మన ఆరోగ్యానికి, మానసిక స్థితికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మద్యం సేవించడం అనే అలవాటు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మద్యం తాగడం వల్ల కేవలం శారీరక రుగ్మతలే కాకుండా మానసిక ఒత్తిళ్లు కూడా కలుగుతాయి. మద్యం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. మద్యం అలవాటు ఉన్నవారిలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. అలాగే సమాజంలో గౌరవం ఉండదు.
కాబట్టి మద్యానికి బానిస అయితే, ఆ అలవాటు నుండి బయటపడేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. మద్యపానానికి బదులుగా ఆరోగ్యకరమైన అలవాట్లకు మారాలి. మైండ్‌ఫుల్ డ్రింకింగ్ వంటి పద్దతులతో మద్యం తాగాలనే ఆలోచన నుండి బయటపడొచ్చు. కొన్ని రకాల ఆరోగ్యకరమైన పానీయాలు, జీవన పద్ధతులు అందుకు సహకరిస్తాయి. అవేమిటో తెలుసుకుందాం…
మద్యం వల్ల కలిగే నష్టాలు
మద్యం మానవ శరీరానికి, మెదడుకు, గుండెకు హాని కలిగిస్తుంది. అధికంగా మద్యం తాగడం వలన లివర్ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు వస్తాయి. అంతేకాకుండా, మద్యం మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది, ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలను కలిగిస్తుంది. మద్యం వినియోగం వల్ల వ్యక్తులు తమ పనులపై ఏకాగ్రత కోల్పోతారు.

మైండ్‌ఫుల్ డ్రింకింగ్ అంటే ఏమిటి?
మైండ్‌ఫుల్ డ్రింకింగ్ అంటే మద్యం తాగే ముందు లేదా… తాగే సమయంలో మన ప్రవర్తన, భావనలను గ్రహించడం. మద్యం ఎందుకు తాగాలని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎంత తాగుతున్నామో… అది మన శరీరం, మనసుపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో గుర్తు చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్, ఆర్థిక స్థితిగతులను మననం చేసుకోవాలి. మైండ్ ఫుల్ డ్రింకింగ్ తక్కువ మోతాదులో మద్యం తాగేందుకు లేదా పూర్తిగా మద్యాన్ని వదిలేందుకు తోడ్పడుతుంది.
మైండ్‌ఫుల్ డ్రింకింగ్ పద్ధతులు
జాగ్రత్తగా తాగడం: ప్రతి సిప్ ని ఆస్వాదించి, దాని రుచి, వాసనను గమనించడం ముఖ్యం.
కారణాలను గుర్తించడం: మద్యం తాగడానికి కారణాలను గుర్తించాలి. ఒత్తిడి, ఆందోళన, లేదా మరేదైనా కారణాల వల్ల మద్యం తాగుతున్నారా?నష్టాలు: మద్యం తాగడం వల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకోవాలి. అప్పుడు మద్యం తాగాలనే కోరిక బలహీనపడుతుంది.
ఆహారం తీసుకోవడం: మద్యం తాగే సమయంలో హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మద్యం శరీరం మీద చూపే ప్రభావాన్ని తగ్గిస్తుంది.
కుటుంబం మద్దతు: మద్యం తాగడం నియంత్రించుకోవడానికి లేదా పూర్తిగా మానుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.
మద్యపానానికి ప్రత్యామ్నాయాలు
మాక్‌టెయిల్స్: సోడా నీరు, నిమ్మరసం, లేదా మరేదైనా పండ్ల రసాలను ఉపయోగించి తయారు చేసిన కాక్‌టెయిల్స్ ప్రయత్నించవచ్చు. ఇవి మద్యం తాగే కోరికను బలహీనపరుస్తాయి. లేదా తక్కువ మోతాదు మద్యం తీసుకునేలా పురిగొల్పుతాయి.
ఫెర్మెంటెడ్ డ్రింక్స్: కంబూచా లేదా కెఫిర్ వంటి పానీయాలు జీర్ణవ్యవస్థకు మంచివి. మద్యం తాగేవారికి జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. కెఫిర్ తాగడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.
హెర్బల్ టీ: పుదీనా, దాల్చినచెక్క, లేదా ఇతర మూలికలతో తయారు చేసిన టీలను కూడా ప్రయత్నించవచ్చు.
పండ్ల రసాలు: తాజా పండ్లతో, కూరగాయలతో తయారు చేసిన రసాలను త్రాగడం వల్ల శరీరం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో జ్యూస్లు కూడా చేర్చుకోండి.
కొత్త అలవాట్లు: కొత్త కొత్త ఆరోగ్యకరమైన హాబీలను నేర్చుకోవడం వల్ల మద్యం తాగాలనే ఆలోచనలు తగ్గుతాయి. సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, వ్యాయామం, కుటుంబ సభ్యులతో గడపడం వంటి అలవాట్లు మద్యం మహమ్మారి నుండి బయటపడేస్తాయి. నిపుణుల సలహా: ఒకవేళ మద్యం వినియోగం చాలా ఎక్కువగా ఉంటే, ఒక డాక్టర్ లేదా థెరపిస్ట్ సలహా తీసుకోవాలి. అలాగే పలు వెబ్ సైట్స్ గొప్ప సమాచారం అందిస్తున్నారు. ఆల్కహాల్ క్విట్టింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాటిలో మెంబర్ అవ్వండి.
మద్యపానానికి బదులుగా ఆరోగ్యకరమైన అలవాట్లు, మైండ్‌ఫుల్ డ్రింకింగ్ అలవాట్లు చేసుకోవడం ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మన శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది. మద్యం అలవాటును క్రమంగా తగ్గించుకుంటూ, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కృషి చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కేవలం మనకే కాకుండా, కుటుంబ సభ్యులకు కూడా సంతోషం కలుగుతుంది.
