భారతీయ సాంప్రదాయంలో పెళ్లి అత్యంత పవిత్ర కార్యం. దంపతులు ఇరువురు సుఖ సంతోషాల్లో, కష్ట నష్టాల్లో… వందేళ్లు కలిసి ప్రయాణం చేస్తామని ప్రమాణం చేస్తారు. నేటి సమాజంలో భార్య భర్తల బంధం మసకబారుతుంది. ఇరువురి మధ్య ప్రేమానురాగాలు పలుచబడుతున్నాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం, గౌరవం, ఆప్యాయత కరువవుతున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం తమ పార్టనర్స్ పై దాడులు చేస్తున్నారు. శాశ్వతంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గృహ హింసకు ఈ మధ్య అర్థం మారింది. భర్తలను వేధించే భార్యల సంఖ్య నానాటికి అధికం అవుతుంది. భార్యల ప్రవర్తన, వేధింపులు, అవమానకర చర్యలు, విడాకుల సెటిల్మెంట్స్ మగాళ్లను మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. భర్తలపై భార్యల దాడులు, హత్యలు, హత్యాయత్నాల వివరాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. అధికారికంగా నమోదైన హత్యల వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే.
ఏకం ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం… ఏడాది కాలంలో దేశంలో 554 మంది భర్తలు తమ భార్యల చేతిలో చంపబడ్డారు. అత్యధికంగా 194 హత్యలకు కారణం వివాహేతర సంబంధాలు. ఇక ఆంధ్రప్రదేశ్ లో సైతం ఈ తరహా హత్యలు పెద్ద మొత్తంలో చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో రోజుకు ఇద్దరు భర్తలు చంపబడుతున్నారని అంచనా. అనధికారికంగా లెక్కల్లోకి రాని నేరాలు ఎన్నో ఉన్నాయి. క్షణికావేశంలో కొందరు, ప్రణాళిక ప్రకారం మరికొందరు మహిళలు భర్తలను హత్య చేస్తున్నట్లు సమాచారం.

కారణాలు
వ్యసనాలు: చెడు అలవాట్లకు బానిసలైన భర్తలను భార్యలు శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటున్నారు. ముఖ్యంగా మద్యం మత్తులో భార్యలను శారీరకంగా హింసిస్తున్న భర్తలు భార్యల చేతిలో హతం అవుతున్నారు. ఆల్కహాలిక్ హస్బెండ్స్ డబ్బుల కోసం వేధిస్తారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వేధింపుల వలన మహిళలు చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్స్, డ్రగ్స్ వంటి వ్యసనాలు సైతం నేరాలకు దారితీస్తున్నాయి.
వివాహేతర సంబంధాలు: కొత్తగా ఏర్పడిన సోషల్ మీడియా పరిచయాలు, పెళ్లి తర్వాత కూడా ప్రియుళ్ళతో కొనసాగుతున్న రిలేషన్స్, నైబర్స్, కొలీగ్స్ తో స్నేహాలు… వివాహేతర సంబంధాలకు పురిగొల్పుతున్నాయి. ఒక దశకు చేరాక, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తలను వదిలించుకోవాలని భార్యలు భావిస్తున్నారు. కొన్ని కేసుల్లో అమాయకులైన చిన్నారులు కూడా బలి అవుతున్నారు. అశాశ్వతమైన ఆనందం, బంధాల కోసం బంగారం లాంటి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
ఆర్థిక విషయాలు: ఆర్థికపరమైన విషయాలు కూడా భర్తలపై భార్యల అఘాయిత్యాలకు ఆజ్యం పోస్తున్నాయి. భర్త మరణం అనంతరం ఆస్తులు, పెన్షన్, ఇన్సూరెన్స్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ భార్యకు సమకూరుతాయి. ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొంది, ఆంక్షలు లేని ఆడంబర జీవితం గడిపేందుకు హత్యలు చేస్తున్న భార్యలను సమాజంలో చూస్తున్నాం.
కుటుంబ వివాదాలు: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అత్యంత సహజం. ఈ గొడవలు తారాస్థాయికి చేరిన క్రమంలో హత్యలు చోటు చేసుకుంటున్నాయి. అనాలోచితంగా చేసే దాడులు ప్రాణాలు తీస్తున్నాయి. అనుమానాలు, అభిప్రాయ బేధాలు, స్వేచ్ఛ వంటి అంశాల విషయంలో మహిళలు కాంప్రమైజ్ కావడం లేదు.
కాబోయే భర్తల హత్యలు: పూణేలో జరిగిన సియా గోయల్ కేసు దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మరొక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న సియా గోయల్ పెద్దల అభిప్రాయం మేరకు మరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. లోహ్ గడ్ కోటకు నమ్మించి తీసుకెళ్లి… ప్రియుడితో పాటు కాబోయే భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. గతంలో కూడా ఈ తరహా నేరాలు వెలుగు చూసిన నేపథ్యంలో… భర్తలకే కాదు కాబోయే వారికి కూడా రక్షణ లేదని తెలుస్తుంది.
నోట్: ఈ కథనం కేవలం సామాజిక అవగాహన పెంపొందించేకు మాత్రమే. నేరాలను ప్రోత్సహించే ఉద్దేశం ఏ మాత్రం కాదు. హత్య చట్టరీత్యా నేరం. కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇక ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వివాహ బంధంలో సమస్యలు ఏర్పడితే అనేక శాంతియుత మార్గాలు ఉన్నాయి. ఓ హత్యానేరం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.
