జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదు. కడుపునిండా భోజనం చేయాలని అనిపించదు. నాలుక సైతం రుచిని కోల్పోతుంది. ఆకలిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు బ్రెడ్, పాలు, ఇడ్లీ వంటి ఆహార పదార్థాలు మాత్రమే ఇస్తారు. జ్వరంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా చికెన్, ఫిష్, మటన్ వంటి మాంసాహారం ముట్టకూడదని అంటారు. అయితే ఇది అవగాహనా రాహిత్యమే అంటున్నారు వైద్యులు. జ్వరంతో బాధపడేవారు చికెన్ తినకూడదు అనే నియమం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినడం మంచిదే, శరీరానికి మేలే జరుగుతుందని వైద్యుల వాదన. పోషకాహార నిపుణుల అధ్యయనాల ప్రకారం జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినడం వలన పోషకాలు అంది, త్వరగా కోలుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఫీవర్ తో బాధపడేవారు చికెన్ తింటే ఏమవుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలు ఈ స్టోరీలో చూద్దాం..

జ్వరంలో చికెన్ తింటే ఏమవుతుంది?
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: చికెన్ అధిక మొత్తంలో ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. చికెన్ తినడం వలన శరీరానికి ప్రోటీన్స్ లభిస్తాయి. దాని వలన శరీరంలో రోగ నిరోధకశక్తిని పెరుగుతుంది. జ్వరం నుండి త్వరగా కోలుకునేందుకు వీలవుతుంది. కాబట్టి జ్వరంలో చికెన్ తినడం ప్రయోజనకరం.
నీరసం తగ్గుతుంది: జ్వరం కారణంగా శరీరం నిస్సత్తువగా మారుతుంది. అలసట, నీరసం వంటి సమస్యలు వేధిస్తాయి. పోషకాలతో కూడిన చికెన్ తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలసట, నీరసం దూరం అవుతాయి. త్వరగా జబ్బు తగ్గుతుంది.
కణాల పునర్నిర్మాణం: జ్వరం కారణంగా శరీరంలో ఇన్ఫెక్షన్స్ చోటు చేసుకుంటాయి. సదరు ఇన్ఫెక్షన్స్ తో శరీరంలోని కణజాలం పోరాడుతుంది. ఈ క్రమంలో కొంత మేర కణజాలం దెబ్బతింటుంది. కోల్పోయిన కణజాలం త్వరగా వృద్ధి చెందేందుకు చికెన్ ప్రోటీన్స్ సహాయపడతాయి. శరీరానికి సరిపడా కణాలు ఉండేలా దోహదం చేస్తుంది.
చికెన్ సూప్: జ్వరానికి మంచి మెడిసిన్
జ్వరంతో బాధపడేవారు చికెన్ తినడం మంచిది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కంటే… చికెన్ సూప్ ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరానికి చికెన్ సూప్ గొప్ప రెమిడీ అంటున్నారు.
హైడ్రేషన్ అందిస్తుంది: జ్వరం కారణంగా శరీరం వేడిగా మారుతుంది. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గి, డీహైడ్రేషన్ కి గురవుతాము. చికెన్ సూప్ శరీరానికి అవసరమైన ద్రవాలను అందిస్తుంది. అలాగే ఎలెక్ట్రోలైట్స్ ని పెంపొందిస్తుంది. కాబట్టి జ్వరానికి నివారణగా చికెన్
సూప్ ని వైద్యులు సూచిస్తున్నారు.
జలుబు, గొంతునొప్పి నుండి ఉపశమనం: చికెన్ సూప్ జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను సైతం దూరం చేస్తుంది. చికెన్ సూప్ లో కొంచెం అల్లం, వెల్లుల్లి వేసి తాగడం వలన ముక్కు దిబ్బడ, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్స్ నయం అవుతాయి. తక్షణ ఉపశమనం లభిస్తుంది.
సులభంగా జీర్ణం: జ్వరంతో బాధపడేవారి జీర్ణక్రియ కొంచెం మందగిస్తుంది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తింటే అరుగుదల సమస్యలు రావొచ్చు. కాబట్టి చికెన్ సూప్ తీసుకోవడం ఉత్తమం. జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి పెంచకుండా… చికెన్ సూప్ సులభంగా జీర్ణం అవుతుంది. కావలసిన పోషకాలు అందిస్తుంది.
చికెన్ ఎలా వండాలి?
జ్వరంలో చికెన్ తినవచ్చు. అయితే రెగ్యులర్ గా తయారు చేసే విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జీర్ణవ్యవస్థ పై ఒత్తిడి పడకుండా సులభంగా అరిగేలా వంటకం ఉండాలి.
మసాలాలు, కారం తగ్గించండి: సాధారణంగా రుచి కోసం చికెన్ కర్రీలో మసాలాలు, కారం, నూనె అధిక మొత్తంలో వేసి తయారు చేస్తాం. జ్వరంతో బాధపడే వారు మాత్రం వీటిని తక్కువ మోతాదులో వేసి వండుకోవాలి. లేదంటే కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
వేపుళ్లను అవైడ్ చేయండి: నూనెలో డీప్ ఫ్రై చేసిన చికెన్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీలు తినకపోవడమే మంచిది.
బాగా ఉడికించాలి: చికెన్ సరిగ్గా, మెత్తగా ఉడికించి మాత్రమే తినాలి. పూర్తి స్థాయిలో ఉడకని చికెన్ తింటే కడుపులో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. జ్వరంలో ఉన్నప్పుడు తగినంత సమయం ఉడికించిన చికెన్ ని తినండి.
బయటి ఆహారం వద్దు: హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తయారు చేసిన చికెన్ తినకండి. కేవలం ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసిన తాజా చికెన్ మాత్రమే తినాలి. బయట చికెన్ తింటే కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
మొత్తంగా… జ్వరంతో బాధపడే వారు చికెన్ తినకూడదు అనేది ఓ అపోహ మాత్రమే. తక్కువ నూనె, మసాలాలు, కారం వేసి తయారు చేసిన తాజా చికెన్ తినడం మంచిది. చికెన్ సూప్స్, చికెన్ ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
