హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా ఉంది. ఉపాధి, వనరుల లభ్యత వంటి అనుకూలతల రీత్యా దేశం నలుమూలల నుండి హైదరాబాద్ కి జనాలు వలస వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెడుతుంది. దేశంలోని ఆరు ప్రధాన ఆర్థిక నగరాల్లో హైదరాబాద్ కి స్థానం దక్కింది. ఐటీ, పారిశ్రామిక, మౌలిక వసతుల వృద్ధితో హైదరాబాద్ జనాభా కోటికి పైగా చేరింది. పట్టణీకరణ కారణంగా హైదరాబాద్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి కొరత.
వర్షాకాలంలో సైతం నీటి కొరత వేధిస్తోంది. నగరవాసులు నీటి అవసరాల కోసం ట్యాంకర్స్ మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవనాధారమైన నీటి సంక్షోభం ఏర్పడితే నగర మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. భవిష్యత్ లో హైదరాబాద్ వాసులు నగరాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రపంచ నాగరికతలను పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టం అవుతుంది. అసలు హైదరాబాద్ లో నీటి కొరతకు కారణాలు ఏమిటీ? భవిష్యత్ లో ఎదురుకానున్న సమస్యలు ఏమిటీ? పరిష్కార మార్గాలు ఏమిటీ? ఈ స్టోరీలో చూద్దాం..

నీటి కొరతకు ముఖ్య కారణాలు – పరిష్కార మార్గాలు
సహజ నీటి వనరులు-చెరువుల ఆక్రమణ: డిమాండ్ రీత్యా హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. ఈ కారణంగా సహజ నీటి వనరులైన చెరువులు, కుంటలు దురాక్రమణకు గురయ్యాయి. చెరువుల నగరమైన హైదరాబాద్ లోని వందల చెరువుల్లో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు వెలిశాయి. దీంతో సహజ వనరులు కనుమరుగయ్యాయి. భూమిలోకి చేరాల్సిన నీరు వృధా అవుతుంది. రియల్ ఎస్టేట్ మాఫియా హైదరాబాద్ లో నీటి కష్టాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
మితిమీరిన భూగర్భజలాల వినియోగం: జనాభా పెరుగుదలతో నగరంలో నీటి వినియోగం సైతం పెరిగింది. ప్రజా అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు రోజుకు లక్షల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. ఇక నగర శివారుల్లో, ఎత్తైన అపార్ట్మెంట్స్ వర్గాల్లో రోజువారీ నీటి వినియోగానికి బోర్ వెల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.
వాతావరణ మార్పులు-ఋతుపవనాల అనిశ్చితి: వర్షాలు సకాలంలో పడక పోవడం వలన హైదరాబాద్ కి నీటిని సరఫరా చేసే జలాశయాలు ఆశించిన స్థాయిలో నిండడం లేదు. మంజీరా, సింగూరు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. దాంతో పూర్తి స్థాయిలో జలాశయాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. వాతావరణ మార్పులు, ఋతుపవనాల అనిశ్చితి ఇందుకు కారణం అవుతున్నాయి.
నీటి వృధా-నిర్వహణ లోపాలు: ఓ వైపు నీటి కొరతతో జనాలు అల్లాడుతుంటే నిర్వహణ లోపాల కారణంగా కొంత మేర నీరు వృధా అవుతుంది. వాటర్ పైప్ లైన్ల లీకేజీలు, పాత పడిన పైప్ లైన్స్ వలన పెద్ద మొత్తంలో మంచి నీరు వృధా అవుతుంది.
భవిష్యత్ లో తలెత్తే సమస్యలు
తీవ్రమైన నీటి సంక్షోభం(Day Zero): వర్షపాతం క్రమంగా తగ్గి, భూగర్భ జలాలు అడుగంటితే సంక్షోభం తప్పదు. డే జీరో పరిస్థితి రావచ్చు. దక్షిణాఫ్రికా లోని కేఫ్ టౌన్ నగరం మాదిరి హైదరాబాద్ డే జీరో సంక్షోభం చూడవచ్చు. ఇప్పటికే పర్యావరణ నిపుణుల్లో ఈ భయం మొదలైంది.
నీటి ట్యాంకర్స్ పై ఆధారపడడం: జలమండలి అందించే నీరు లభించక, జనాలు నీటి టాంకర్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వలన అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నగరంలో డైలీ వేల ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. ఆ ట్యాంకర్స్ సైతం సకాలంలో నీటిని అందించడం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రజారోగ్య సమస్యలు: నీటి కొరత ప్రజారోగ్య సమస్యలకు సైతం దారి తీస్తుంది. శుభ్రమైన తాగునీరు లభించక ప్రజలు కలుషిత నీటిని వినియోగించాల్సి రావచ్చు. దాంతో నీటి ద్వారా వ్యాపించే కలరా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.
పారిశ్రామిక రంగం కుదేలు: నీటి కొరత సుదీర్ఘకాలం కొనసాగితే పరిశ్రమలు, ఐటీ కంపెనీల నిర్వహణ కష్టతరం అవుతుంది. ఉన్న పరిశ్రమలు మూత పడవచ్చు. అలాగే ఇతర రాష్ట్రాలకు తరలిపోవచ్చు. భవిష్యత్ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది.
పరిష్కార మార్గాలు
వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి భవనం, అపార్ట్మెంట్స్ లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి.
చెరువులను పునరుద్ధరించాలి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. చెరువులలో పూడికలు తీయించడం, సరిహద్దులు కాపాడడం చేయాలి.
మురుగు నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు, నిర్మాణ రంగానికి, గార్డెనింగ్ కి ఉపయోగించాలి. తాగునీటిపై ఒత్తిడి తగ్గించాలి.
నీరు వృధా కాకుండా స్మార్ట్ వాటర్ మీటర్లు, సెన్సార్ల ద్వారా పైప్ లైన్ లీకేజీలను వీలైనంత త్వరగా అరికట్టాలి.
హైదరాబాద్ నీటి సంక్షోభం నుండి బయటపడాలి అంటే కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. నీటిని పొదుపుగా వాడాలి. తమ వంతు చర్యగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీటి ఒడిసిపట్టి వినియోగించుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా ఎందరికో ఉపాధి చూపుతున్న హైదరాబాద్ ని కాపాడుకోవచ్చు.
