పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ ని ఎలా ఎంచుకోవాలి? తప్పు చేశారో నరకమే!

పెళ్లి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. నూరేళ్లు సాగాల్సిన ప్రయాణం. పర్ఫెక్ట్ లైఫ్ పార్టనర్ ని ఎంచుకోవడం అత్యంత కీలకం. లేదంటే జీవితం నరకం అవుతుంది. మారిన జీవనశైలి, అవగాహన లోపం, ఇగో, క్షణికావేశం వంటి కారణాల వలన విడాకులు తీసుకునే భాగస్వాముల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అంతకంటే ఆందోళన కలిగించే పరిణామం… నేర ప్రవృత్తికి మానవ సంబంధాలు దారి తీస్తున్నాయి. తమ జీవిత భాగస్వాములను, కాబోయేవారిని హత్యలు చేస్తున్నారు. ఒకరిని గుడ్డిగా నమ్మి మోసపోతున్న అమ్మాయిలు, అబ్బాయిలకు సంబంధించిన కథనాలు రోజూ మీడియాలో  చూస్తూనే ఉన్నాం..

రాంగ్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. నిత్యం గొడవలు, పంచాయతీలు చోటు చేసుకుంటాయి. ఇరు కుటుంబాల పెద్దలు కూడా పరిష్కరించలేని స్థాయికి గొడవలు చేరితే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఒక్కోసారి పిల్లలా… జీవిత భాగస్వామా? అనే సందిగ్ధత ఏర్పడవచ్చు. పిల్లలను వదులుకోలేక, భాగస్వామిని భరించలేక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందుకే జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఆలస్యమైనా… అన్ని విధాలుగా మీ వ్యక్తిత్వానికి సరిపోయే పార్టనర్ ని వివాహం చేసుకోవాలి. పెళ్లి చేసుకోయే ముందు పార్టనర్ ని కొన్ని అంశాల ఆధారంగా ఎంచుకోవాలి…

 

అందం కాదు గుణం ముఖ్యం

తమ లైఫ్ పార్టనర్ అందంగా ఉండాలని… బంధువులు, మిత్రులు గొప్పగా చెప్పుకోవాలని భావిస్తారు. అందవిహీనంగా ఉన్న అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎగతాళి చేస్తారనే సంకుచిత ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మొదటి ప్రాధాన్యత అందానికి ఇస్తారు. కానీ అందం అశాశ్వతం, గుణం శాశ్వతం అని గ్రహించాలి. అందుకే బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. దయ, కరుణ, పెద్దలను గౌరవించడం, పరిస్థితులను అర్థం చేసుకుని నడిచే లక్షణాలు ఉన్న వ్యక్తులతో లైఫ్ బాగుంటుంది.

తగినంత సమయం తీసుకోండి 

లైఫ్ పార్ట్నర్ ఎంపిక విషయంలో తొందరపడకండి. పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికే వరకు వేచి చూడండి. పెళ్లి చేసుకునే వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకోండి. వీలైతే కాబోయే వ్యక్తితో కొన్నాళ్ళు ప్రయాణం చేయండి. డేటింగ్ చేయండి. వెకేషన్స్ కి వెళ్ళండి. హోటల్, రెస్టారెంట్స్ లో వారి సోషల్ బిహేవియర్ గమనించండి. వెయిటర్స్, స్ట్రేంజర్స్ తో వారు ప్రవర్తించే తీరుతో మనకు అవగాహన వస్తుంది. మీకు కాబోయే పార్ట్నర్ కరుణ, దయ కలిగిన ఉన్నారో లేదో తెలుస్తుంది. ఇతరుల పట్ల ఎంపతీ చూపనివారు, మన కుటుంబ సభ్యులతో కూడా అలానే ప్రవర్తించే ప్రమాదం ఉంది.

ఇండిపెండెంట్ నేచర్ 

స్వాభిమానం, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులను జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం మంచిది. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు సమస్యల నుండి పారిపోకుండా పరిష్కారం వెతికే సమర్థత కలిగి ఉంటారు. అదే సమయంలో ఇగోయిస్టు లక్షణాలు ఉన్నాయేమో చూడాలి. ఇండిపెండెంట్ నేచర్ కి ఇగోకి చాలా తేడా ఉంది. నా మాట మాత్రమే నెగ్గాలనే అహం ఉన్నవారితో జీవితం కఠినంగా ఉంటుంది.

