మతిమరుపు చిన్న సమస్యగా కనిపించే పెద్ద ప్రమాదం. మతిమరుపు ఉన్నవారు సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయలేరు. ముఖ్యమైన వస్తువులు, చేయాల్సిన పనులు మర్చిపోవడం వలన విమర్శల పాలవుతారు. ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన 8.8 మిలియన్ పాపులేషన్ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య మగవారిలో(5%) కంటే స్త్రీలలో(9%) అధికంగా ఉందట. అలాగే అర్బన్ పాపులేషన్ తో పోల్చుకుంటే రూరల్ పాపులేషన్ మతిమరుపు సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారట.
మతిమరుపు(Amnesia)కు ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవడం మంచిది. దీర్ఘకాలంలో ఈ మతిమరుపు… అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులకు దారితీయవచ్చు. సమస్య తీవ్రతరం కావచ్చు. అసలు మతిమరుపుకు కారణాలు ఏమిటీ? పరిష్కార మార్గాలు ఏమిటీ? ఈ కథనంలో తెలుసుకుందాం..

మతిమరుపుకి ముఖ్య కారణాలు
వృద్ధాప్యంలో సాధారణంగా మతిమరుపు సమస్య వేధిస్తుంది. అయితే వయసు మాత్రమే కాకుండా దీనికి పలు మానసిక అంశాలు కారణం అవుతున్నాయి.
తలకు గాయాలు: యువకులు అయినప్పటికీ తలకు బలమైన గాయం అయితే మతిమరుపు బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు లేదా ఆటలు ఆడేటప్పుడు తలకు మేజర్ ఇంజ్యూరీ అయితే మెదడు కణజాలం దెబ్బతింటుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోవచ్చు.
వ్యాధులు-ఇన్ఫెక్షన్స్: అల్జీమర్స్, వాస్కులర్ డెమెన్షియా, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు మతిమరుపును కారణం అవుతాయి. ఈ వ్యాధుల వలన మెదడు సామర్థ్యాన్ని కోల్పోతుంది. జ్ఞాపకశక్తి మీద దుష్ప్రభావం చూపుతాయి. అలాగే మెదడుకు సోకే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ జ్ఞాపకశక్తిని నిర్వీర్యం చేస్తాయి. మతిమరుపుకు గురి చేస్తాయి.
విటమిన్ల లోపం: శరీరంలో విటమిన్ బి12, థయామిన్ లోపించినప్పటికీ నరాల వ్యవస్థ బలహీనపడుతుంది. నరాల వ్యవస్థ పట్టుకోల్పోతే మతిమరుపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఒత్తిడి, ఆందోళన: ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. పని ఒత్తిడి, కుటుంబ-వ్యక్తిగత ఇబ్బందులు డిప్రెషన్ కి కారణం అవుతున్నాయి. ఒత్తిడి, డిప్రెషన్… ఏకాగ్రతను పాడు చేస్తాయి. క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనం అవుతుంది. మతిమరుపుగా పరిణామం చెందుతుంది.
చెడు అలవాట్లు: రోజూ అధిక మోతాదులో మద్యం తాగడం, పొగతాగడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి చెడు అలవాట్లు మెదడుకు రక్త ప్రసరణ తగ్గించేస్తాయి. అలా బ్యాడ్ హ్యాబిట్స్ మతిమరుపుకు కారణం అవుతున్నాయి. జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తున్నాయి.
నిద్రలేమి-రుగ్మతలు: శరీరానికి విశ్రాంతి నిద్ర ద్వారా లభిస్తుంది. నిర్ణీత సమయం పాటు ప్రశాంతంగా నిద్రపోతే మెదడు పనితీరు బాగుంటుంది. నిద్రలేమితో పాటు థైరాయిడ్ అసమతుల్యత, కొన్ని రకాల మందుల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తాత్కాలికంగా మతిమరుపు రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
నివారణ మార్గాలు
జీవనశైలిని మార్చుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే మతిమరుపు సమస్యను అధిగమించవచ్చు. మతిమరుపును అధిగమించేందుకు వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
మెదడుకు వ్యాయామం: మన మెదడుకు కూడా వ్యాయామం అవసరం. ఫజిల్స్ పూర్తి చేయడం, సుడోకు ఆడడం, కొత్త భాషలు నేర్చుకోవడం ద్వారా మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది. అలాగే సంగీతం నేర్చుకోవడం, వాయిద్యాలు ప్లే చేయడం కూడా చక్కని పరిష్కారం. మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచడం ద్వారా మతిమరుపుకు చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
పౌష్టికాహారం: ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మీ మెనూలో హెల్తీ డైట్ చేర్చుకోండి. ఆకుకూరలు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, తృణ ధాన్యాలు క్రమం తప్పకుండా తినండి. ముఖ్యంగా విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవైడ్ చేయండి.
క్రమం తప్పకుండా వ్యాయామం: శరీరం, మెదడు చురుకుగా పని చేయాలంటే వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా నడక, యోగా లేదా వ్యాయామం చేయండి. వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణ పెంపొందిస్తుంది. అలాగే ఆక్సిజన్ సరదా పెరుగుతుంది మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపశక్తికి వ్యాయామం దోహదం చేస్తుంది.
ప్రశాంతమైన నిద్ర: నిద్ర శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. అలాగే నిద్రించే సమయంలో మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. మన జ్ఞాపకాలు పదిలంగా మెదడులో ఉండాలి అంటే… గాఢ నిద్ర అవసరం. కాబట్టి రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోవడం ఆవశ్యకం.
స్ట్రెస్ మేనేజ్మెంట్: మతిమరుపు సమస్యను అధిగమించే మరో మార్గం ఒత్తిడి అదుపు చేయడం. ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు: వాహనాలు నడిపేటప్పుడు, క్రికెట్ తో పాటు కొన్ని రకాల గేమ్స్ ఆడేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. అలాగే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలను అదుపులో ఉంచుకోండి.
మతి మరుపు తీవ్రరూపం దాల్చినచో ఆలస్యం చేయకండి. వెంటనే న్యూరాలజిస్ట్ ని కలవండి. రోగ నిర్ధారణ చేసుకొని, ట్రీట్మెంట్ తీసుకోండి.
