చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి? 

 

చలికాలం తనతో పాటు కొన్ని రుగ్మతలు పట్టుకొస్తుంది. దగ్గు, జలుబు, శ్వాసలో ఇబ్బంది, ఫ్లూ, చర్మం-పెదాలు పొరబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చలికాలం వస్తుందంటే ఆస్తమా రోగులు హడలి పోతారు. చలికాలంలో ఉష్టోగ్రతలు తగ్గుముఖం పడతాయి. చల్లని గాలులు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం ద్వారా వింటర్ లో తలెత్తే అనారోగ్య సమస్యలను ఎదిరించవచ్చు.

చలికాలంలో శరీరానికి తగిన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. కాగా మన వంటింట్లో దొరికే బెల్లం చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ఒకటి. చలికాలంలో బాధించే కొన్ని రుగ్మతలకు బెల్లం చక్కని పరిష్కారం. పూర్వం నుండి మన పెద్దలు బెల్లంని ఆహారంలో భాగం చేసుకున్నారు. బెల్లం తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి? బెల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటీ? ఎవరు, ఎంత మోతాదులో తినాలి? వంటి విషయాలు ఈ కథనంలో చర్చిద్దాం…

చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?

బెల్లంలో శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బెల్లం కలిగి ఉంది. చక్కెరతో పోల్చితే బెల్లంలో పోషకాలు ఒకింత అధికం. చలికాలంలో శరీరానికి శక్తిని అందించడానికి బెల్లం సహాయపడుతుంది. అయితే బెల్లంలో చక్కెర పాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని  అప్పుడప్పుడు మితంగా తీసుకోవాలి.

బెల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటీ?

తక్షణ శక్తిని అందిస్తుంది: బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్, సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే శరీరానికి సత్తువ లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: భోజనం తర్వాత కొంచెం బెల్లం తినడం తెలుగువారి విందు సాంప్రదాయంలో భాగంగా ఉంది. తిన్న భోజనం త్వరగా అరిగేందుకు బెల్లం సహాయం చేస్తుందని ఆయుర్వేద వైద్యం చెబుతుంది. బెల్లం నోట్లో వేసుకోవడం వలన లాలాజలం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ద్రవాలను బెల్లం స్రవింప చేస్తుందని అంటారు. అయితే దీనికి శాస్త్రీయత మాత్రం లేదు.

ఐరన్ లభిస్తుంది: బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించడంలో తోడ్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు రోజూ బెల్లం తినడం ఉత్తమం. అయితే బెల్లం తినడం మాత్రమే రక్తహీనత సమస్యకు పరిష్కారం కాదని గ్రహించాలి.

ఖనిజాలు అందిస్తుంది: బెల్లంలో శరీరానికి అవసరమైన కాల్షియం, పాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు కొద్ది మొత్తంలో లభిస్తాయి. శరీరం చేసే పలు విధులకు ఈ ఖనిజాలు అవసరం.

రోజుకు ఎంత బెల్లం తినాలి? 

బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తినడం సరికాదు. బెల్లంలో క్యాలరీలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యవంతులైన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు 5 గ్రాముల చిన్న ముక్క తినండి. అయితే ఇది అందరికీ వర్తించే పరిమాణం కాదని గ్రహించాలి. రోజంతా మనం టీ, కాఫీల రూపంలో తీసుకునే చక్కెరను సైతం పరిమాణంలోకి తీసుకోవాలి.

బెల్లాన్ని ఎలా తీసుకోవాలి? 

  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం చిన్న బెల్లం ముక్క తినవచ్చు. బ్రేక్ ఫాస్ట్ త్వరగా డైజెస్ట్ అయ్యేందుకు సహాయపడుతుంది.
  • రాగి జావ, సజ్జ జావ, వంటి ఆహారాల్లో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకోవడం ఉత్తమం. చక్కెరతో పోల్చితే బెల్లం శరీరానికి మేలు చేస్తుంది.
  • బెల్లం పాకంగా చేసి నువ్వులు, వేరుశనగలతో ఉండలు చేసుకుని తినవచ్చు. ఇది బలవర్థకమైన ఆహారం. పిల్లలు, పెద్దలు తినవచ్చు.
  • పాలలో చక్కెరకు బదులు బెల్లం కలుపుకొని తాగడం మంచిది. వేడి నీళ్లలో బెల్లం కలుపుకుని తాగొచ్చు.
  • పల్లీలు(వేరుశనగలు)వేయించిన వేరుశనగలు కొందరు ఇష్టంగా తింటారు. వేరుశనగలు తిన్న అనంతరం బెల్లం తినడం మంచిది.

ఎవరు బెల్లం తినకూడదు?

మధుమేహం(డయాబెటిస్)తో బాధపడేవారు బెల్లం తినకపోవడమే మంచిది. బెల్లం సహజమైనది అయినప్పటికీ మధుమేహ రోగులకు కీడు చేసే ఆస్కారం ఉంది. బెల్లం సైతం శరీరంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడేవారు బెల్లం తినకూడదు. బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్ బరువు పెరుగుదలకు దారితీస్తాయి.

డయాబెటిస్ రోగులు, ఊబకాయులు… వైద్యుల సలహా మేరకు మాత్రమే బెల్లం తినాలి. అలాగే పళ్ళ సమస్యలతో బాధపడేవారు కూడా బెల్లం, తీపి పదార్థాలు వినియోగాన్ని తగ్గించాలి.

చలికాలంలో బెల్లం పరిమితంగా తినొచ్చు. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో తీసుకోవచ్చు బెల్లంలో ఉండే కార్బోహైడ్రేట్స్, ఖనిజాలు చలికాలంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అదే సమయంలో బెల్లం అధిక మొత్తంలో తినకూడదు. మధుమేహ రోగులు, ఊబకాయులు, పంటి సమస్యలు ఉన్నవారు బెల్లం వినియోగించకపోవడం ఉత్తమం.

 

Leave a Comment