రోజూ రాగిజావ తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

శతాబ్దాలుగా భారతీయుల ఆహారంలో రాగులు భాగం అయ్యాయి. దీనిని ఒక సాంప్రదాయ సూపర్ ఫుడ్ గా భావిస్తారు. రాగుల్లో ఉండే పోషకాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి. మారిన జీవనశైలి కారణంగా జనాలు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఉదయాన్నే కాఫీ, టీ తాగే అలవాటుకు స్వస్తి చెబుతున్నారు. హెల్త్ కాన్షియస్ పెరగడంతో రాగి జావ తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు.

మరి ప్రతిరోజూ రాగి జావ తాగవచ్చా? దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటీ? పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? డైట్ ఎక్స్పర్ట్స్, వైద్యుల సూచనలు ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

రోజూ రాగి జావ తాగవచ్చా?

దీనికి సమాధానం అవుననే చెప్పాలి. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతిరోజూ తగు మోతాదులో రాగి జావ తాగొచ్చు. రాగి జావ శరీరానికి మేలు చేస్తుంది. రోజంతా మనల్ని యాక్టీవ్ గా ఉంచుతుంది. శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే రాగి జావ తాగడం మంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు.

రాగి జావ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

ఎముకలు దృఢంగా మారతాయి: ఇతర ధాన్యాలతో పోల్చుకుంటే రాగుల్లో కాల్షియం పరిమాణం పెద్ద మొత్తంలో ఉంటుంది. క్రమం తప్పకుండా రాగి జావ తాగడం వలన శరీరానికి కాల్షియం సమకూరుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. ఎముకల బలహీనతను రాగి జావతో అధిగమించవచ్చు. బాల్యం నుండే రాగి జావను తాగడం అలవాటుగా మార్చుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. వారి ఎముకలు దృఢంగా తయారవుతాయి.

బరువు తగ్గడానికి సహకరిస్తుంది: రాగుల్లో ఫైబర్(పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. రాగి జావ తాగితే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో చిరు తిండ్లు తినాలనే కోరిక దూరం అవుతుంది. ఆకలిని నియంత్రణలో ఉంచడం వలన చిరు తిండ్లతో శరీరంలో చేరే అనవసరమైన కేలరీలకు అడ్డుకట్ట పడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారికి రాగి జావ మంచి ప్రయోజనకారి అనడంలో సందేహం లేదు. ఊబకాయంతో బాధపడేవారు రాగి జావను తాగడం అలవాటుగా మార్చుకోవాలి.

మధుమేహం(షుగర్) నియంత్రణ: రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) తక్కువగా ఉంటుంది. దీని వలన రక్తంలో రక్తంలో గ్లోకోజ్ స్థాయిలు అమాంతంగా పెరగవు. షుగర్ తో బాధపడేవారు ఉప్పు లేదా మజ్జిగతో కలిపి రాగి జావ తాగడం వలన షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. షుగర్ రోగులకు రాగి జావ చక్కని పరిష్కారం.

రక్తహీనత(ఎనీమియా)నివారణ: రాగులలో ఉండే ఐరన్… రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ రాగి జావ తాగడం శ్రేయస్కరం. రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది: రాగులలోని పీచు పదార్థం మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుంది. దీని వలన జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. రాగి పిండిని పులియబెట్టి అంబలిలా చేసి తాగితే కడుపులోని మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్)వృద్ధి చెందుతుంది. మెటబాలిజం అభివృద్ధికి దోహదం చేస్తుంది.

చర్మం-జుట్టు సంరక్షణ: రాగి జావ తాగడం వలన శరీరానికి అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్స్ సమకూరుతాయి. ఇవి చర్మంపై ఏర్పడే ముడతలను నియంత్రిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా మారుతుంది.

రాగి జావ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాగి జావ వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు సూచించిన ఆ జాగ్రత్తలు ఏమిటంటే…

మలబద్ధకం-గ్యాస్ సమస్యలు: రాగుల్లో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. ఈ కారణంగా త్వరగా జీర్ణం అవ్వక, మలబద్ధకం రావొచ్చు. గ్యాస్ సమస్యలకు కూడా దారితీయవచ్చు. అందుకే రాగి జావ ఎక్కువ మోతాదులో తాగ కూడదు. రోజుకు 1 నుండి 2 గ్లాసుల రాగి జావ సరిపోతుంది.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు: థైరాయిడ్ తో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే రాగి జావను ఆహారంగా తీసుకోవాలి. రాగులలో గోయిట్రోజెన్స్ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ రోగులు జాగ్రత్త వహించాలి.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు: రాగులలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు అతిగా రాగి జావ తాగకూడదు. సమస్య అధికమయ్యే ప్రమాదం ఉంది.

పంచదార వాడకం తగ్గించాలి: తీపి కోసం రాగి జావలో పంచదార, బెల్లం కలుపుకొని తాగడం వలన శరీరానికి పెద్ద మొత్తంలో కేలరీలు అందుతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉప్పు, మజ్జిగ, జీలకర్ర పొడి లేదా ఉల్లిపాయ ముక్కలతో రాగి జావను తీసుకోవాలి.

వేడి చేస్తుంది: రాగి జావ తాగితే వేడి చేస్తుంది. వేసవి కాలంలో రాగి జావను మజ్జిగతో తాగడం ఉత్తమం. మజ్జిగ కలపడం వలన శరీరం చల్లబడుతుంది.

రాగి జావ సహజమైన పోషకాల గని. ప్రతి రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఒక గ్లాసు రాగి జావ తాగితే ఉత్సాహంగా ఉంటారు. రాగి జావ పలు దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతుంది. తక్కువ ఖర్చులో లభించే రాగి జావను ఆహారం తీసుకోవడం అలవర్చుకోవడం ఉత్తమం.

Leave a Comment