ఆస్తి మూరెడు ఆశ బారెడు అనే సామెత ఉండనే ఉంది. స్థోమతకు మించి ఖర్చు చేసే పద్ధతికి జనాలు అలవాటు పడ్డట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. దీన్ని ”ఆస్పిరేషనల్ స్పెండింగ్” అంటున్నారు. అసలు ఆస్పిరేషనల్ స్పెండింగ్ అంటే ఏమిటీ? దీనికి కారణాలు ఏమిటో? చూద్దాం. సాధారణ భాషలో చెప్పాలంటే ఆర్థికంగా మన స్థాయి ఏమిటో మరచి, భవిష్యత్ లో మనం ఏ స్థాయికి చేరాలనుకుంటున్నామో ఆ స్థాయిలో ఖర్చు చేస్తూ… ఈ సమాజానికి తమ ఆడంబరం పరిచయం చేయాలనే తపన అనొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి బైక్ అవసరం. కార్ విలాసం కావచ్చు. బైక్ మాత్రమే మెయిన్టైన్ చేయగల స్థితిలో ఉన్న ఆ వ్యక్తి… కారు కొనడం, దాన్ని మైంటైన్ చేసేందుకు ఆదాయానికి మించి ఖర్చు చేయడమన్న మాట.
ఆస్పిరేషనల్ స్పెండింగ్ కి ఉదాహరణలుగా బ్రాండెడ్ దుస్తులు, కాఫీ షాప్స్-రెస్టారెంట్స్ లో విందులు, పబ్బుల్లో వినోదాలు, లగ్జరీ కార్లు చెబుతున్నారు. కేవలం సోషల్ మీడియా రీల్స్ కోసం ఖరీదైన విహార యాత్రలు చేస్తున్న వారిని కూడా మనం నేటి సమాజంలో చూడొచ్చు. ఇలా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్న వ్యక్తులు, కుటుంబాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలంలో దివాళా తీస్తున్నాయి.

ఆస్పిరేషనల్ స్పెండింగ్ కు కారణాలు
సోషల్ మీడియా: యువతను ఆస్పిరేషనల్ స్పెండింగ్ కు ప్రోత్సహిస్తున్న ప్రధాన అంశాల్లో సోషల్ మీడియా ఒకటి. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ తో పాటు పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో దర్శనమిచ్చే రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్, లగ్జరీలు చూసి… తాము కూడా అలానే విలాసవంతంగా జీవించాలని కోరుకుంటున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ జీవితం ఫేక్ అనే విషయం అర్థం చేసుకోవడం లేదు.
ఈజీ క్రెడిట్: అప్పు దొరకడం అత్యంత సులువుగా మారింది. నాలుగు అంకెల జీతం తీసుకునే ఉద్యోగికి కూడా పదుల సంఖ్యలో బ్యాంకులు క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా క్షణాల్లో లోన్స్ ఇచ్చే వందల యాప్స్ సిద్ధంగా ఉన్నాయి. చేతిలో డబ్బులు లేకపోయినా… సులభంగా అప్పు దొరకడంతో ఆస్పిరేషనల్ స్పెండింగ్ కి మార్గం సుగమం అవుతుంది. వివిధ బ్యాంక్స్, యాప్స్ లో అప్పులు చేసి, అవి తీర్చలేక ప్రాణాలు తీసుకున్న యువకులు కోకొల్లలు.
సోషల్ స్టేటస్: మన తోటివారికి సమానంగా ఉండాలని, వారిలానే మంచి బట్టలు వేసుకోవాలి, కారులో తిరగాలి అనుకోవడం, తాము కూడా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నామని ఒక భ్రమలో బ్రతకడం మరొక కారణం, సమాజంలో గౌరవం, హోదా దక్కాలంటే లగ్జరీగా బ్రతకాలనే అపోహతో ఆస్పిరేషనల్ స్పెండింగ్ కి పాల్పడుతున్నారు.
ఆస్పిరేషనల్ స్పెండింగ్ – సమస్యలు
ఆస్పిరేషనల్ స్పెండింగ్ మొదట్లో కోరుకున్న సంతోషం, గుర్తింపు ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఒత్తిడిలోకి నెడుతుంది.
అప్పుల ఊబి: సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేయడం వలన… ప్రతినెలా అప్పు చేయాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐ ల భారం అధికం అవుతుంది. అసలు విషయం తెలుసుకునే లోపే ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుతారు. అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు.
ఆదాయం నిల్: ఆస్పిరేషనల్ స్పెండింగ్ తో సేవింగ్స్ నిల్ అవుతాయి. భవిష్యత్ అవసరాలకు, మెడికల్ ఎమర్జెన్సీకి కావలసిన నిధులు మాయం అవుతాయి. చివరికి రిటైర్మెంట్ ప్లానింగ్ కి కూడా డబ్బులు దాచుకోలేరు. సేవింగ్స్ లేకపోతే ప్రతి అవసరానికి కోసం పరిగెత్తాల్సి వస్తుంది.
మానసిక ఒత్తిడి: ఆస్పిరేషనల్ స్పెండింగ్ దీర్ఘకాలంలో మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. పెరిగిన అప్పులు తీర్చలేరు. అదే సమయంలో ఒకప్పటి లగ్జరీ లైఫ్ ని వదులుకోలేక డిప్రెషన్ లోకి జారుకుంటారు. ఒత్తిడి అనేక అనారోగ్యాలకు కారణం కావచ్చు.
బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం ఎలా?
ఆశలు, కోరికలు ఉండటం తప్పేమీ కాదు. కానీ వాటిని నెరవేర్చుకునే స్థాయిలో మన సంపాదన ఉండాలి. ఆదాయం లేకుండా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తే సమస్యలు తప్పవు.
50/30/20 రూల్ పాటించండి: మీ ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపుకు కేటాయించండి. ఈ రూల్ ని విధిగా పాటిస్తే ఆర్థికంగా మీరు పటిష్ట స్థితిలో ఉంటారు. కోరికలు తగ్గించుకుని, పొదుపు శాతం ఇంకా పెంచితే మరింత భద్రత మీ సొంతం అవుతుంది.
24 గంటల నియమం: ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలని అనిపిస్తే… ఒక 24 గంటలు వెయిట్ చేయండి. అది నిజంగా అవసరమా? లేక తాత్కాలికమా? అని మీలో మీరు చర్చించుకోండి. నిజంగా అవసరం, దాన్ని అఫర్డ్ చేయగలం అనుకుంటే మాత్రమే కొనుగోలు చేయండి.
అవసరాలు-కోరికలు: అవసరాలకు, కోరికలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా గుర్తించండి. అవసరాలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అవసరాలను పక్కన పెట్టి కోరికలకు ఖర్చు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈ సూత్రాలు పాటిస్తే ఆస్పిరేషనల్ స్పెండింగ్ ని కట్టడి చేయవచ్చు.
