీడియో కాల్ లో ఒకరినొకరు చూసుకుంటూ… మాట్లాడుకునే సౌలభ్యం ఉంది. సోషల్ మీడియా పోస్ట్ లతో వారి దినచర్య ఏంటి? ఎలా గడిచింది అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాకు బానిసలు కాకుండా… పరిమితంగా వాడి, దాని ప్రయోజనాలు ఆస్వాదించండి.

Leave a Comment