ఈ ఆధునిక జీవనంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో రోజంతా అలసటగా ఉండటం ఒకటి. రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయినా ఉదయం నిద్ర లేవగానే నీరసంగా అనిపించడం, రోజంతా ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం, తరచూ ఆవలింతలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు ఉన్నవారు పనిలో ఏకాగ్రత చూపలేరు. మెదడు చురుకుగా ఉండదు. లక్ష్యాలు సాధించడంలో విఫలం అవుతారు.
చాలామంది దీనిని పని ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యగా భావించి పట్టించుకోరు. అయితే తగినంత సమయం నిద్రపోయినా అలసటగా ఉండటానికి నిద్ర నాణ్యత తగ్గడం నుంచి కొన్ని ఆరోగ్య సమస్యల వరకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటి కనుగొని అలసటను దూరం చేసుకోవడం ఆవశ్యకం. అసలు ఈ సమస్యకు కారణాలేంటి? దీని నుంచి బయటపడటం ఎలా? తెలుసుకుందాం.

1. నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం
ఎనిమిది గంటలు పడుకున్నంత మాత్రాన శరీరానికి పూర్తి విశ్రాంతి లభించినట్లు కాదు. నిద్ర మధ్యలో పదేపదే మెలకువ రావడం, గాఢ నిద్ర దశలు సరిగా లేకపోవడం వల్ల ఉదయం అలసటగా అనిపిస్తుంది. పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడటం, టీవీ చూడటం కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ల్యాప్ ట్యాప్ స్క్రీన్ గంటల తరబడి చూడటం క్వాలిటీ నిద్రను దూరం చేస్తుంది.
2. స్లీప్ అమ్నీషియా సమస్య
నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోవడం, మళ్లీ ప్రారంభం కావడాన్ని స్లీప్ అమ్నీషియా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో ఉలిక్కిపడి మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగటిపూట తీవ్రమైన నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎనిమిది గంటలు నిద్రపోయినా శరీరానికి సరైన విశ్రాంతి లభించకపోవచ్చు. స్లీప్ అమ్నీషియా రుగ్మత శరీరానికి హాని చేస్తుంది.
3. శరీరంలో పోషకాల లోపం
ఐరన్, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు తగినంతగా అందకపోతే అలసట, నీరసం, కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడి శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీనివల్ల త్వరగా అలసిపోవడం జరుగుతుంది.
4. థైరాయిడ్, మధుమేహం సమస్యలు
థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గడం వల్ల జీవక్రియ మందగించి అలసట, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోయినా నీరసం, దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి సమస్యలు ఎదురవుతాయి.
5. మానసిక ఒత్తిడి కూడా కారణమే!
ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన, ఉద్యోగ ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పటికీ మెదడుకు తగిన విశ్రాంతి లభించకపోవచ్చు. ఫలితంగా రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.
అలసటను తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు
నిద్ర వేళలు పాటించండి: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణతో కూడిన నిద్రతో ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి మనిషికి రోజుకు 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.
మొబైల్కు దూరంగా ఉండండి: నిద్రపోయే ముందు కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు లాప్ ట్యాప్, ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. అర్థరాత్రి వరకు స్క్రీన్స్ చూసే అలవాటు మానుకోండి.
పోషకాహారం తీసుకోండి: ఆకుకూరలు, పండ్లు, పప్పుధాన్యాలు, గుడ్లు, నట్స్ వంటి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం మీ నిద్ర నాణ్యతను పెంపొందిస్తుంది.
వ్యాయామం చేయండి: ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వలన శరీరం అలసిపోతుంది. త్వరగా నిద్రపడుతుంది.
నీరు తగినంత తాగండి: శరీరంలో నీటి శాతం తగ్గినా అలసట, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే రోజంతా తగినంత నీరు తాగాలి. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి.
ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
తగినంత నిద్ర, మంచి ఆహారం, వ్యాయామం పాటించినప్పటికీ కొన్ని వారాల పాటు అలసట కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి రక్తహీనత, థైరాయిడ్, మధుమేహం, విటమిన్ లోపాలు వంటి సమస్యల కోసం పరీక్షలు సూచించవచ్చు. గురకతో పాటు నిద్రలో శ్వాస ఆగుతున్నట్లు అనిపిస్తే కూడా వైద్య సలహా తీసుకోవాలి.
ఎనిమిది గంటలు నిద్రపోయినా రోజంతా అలసటగా ఉండటాన్ని సాధారణ సమస్యగా తీసుకోకూడదు. నిద్ర నాణ్యత, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇలా అనేక అంశాలు దీనికి కారణం కావచ్చు. క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటూ, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. గుర్తుంచుకోండి.. ఆరోగ్యకరమైన జీవితం కోసం నిద్ర సమయంతో పాటు నిద్ర నాణ్యత కూడా ఎంతో ముఖ్యం.
