మీ పిల్లల దసరా హాలిడేస్ ఇలా ప్లాన్ చేయండి!

పిల్లలకు దసరా పండుగ అంటే చాలా ఇష్టం. సుదీర్ఘంగా వారికి 10 రోజులు సెలవులు వస్తాయి. స్కూల్ లేకపోవడంతో పిల్లలు ఇబ్బందిగా ఫీల్ అయ్యే రోజూ వారి పనులు ఉండవు. ఉదయాన్నే నిద్రలేవాల్సిన అవసరం లేదు. స్నానం చేసి రెడీ అవ్వడం, యూనిఫార్మ్ వేసుకొని స్కూల్ కి వెళ్లడం, రోజంతా క్లాస్ రూమ్ లో గడపడం, హోమ్ వర్క్ చేయడం లాంటి పిల్లలకు నచ్చని పనులకు బ్రేక్ పడుతుంది. దసరా హాలిడేస్ ఫుల్ గా ఎంజాయ్ చేయాలని పిల్లలు భావిస్తారు.

గతంలో దసరా హాలిడేస్ ప్లానింగ్స్ వేరుగా ఉండేవి. మారిన ఆధునిక జీవన శైలి కారణంగా పిల్లలు సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెబుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో రోజంతా మొబైల్ కి అతుక్కుపోతున్నారు. అమ్మ ఫోన్ లేదా నాన్న ఫోన్ తీసుకుని గేమ్స్ ఆడుకోవడం, వీడియోలు చూస్తూ గడిపేస్తున్నాడురు. ఆరుబయట ఆడుకోవడం, పుస్తకాలు చదవడం వంటి మానసిక ఉల్లాసం, తెలివితేటలు పెంపొందించే అలవాట్లకు దూరం అవుతున్నారు.

స్కూల్స్ కి సుదీర్ఘకాలం సెలవులు ప్రకటించిన సమయంలో పిల్లలు మొబైల్ కి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. హాలిడేస్ ముగిశాక సైతం వారిని ఫోన్ అడిక్షన్ వెంటాడే ప్రమాదం ఉంది. అందుకే పది రోజుల పాటు లభించే దసరా హాలిడేస్ ని పేరెంట్స్ ఆరోగ్యకరంగా ప్లాన్ చేయడం ఆవశ్యకం. దసరా సెలవులను కేవలం వినోదం కోసమే కాకుండా వారిలో సృజన, తెలివితేటలు పెంపొందించేలా ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం…

పండుగ అలంకరణలు: పిల్లలను పండుగ వేడుకలు, పనుల్లో భాగం చేయడం ద్వారా వాళ్ళను మొబైల్ కి దూరం చేయవచ్చు. దసరా పండుగ రోజుల్లో బొమ్మల కొలువు చేయడం ఆనవాయితీ. బొమ్మలను అమర్చడం, రంగుల దీపాలు వేలాడదీయడంలో పిల్లల సహాయం తీసుకోండి. వారికి బొమ్మల కొలువు ప్రాశస్త్యం గురించి వివరించండి. అర్థం అయ్యేలా చెప్పండి.

క్రాఫ్ట్ వర్క్స్: పిల్లల్లో సృజన పెంపొందించే కళలు నేర్పండి. ఇంటి అలంకరణ కోసం తయారు చేసే పేపర్ కటింగ్స్, మట్టి ప్రమిదలు తయారు చేయడం, గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేయడం వంటి క్రాఫ్ట్స్ వారితో చేయించండి. పిల్లలను గైడ్ చేయండి. క్రాఫ్ట్స్ పిల్లల్లో ఆసక్తిని, ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తాయి.

సంగీతం, నృత్యం, డ్రాయింగ్: సెలవు దినాల్లో కొత్త విషయాలను నేర్చుకునేలా వారిని ప్రోత్సహించండి. డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్ వంటి ఆర్ట్స్ క్లాస్ లకు పంపండి. మీకు ఇలాంటి కళల్లో ప్రావీణ్యం ఉంటే స్వయంగా శిక్షణ ఇవ్వండి. క్రమంగా వారికి కళల పట్ల మక్కువ పెరుగుతుంది. మొబైల్ వాడకం నుండి డైవర్ట్ అవుతారు.

