అమ్మో వర్షాకాలం, ప్రమాదంలో మీ ఆరోగ్యం!
మండే ఎండల నుండి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్న జనాలను వర్షాలు పలకరించాయి. చల్లని వాతావరణాన్ని, చిరు జల్లులు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. వానల రాకతో పచ్చగా మారిన చెట్లతో ప్రకృతి ఆహ్లాదంగా ఉంటాయి. అందుకే వర్షాకాలం అందరి ఫేవరేట్ సీజన్. అదే సమయంలో ప్రమాదం కూడాను. అనేక సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే… వైద్యులు సూచిస్తున్న ఈ సూత్రాలు పాటించడం తప్పనిసరి.
అంటు రోగాలు, జలుబు, జ్వరం, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, న్యుమోనియా వంటి వ్యాధులు సాధారణం. గాలిలో తేమ శాతం పెరగడం వలన బ్యాక్టీరియా, వైరస్ సులభంగా దాడి చేస్తాయి. అలాగే వాతావరణ మార్పు కూడా మనలోని వ్యాధి నిరోధక శక్తిని బలహీన పరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే రోగాలతో సావాసం చేయాల్సి వస్తుంది. మీరు, మీ పిల్లలు వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే… వైద్యులు సూచిస్తున్న ఈ సూత్రాలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దాం..

నీటిని ఇలా తాగండి
మనకు సంక్రమించే మెజారిటీ వ్యాధులకు త్రాగు నీరే కారణం అని వైద్య నిపుణుల అభిప్రాయం. కాబట్టి మంచి నీరు విషయంలో అలసత్వం పనికిరాదు. కాచి చల్లారిన నీటిని తాగడం ఆవశ్యకం. నీటిని మరిగించడం వలన హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఫ్రిజ్ లో స్టోర్ చేసిన కూలింగ్ వాటర్ నేరుగా తాగకండి. వర్షాకాలం గోరు వెచ్చని నీరు తాగితే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి
తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవడం అలవాటుగా మార్చుకోండి. ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవాలి. మనం అనేక వస్తువులను తాకుతూ ఉంటాం. సదరు వస్తువుల మీద ఉండే వైరస్, బ్యాక్తీరియా మన చేతుల పైకి చేరుతుంది. చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తింటే అది నేరుగా మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
వేడివేడి ఆహార పదార్ధాలనే తినండి
తాజాగా తయారు చేసిన వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. హోటల్స్, ఫుడ్ స్ట్రీట్స్ లో లభించే ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ పూర్తిగా దూరం పెట్టడం మంచిది. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో భోజనం చేయొద్దు.
శరీరాన్ని పొడిగా ఉంచుకోండి
వృతి, వ్యక్తిగతమైన పనుల కోసం రోజూ బయటకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో వర్షాకాలంలో తడవడం సాధారణం. వర్షంలో ముద్దగా తడిస్తే… వెంటనే తడి బట్టలను మార్చుకోవాలి. తలను, శరీరాన్ని శుభ్రంగా తేమ లేకుండా తుడుచుకోవాలి. తడిసిన తల, శరీరంతో ఎక్కువ సమయం గడిపితే జలుబు, జ్వరం వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. వర్షంలో తడిసి ఇంటికి వచ్చినప్పుడు వేడి నీటితో స్నానం చేసి పొడి బట్టలు ధరించడం మంచిది.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోండి
విరివిగా కురిసే వానల వలన వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు చేరుతుంది. గుంతలు, పల్లపు ప్రాంతాలతో పాటు, బయట పడేసిన ఖాళీ పాత్రల్లో, ప్లాస్టిక్ కంటైనర్స్ లో నీరు జమ అవుతుంది. ఈ నీరు దోమల పెరుగుదలకు దారితీస్తుంది. రోజుల తరబడి నిల్వ ఉన్న నీరు దోమల సంతానోత్పత్తికి అనువైన ప్రదేశాలుగా మారుతుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జికా వంటి వ్యాధులు దోమ కాటు కారణంగా సోకుతాయి. కావున ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి.
ఈ పదార్థాలు తినకండి
వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలు, సమోసాలు, న్యూడిల్స్ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే వీటిని అవైడ్ చేయడమని నిపుణుల సూచన. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, పుట్టగొడులు వంటి ఆహార పదార్ధాలను దూరం పెట్టాలని వైద్యుల అభిప్రాయం. రోగ నిరోధకత పెంచే అల్లం, మిర్యాలు, వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం ఉత్తమం. మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండాలి. అప్పుడే వాటిపై చేరిన బ్యాక్టీరియా, వైరస్ నశిస్తుంది.
ఈ మెడిసిన్ ఇంట్లో ఉండేలా చూసుకోండి
వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి రుగ్మతలు చాలా సాధారణం. ఏ సమయంలో అయినా వీటి బారిన పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే… హోరున కురిసే వర్షంలో అర్థరాత్రి అపరాత్రి బయటకు వెళ్లలేం. కాబట్టి పారాసెటమాల్, సిట్రిరిజిన్/లోరాటడిన్, ఓఆర్ఎస్/ఎలక్ట్రోలైట్స్, యాంటాసిడ్స్ వంటి బేసిక్ మెడిసిన్ ఇంట్లో ఉండేలా చూసుకోండి.
పైన చెప్పిన విధంగా మీ జీవనశైలి మార్చుకోండి. నిపుణుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండండి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వర్షాకాలాన్ని ఆస్వాదించండి.
