నిత్యావసర ధరలు పెరిగితే ఏం చేయాలి? సూపర్ టిప్స్!

నిత్యావసర వస్తువుల ధరలు మధ్యతరగతి, పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయి. బియ్యం, పప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియాలో పైకి ఎగబాకుతున్న ఇన్ఫ్లేషన్ రేట్ ఆందోళన కలిగిస్తుంది. ఆగస్టు 2026 నాటికి వార్షిక ద్రవ్యోల్బణం 4.82%కి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆహార పదార్థాలు, పానీయాల విషయంలో ఇది 5.95%గా ఉంది. ఇక ఇంధనం, టోకు వస్తువుల విషయంలో ఏకంగా 9.92%కి చేరింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది.

నిత్యావసర ధరలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఫ్యామిలీ బడ్జెట్ నిర్వహణ మధ్య తరగతి, పేద వర్గాల వారికి సవాలుగా మారింది. ఆదాయం పరిమితంగా ఉండి ధరలు పెరగడం వలన ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతున్నప్పుడు పొదుపు చిట్కాలు పాటించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అవసరమైన కొన్ని సూచనలు ఈ కథనంలో పొందుపరచాను…

నెలవారీ బడ్జెట్ ప్లానింగ్

ఆర్థిక భారంగా మారిన ధరల పెరుగుదలను ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధమైన నెలవారీ బడ్జెట్ తప్పనిసరి.

ఆదాయం-ఖర్చుల లెక్కింపు: మీరు ఉద్యోగులైనా, వ్యాపారులైనా మరే ఇతర వృత్తిలో ఉన్నా… నెలకు వచ్చే ఆదాయం, భరించాల్సిన ఖర్చులను స్పష్టంగా నోట్ చేసుకోండి. వాటిలో కరెంట్ బిల్, రెంట్, ఈఎంఐ, పిల్లల ఫీజులు, మెడిసిన్ వంటి తప్పనిసరి ఖర్చులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అత్యవసర ఖర్చులను మనం అవైడ్ చేయలేమని గుర్తించుకోండి.

50-30-20 రూల్: సమర్థవంతమైన ఆర్థిక అంశాల నిర్వహణకు 50-30-20 రూల్ ఉపయోగపడుతుంది. మీ ఆదాయంలో 50% నిత్యావసరాలకు, తప్పనిసరి ఖర్చులకు కేటాయించండి. 30% ఆదాయాన్ని ఇతర అవసరాలకు వినియోగించండి. మిగిలిన 20% ఆదాయాన్ని ప్రతి నెలా పొదుపు చేయండి. ఇలా చేయడం వలన అప్పుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ని సైతం ఎదుర్కొనేందుకు ఖాతాలో సేవింగ్స్ ఉంటాయి.

కిరాణా -కూరగాయల కొనుగోళ్లలో జాగ్రత్తలు 

నెలవారీ ఆదాయంలో అధిక భాగం ఆహారానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీవించాలంటే తినాలి కాబట్టి బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు వంటి కిరాణా, వెజిటబుల్స్ కొనాల్సిందే. కిరాణా-కూరగాయల కొనుగోళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

జాబితా సిద్ధం చేయండి: మార్కెట్ కి వెళ్లే ముందు ఇంట్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కేవలం లిస్ట్ లో ఉన్న వస్తువులను మాత్రమే కొనండి. మార్కెట్ లో కనిపించాయని అవసరం లేకపోయినా లిస్ట్ లో లేని వస్తువులను కొనవద్దు. సూపర్ మార్కెట్స్ లో కనిపించే రకరకాల ఐటమ్స్ మీ మనసు గతి తప్పేలా చేస్తాయి. అవసరం లేకున్నా కొనేందుకు ప్రేరేపిస్తాయి.

హోల్ సేల్ మార్కెట్లు: నిత్యావసర వస్తువులను హోల్ సేల్ మర్కెట్స్ లో నెలకు సరిపడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. దాని వలన 15% నుంచి 20% వరకు ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రైతు బజార్లలో తాజా కూరగాయలు తక్కువ ధరలకు లభిస్తాయి.

సీజనల్ కూరగాయలు, పండ్లు: సీజనల్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మార్కెట్ లో తక్కువ ధరలకు లభిస్తాయి. సదరు సీజన్లో పండే కూరగాయలు, పండ్లు అధిక మొత్తంలో సప్లై అవుతాయి. దాంతో డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు కొనండి. నాన్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొనడం తగ్గించండి.

విద్యుత్-ఇంధన పొదుపు 

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. విద్యుత్ చార్జీలను నియంత్రించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చు.

విద్యుత్ ఆదా: విద్యుత్ వృధా చేయకుండా పొదుపుగా వాడండి. అవసరం లేకున్నా గదుల్లో ఫ్యాన్స్, లైట్స్ వేసి వదిలేయడం చేయకండి. LED బల్బులను మాత్రమే వాడండి. స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ గృహోపకరణాలు మాత్రమే వాడండి. కుటుంబ సభ్యులు ఎర్లీగా పడుకుంటే… విద్యుత్ ఆదా కావడంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

ఇంధన ఆదా: తక్కువ దూరాలకు వాహనాలు వినియోగించకండి. సరదాగా కాలిన నడకన వెళ్ళండి. లేదా సైకిల్ వాడటం అలవాటు చేసుకోండి. ఒకే ఆఫీస్ లో పనిచేసే వ్యక్తులు ఒకే కారులో ఆఫీస్ కి వెళ్ళండి. వారంలో రెండు మూడు రోజులు ప్రజా రవాణా ఉపయోగించండి. బస్సుల్లో ప్రయాణించండి. ఈ చిట్కాల ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు.

అవుట్ సైడ్ ఫుడ్ అవైడ్ చేయండి 

ఇంటి వంటకు ప్రాధాన్యత: వారంలో రెండు మూడు పర్యాయాలు రెస్టారెంట్స్ లో తినడం, ప్రతిరోజూ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం మానుకోండి. మీకు తెలియకుండానే బయట ఫుడ్ కోసం వేలల్లో ఖర్చు చేస్తున్నారని గ్రహించండి.

OTTలకు చెక్ పెట్టండి: చాలా మందికి ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలన్నీ చూసే సమయం ఉండదు. కానీ నాలుగైదు ఫ్లాట్ ఫార్మ్స్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. కాబట్టి మీరు సరిగా చూడని ఓటీటీల సబ్స్క్రిప్షన్ వదిలేయండి.

అత్యవసర నిధి 

ఎమర్జెన్సీ ఫండ్: ప్రతినెలా తప్పకుండా మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని అత్యవసర నిధి కోసం పొదుపు చేయండి. అనుకోకుండా ఎదురయ్యే మెడికల్ ఖర్చులు, ధరల పెరుగుదల వలన కలిగే అదనపు ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది.

Leave a Comment