నేచర్ లవర్స్ కి బెస్ట్ డెస్టినేషన్ స్పాట్స్, మన తెలుగు రాష్ట్రాల్లోనే!

ఉరుకులు పరుగుల జీవితానికి ట్రావెలింగ్ బెస్ట్ రెమిడీ. బాధ్యతలకు అప్పుడప్పుడు విరామం ప్రకటించాలి. లేదంటే మెదడు వాచిపోతుంది. ఆపై ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలు వెంటాడతాయి. ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి రెండు మూడు పర్యాయాలు వెకేషన్స్ కి వెళ్ళాలి. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో కొన్ని రోజులు నచ్చిన ప్రదేశాల్లో విహరించాలి. అప్పుడు బాడీ రీఛార్జ్ అవుతుంది. మైండ్ కి రిలీఫ్ దక్కుతుంది.

వెకేషన్ అనగానే చాలామంది నార్త్ ఇండియా వైపు చూస్తారు. కులు మనాలి, సిమ్లా, కాశ్మీర్ వెళ్లాలని కోరుకుంటారు. కొందరైతే మలేషియా, థాయిలాండ్, స్విస్, యూఎస్ వంటి దేశాలకు చెక్కేయాలని అనుకుంటారు. ఈ ప్రపంచంలో అబ్బురపరిచే టూరింగ్ ప్లేసెస్ అనేకం ఉన్నాయి. వాటిని సందర్శించడం ఖర్చుతో కూడిన వ్యవహారం. మధ్య తరగతి వాళ్లకు సాధ్యం కాని పని.

అయితే నార్త్, ఓవర్ సీస్ కి ఏమాత్రం తీసిపోని టూరిస్ట్ స్పాట్స్ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వాటిలో కొన్ని హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉన్నాయి. ఈ ప్రదేశాలను వర్షాకాలంలో సందర్శిస్తే గొప్ప అనుభూతి పొందవచ్చు. ముఖ్యంగా నేచర్ లవర్స్ కి ఈ ప్రదేశాలు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని బెస్ట్ టూరింగ్ స్పాట్స్ ఏమిటో తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్

అరకు వ్యాలీ: ఆంధ్రప్రదేశ్ ఊటీగా పేరుగాంచింది అరకు వ్యాలీ. నేచర్ లవర్స్ అమితంగా ఇష్టపడే టూరిస్ట్ స్పాట్. అందమైన లోయలు, పచ్చని పొలాలు, జలపాతాలతో మనోహరంగా ఉంటుంది. బొర్రా గుహలు ప్రకృతి చెక్కిన అద్భుతం అనడంలో సందేహం లేదు. కాఫీ తోటలు, గిరిజన గ్రామాలు, వారి సంస్కృతి, వేషధారణ, అలవాట్లు కొత్త అనుభూతిని పంచుతాయి. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ మరొక ప్రధాన ఆకర్షణ. వర్షాకాలంలో అరకు సందర్శన మరింత ఆహ్లాదంగా ఉంటుంది.

నేరేడుమిల్లి: దట్టమైన అడవితో కూడిన సుందర ప్రాంతం నేరేడుమిల్లి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న నేరేడుమిల్లి పలు ఔషధ గుణాలున్న మొక్కలకు పెట్టింది పేరు. అలాగే తరంగిణి, అమృతధార జలపాతాలు నేరేడుమిల్లిలో కనువిందు చేసే ప్రకృతి అద్భుతాలు. రాజమండ్రి నగరానికి కేవలం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరేడుమిల్లి వర్షాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతం. హోటల్, కాటేజ్ బుకింగ్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

తలకోన వాటర్ ఫాల్స్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరుగాంచింది. తిరుపతి జిల్లా, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లో తలకోన జలపాతం ఉంది. 270 అడుగుల ఎత్తు నుండి జారిపడే జలధారలు చూడటం ఐఫీస్ట్ అనడంలో సందేహం లేదు. తిరుపతి పట్టణానికి 68 కిలోమీటర్ల దూరంలో తలకోన జలపాతం ఉంది. వర్షాకాలంలో తలకోన జలపాతం సందర్శన బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే పనిలో పనిగా తలకోన వాటర్ ఫాల్స్ ని కూడా టూర్ ప్లాన్ లో చేర్చుకోండి..

తెలంగాణ 

అనంతగిరి హిల్స్: మూసీ నది జన్మస్థానం చూడాలనుకుంటే… మీరు అనంతరగిరి హిల్స్ కి వెళ్లాల్సిందే. అందుబాటులో ఉన్న బెస్ట్ టూరింగ్ స్పాట్స్ లో అనంతగిరి హిల్స్ ఒకటి. హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీనది ఈ కొండల్లోనే పుట్టింది. పొగమంచుతో కూడిన దట్టమైన అడవులతో అనంతగిరి హిల్స్ ఆహ్లాదంగా ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం మరొక ఆకర్షణ. హైదరాబాద్ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉన్నాయి. వికారాబాద్ నుంచి సులభంగా చేరుకోవచ్చు.

భోగత జలపాతం: దీన్ని నయాగరా ఆఫ్ తెలంగాణ అని పిలుచుకుంటారు. ములుగు జిల్లాలో ఉన్న భోగత జలపాతం టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి. వర్షాకాలంలో ఈ జలపాతం ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నేచర్ లవర్స్ మనసులు దోచుకుంటుంది అనడంలో సందేహం లేదు. ములుగు నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో భోగత జలపాతం ఉంది.

లక్నవరం సరస్సు: వరంగల్ కి 70 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 200 కిలోమీటర్ల దూరంలో లొకేటై ఉంది లక్నవరం సరస్సు. కాకతీయులు 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. 10000 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ సరస్సులో 13 చిన్న చిన్న దీవులు ఉన్నాయి. 160 మీటర్ల పొడవుతో మూడు దీవులను సంధానం చేసే సస్పెన్షన్ బ్రిడ్జ్ పై విహరించవచ్చు. హోటల్ స్టేతో పాటు బోటింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం… తక్కువ బడ్జెట్ తో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ టూరింగ్ స్పాట్స్ లో విహరించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకోండి.

Leave a Comment