వంటగదిలో సహాయం: పండుగ దినాల్లో ప్రతి ఇంట్లో పిండి వంటలు, ప్రత్యేకమైన పదార్థాలు తయారు చేస్తారు. మీరు వంట చేసే సమయంలో వారిని ఆహ్వానించండి. చిన్న చిన్న సహాయాలు చేయమని అడగండి. ఇలా చేయడం వలన వంట చేసేందుకు అమ్మ పడే కష్టం వారికి తెలుస్తుంది. ఫుడ్ వేస్ట్ చేయకూడదని స్వయంగా తెలుసుకుంటారు. అలాగే వంటగదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.

బుక్ రీడింగ్: పుస్తకాలు చదవడం మంచి అలవాటు. స్కూల్ సిలబస్ మాత్రమే కాకుండా  విలువలు, మంచి ప్రవర్తన పెంపొందించే పుస్తకాలు చదివించండి. మోరల్ స్టోరీస్, కామిక్స్ చదివేలా ప్రోత్సహించండి. కథలను బాగా ఇష్టపడే పిల్లలు బుక్ రీడింగ్ పట్ల మక్కువ పెంచుకునే అవకాశం ఉంది. బుక్ రీడింగ్ పిల్లల తెలివితేలను పెంపొందిస్తుంది. వీలైతే దగ్గర్లో ఉన్న లైబ్రరీకి వారిని తీసుకెళ్లండి.

స్టోరీ టెల్లింగ్: పిల్లలకు చిన్ననాటి కథలు చెప్పండి. అలాగే భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం ఘట్టాలను కథలుగా చెప్పండి. స్టోరీ టెల్లింగ్ పిల్లల్లో సృజనాత్మకకు దోహదం చేస్తుంది. వారు వినోదాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

ఆటలు: పిల్లలకు మన సాంప్రదాయ క్రీడలు గురించి వివరించండి. ఫోన్ గేమ్స్ కి బదులు దాగుడు మూతలు, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు ఆరుబయట తోటి పిల్లలతో ఆడుకునేలా చూడండి. ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

సాయంత్రం వాకింగ్-సైక్లింగ్: పిల్లలు ఉదయాన్నే నిద్రలేవరు. కాబట్టి వారిని సాయంత్రం కాసేపు వ్యాయామానికి తీసుకెళ్లండి. దగ్గర్లో ఉన్న పార్క్ లో వాకింగ్ చేయించండి. అలాగే సైక్లింగ్ ని పిల్లలు బాగా ఇష్టపడతారు. బాల్యంలోనే వ్యాయామం అలవాటు చేయడం ద్వారా వారికి దాని పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉంది. వ్యాయామం ఒత్తిడిని తగ్గించి చురుకుగా మారుస్తుంది.

తాతయ్య, అమ్మమ్మల ఇంటికి వెళ్ళండి: పండుగ సెలవుల్లో పిల్లలను పల్లెటూళ్ళలో ఉండే బంధువులు, తాతయ్య-అమ్మమ్మల ఇంటికి తీసుకెళ్లండి. దీని వలన మానవ సంబంధాలు, మనుషుల మధ్య అనురాగాలు పెంపొందుతాయి. పల్లెటూళ్లకు వెళ్లడం వలన పిల్లలు ప్రకృతిలో మమేకం అవుతారు.

సంస్కృతి-సాంప్రదాయాలు నేర్పడం: గ్రామీణ వాతావరణంలో పిల్లలు మన సాంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకుంటారు. బంధువులతో కలిసి ఆనందించడం వలన బంధాల విలువలు తెలుస్తాయి.

పైన చెప్పిన విధంగా మీ పిల్లల దసరా హాలిడేస్ ప్లాన్ చేయండి. ఫోన్ అడిక్షన్ కి గురి కాకుండా పిల్లలను కాపాడండి. వారిలో సృజన, విలువలు, సాంప్రదాయం-సంస్కృతి పట్ల అవగాహన పెరిగేలా చర్యలు తీసుకోండి.

Leave a Comment