మీ లక్ష్యాలు పంచుకోండి 

కాబోయే లైఫ్ పార్ట్నర్ తో మీ జీవిత లక్ష్యాలు పంచుకోండి. కెరీర్ తో పాటు ఆర్థిక ప్రణాళికలు, ఫ్యామిలీ ప్లానింగ్ వంటి కీలక అంశాలు పెళ్ళికి ముందే చర్చించండి. అదే సమయంలో వారి గోల్స్ అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా ఎంత మంది పిల్లలను కనాలి? ఎప్పుడు కనాలి? అనే విషయాల్లో అభిప్రాయ బేధాలు ఏర్పడవచ్చు. ఇలాంటి కీలక విషయాల్లో ముందే అవగాహన కుదిరితే పెళ్లయ్యాక సమస్యలు వచ్చే ఆస్కారం ఉండదు.

మీరు నమ్మే దేవుళ్ళు, మత విశ్వాసాలతో పాటు పాటించే సామాజిక విలువలు, మోరల్స్ కాబోతే జీవిత భాగస్వామితో పంచుకోండి. మీ ఆలోచనలపై వారి అభిప్రాయం అడిగి తెలుసుకోండి.

ఎమోషనల్ మెచ్యూరిటి అంచనా వేయండి 

జీవితంలో పలు సందర్భాల్లో రిస్క్ చేయాల్సి వస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జీవిత భాగస్వామి సలహాలు ఇవ్వగలగాలి. మన నిర్ణయాలను జడ్జ్ చేయాలి. అదే సమయంలో గౌరవించాలి. ఈ లక్షణాలు జీవిత భాగస్వామికి కచ్చితంగా ఉండాలి.

ప్రతి విషయం తనతో షేర్ చేసుకునే స్వతంత్ర ఉందో లేదో తెలుసుకోవాలి. మన నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోకుండా… కఠినంగా ప్రవర్తించే గుణం ఉన్నవారితో కష్టం.

వాళ్లతో రిస్క్, గుడ్డిగా నమ్మొద్దు 

సెమీ అర్బన్, అర్బన్, మెట్రోపాలిటన్ నగరాల్లో మాట్రిమోని కల్చర్ కొనసాగుతుంది. అలాగే డేటింగ్ యాప్స్, సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను కొందరు జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటున్నారు. ఇది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. ఫేక్ ప్రొఫైల్స్ తో బోల్తా కొట్టించే ఛీటర్స్ ఎక్కువైపోయారు. పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుంటూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్లైన్ పరిచయాలు, మాట్రిమోని సంస్థల ద్వారా జీవిత భాగస్వామి ఎంచుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పలుమార్లు సదరు వ్యక్తుల ప్రొఫైల్, క్యారెక్టర్ వెరిఫై చేయండి.

పరస్పర అవగాహన అవసరం 

వైవాహిక బంధం సాఫీగా సాగాలంటే జీవిత భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం అవసరం. తమ గత రిలేషన్స్ గురించి ముందే చర్చించడం వలన భవిష్యత్తులో సమస్యలు ఉండవు. అదే సమయంలో నమ్మకం బలపడే అవకాశం ఉంది. మన గతం ఏదైనా యాక్సెప్ట్ చేసి, నిజాయితీగా ముందుకు వచ్చిన వారితో ప్రయాణం బాగుంటుంది. ఇక మన అభిప్రాయాలను, ఆలోచనలను, భావోద్వేగాలను అర్థం చేసుకుని నడుచుకునే వ్యక్తిత్వం ఉందో లేదో సరిగా అంచనా వేయండి.

అందం, ఆస్తి, హోదా, కులం, మతం వంటి విషయాలు పక్కన పెట్టి… మీ ఆలోచనలకు దగ్గరగా ఉండి, అర్థం చేసుకునే భాగస్వామిని ఎంచుకోండి. నూరేళ్ళ వైవాహిక బంధాన్ని అందంగా మలుచుకోండి…

Leave a Comment