మీ సౌకర్యం పర్యావరణానికి హానికరం!

పర్యావరణవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్న జనాల్లో చలనం రావడం లేదు. ప్లాస్టిక్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. మారిన జీవన శైలి ఇందుకు కారణమవుతుంది. గతంలో మార్కెట్ కి ఒక సంచి తీసుకుని వెళ్లే ఆచారం ఉండేది. కొన్న సరుకులను ఆ సంచిలో తెచ్చుకునేవారు. ప్లాస్టిక్ వినియోగం చాలా తక్కువగా ఉండేది. మెల్లగా ఆ కల్చర్ పోయింది. ప్రతి వస్తువును ప్లాస్టిక్ లో చుట్టి ఇవ్వడం జనాలకు వ్యాపారులు అలవాటు చేశారు. ఈ సౌకర్యానికి అలవాటు పడిన సమాజం… ఇంటి నుండి సరుకులకు బ్యాగ్ తీసుకెళ్లే ఆచారం వదిలేశారు.

మార్కెట్ లో పది వస్తువులు కొంటే పది కవర్లు ఇంటికి రావాల్సిందే. ఉప్పు, పప్పు, నూనె… చివరికి కూరగాయలు, పండ్లను కూడా ప్లాసిక్ కవర్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నాయి సూపర్ మార్కెట్లు. అవగాహన లేక కొందరు, అవగాహన ఉన్నా… సౌలభ్యం కోసం ప్లాస్టిక్ ని ప్రతి ఒక్కరూ విరివిగా వినియోగిస్తున్నారు. ప్లాసిక్ గాలి, నీరు, నేలను నాశనం చేస్తుంది. రీసైకిల్ ప్రాసెస్ లో వెలువడే వ్యర్థాలు సైతం ప్రమాదకరం.

తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీలు అగ్నికి ఆజ్యం పోశాయి. నగరవాసులు అడుగు బయటపెట్టకుండానే ప్రతి వస్తువు ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఫుడ్, వెజిటబుల్స్, గ్రాసరీస్… ఒక్కటేంటి మీరు కోరుకున్నది ఒక మొబైల్ క్లిక్ తో డోర్ దగ్గరకు వచ్చేస్తుంది. కస్టమర్ కి వస్తువులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా చేర్చాలి. ఈ క్రమంలో ప్యాకింగ్ కోసం పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నాయి సంస్థలు. క్విక్ కామర్స్ పేరిట జరుగుతున్న ఈ వ్యవహారం పర్యావరణం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోజుకు వేల టన్నుల చెత్త నిర్వహణ భారంగా మారుతుంది. కాలుష్యం పెరిగిపోతుంది.

కొండలుగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 

పాలు, బ్రెడ్ ప్యాకెట్స్ డెలివరీకి సైతం ప్లాస్టిక్ వాడుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాస్టిక్ కవర్లు, బబుల్ వ్రాప్స్, టేపులు ఎక్కువగా వాడుతున్నాయి. ఇవన్నీ ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్. రీయూజ్ కి ఆస్కారం ఉండదు. దీని వలన ప్లాస్టిక్ వ్యర్థాలు జమ అవుతున్నాయి. వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది.

వినియోగదారులు ఒకేసారి తమకు కావలసిన వస్తువులు అన్నింటిని ఆర్డర్ చేయడం లేదు. దీని వలన ప్రతి ఆర్డర్ ని ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఒకరోజులో 10 వస్తువులు ఆర్డర్ చేస్తే పది కవర్లు, వాటితో పాటు ప్యాకింగ్ మెటీరియల్స్ ఇంటికి చేరుతున్నాయి. చెత్త నిర్వహణలో జనాలకు సరైన అవగాహన లేదు. అలాగే అలసత్వం కారణంగా ప్లాస్టిక్ డ్రైనేజీలు, ల్యాండ్ఫిల్స్ లో చేరుతుంది. పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుంది.

కార్బన్ ఉద్ఘారాల పెరుగుదల 

వీలైనంత త్వరగా కస్టమర్ కి ఆర్డర్ చేర్చాలి. దాదాపు 10 నిమిషాల లోపే డెలివరీ ఇచ్చేయాలి. డెలివరీ ఏజెంట్లు ఒకే మార్గంలో ఉండే ఆర్డర్లను కలిపి తీసుకెళ్లే అవకాశం అన్ని సందర్భాల్లో ఉండదు. దీని వలన ఆర్డర్ బాయ్స్ ఎక్కువ సార్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ పరిణామం గాలిలో కార్బన్ ఉద్ఘారాలను పెంచేస్తుంది.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేల సంఖ్యలో డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారు. వీరు తమ ప్రయాణం కోసం పెట్రోల్ వాహనాలు వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్స్ చోటు చేసుకుంటున్నాయి. గాలిలో గ్రీన్ హౌస్ వాయువుల శాతం గణనీయంగా పెరుగుతుంది.

ప్లాస్టిక్ మేనేజ్మెంట్ ట్రబుల్స్ 

నిర్వహణ సామర్త్యానికి మించి భారతీయ నగరాల్లో ప్రతిరోజూ చెత్త పోగు అవుతుంది. దీనిని రీసైకిల్ చేసేందుకు మున్సిపాలిటీ ఇబ్బందులు పడుతున్నాయి. దానికి తోడు క్విక్ కామర్స్ కోసం వినియోగించే ప్యాకేజింగ్ వ్యర్థాలు దాదాపు రీసైకిలింగ్ కి అనువుగా ఉండవు. ఇదొక సమస్య.

ప్లాస్టిక్ కవర్లు రీసైక్లింగ్ విధానాన్ని కూడా క్లిష్టంగా మార్చేస్తున్నాయి. తడిచెత్త పొడిచెత్తలో ప్లాస్టిక్ కలిసిపోవడం వలన రీసైక్లింగ్ ప్రాసెస్ కఠినం అవుతుంది.

స్వచ్ఛంద మార్పు 

చట్టాలు, అవగాహనా సదస్సులు సమస్యలను దూరం చేయవు. స్వచ్ఛందంగా జనాల్లో చైతన్యం రావాలి. ఈ భూమిని, పర్యావరణాన్ని సురక్షితంగా కాపాడుకోవాలి. భావి తరాల వారికి అందించాలని అనే ఆలోచన రావాలి.

ప్యాకేజింగ్ సిస్టం: క్విక్ కామర్స్ సంస్థలు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కి బదులుగా రీసైక్లింగ్ కి అనువుగా ఉండే సంచులు, కాగితపు బ్యాగ్స్, బయోడీగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలు: ఫుడ్ డెలివరీ ఏజెంట్స్ పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు… ఈ-బైక్స్ వాడాలి. ప్రభుత్వాలు, సంస్థలు ఈ-బైక్స్ మాత్రమే వాడేలా ప్రోత్సహించాలి. చర్యలు తీసుకోవాలి. దీని వలన నగర కాలుష్యాన్ని అదుపు చేయవచ్చు.

లైఫ్ స్టైల్ మార్చుకోండి: వినియోగదారులు తమ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఒక్కో వస్తువును పది పర్యాయాలు ఆర్డర్ చేయడం మానుకోండి. కావలసిన వస్తువుల లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒకేసారి ఆర్డర్ చేయండి. అలాగే సమీపంలో దొరికే వస్తువుల కోసం క్విక్ కామర్స్ పై ఆధారపడటం ఆపేయడం. సరదాగా దగ్గర్లోని స్టోర్ కి వెళ్లి షాపింగ్ చేయండి.

సాంకేతికతతో చేకూర్చే సుఖాలను అనుభవించడం తప్పుకాదు. అదే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వీలైనంత తక్కువగా డెలివరీ యాప్స్ పై ఆధారపడటం పర్యావరణానికి మేలు చేస్తుంది.

Leave a Comment